శ్రీ శివ మహా పురాణము - 210



🌹 .  శ్రీ శివ మహా పురాణము - 210  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

46. అధ్యాయము - 1

🌻. సంక్షేప సతీచరిత్రము - 3 🌻

అథగతా సతీ తత్ర శివాజ్ఞామధిగమ్య సా | అనాహూతాపి దక్షేణ గర్విణా స్వపితుర్గృహమ్‌ || 27

విలోక్య రుద్ర భాగం నో ప్రాప్యావజ్ఞాం చ తాతతః | వినింద్య తత్ర తాన్‌ సర్వాన్‌ దేహ త్యాగమథాకరోత్‌ || 28

తచ్ఛ్రుత్వా దేవ దేవేశః క్రోధం కృత్వా తు దుస్సహమ్‌ | జటాముత్కృత్య మహతీం వీరభద్రమజీజనత్‌ || 29

సగణం తం సముత్పాద్య కిం కుర్యామితి వాదినమ్‌ | సర్వాపమాన పూర్వం హి యజ్ఞధ్వంసం దిదేశ హ || 30

అపుడు సతీదేవి శివుని ఆజ్ఞను పొంది, గర్విష్ఠియగు దక్షుడు ఆహ్వానించకపోయినా, పుట్టింటికి విచ్చేసెను (27).

ఆమెకు ఆ యజ్ఞములో రుద్రుని భాగము కానరాలేదు. దానిని ఆమె తండ్రి చేసిన అవమానముగా గ్రహించి, అచట ఉన్న వారందరినీ నిందించి, తరువాత దేహమును విడిచి పెట్టెను (28).

దేవదేవుడగు శివుడు ఈ వృత్తాంతమును విని, సహింపరాని కోపమును పొంది, పెద్దజటనొకదానిని పీకి వీరభద్రుని సృష్టించెను (29).

వీరభద్రుని గణములతో సహా సృష్టించెను. 'నేను ఏమి చేయవలెను?' అని ప్రశ్నించిన వీరభద్రునకు అందరినీ అవమానించి, యజ్ఞమును ధ్వంసము చేయుమని ఆదేశించెను (30).

తదాజ్ఞాం ప్రాప్య స గణాధీశో బహుబలాన్వితః | గతోsరం తత్ర సహసా మహాబల పరాక్రమః || 31

మహోపద్రవమాచేరుర్గణాస్తత్ర తదాజ్ఞయా | సర్వాన్‌ స దండయామాస న కశ్చిదవ శేషితః || 32

విష్ణుం సంజిత్య యత్నేన సామరం గణసత్తమః | చక్రే దక్ష శిరశ్ఛేదం తచ్ఛిరోsగ్నౌ జుహావ చ || 33

యజ్ఞధ్వంసం చకారాశు మహోపద్రవమాచరన్‌ | తతో జగామ స్వగిరిం ప్రణనామ ప్రభుం శివమ్‌ || 34

గణాధీశుడగు ఆ వీరభద్రుడు శివుని యాజ్ఞను పొంది గొప్ప సైన్యముతో కూడిన వాడై శీఘ్రముగా అచటకు వెళ్లెను. గొప్ప బలము, పరాక్రమముగల (31),

ఆ వీరభద్రుని ఆజ్ఞచే గణములచట గొప్ప ఉపద్రవమును కలుగజేసిరి. ఆతడు ఎవ్వరినీ మిగల్చకుండగా, అందరినీ దండించెను (32).

గణశ్రేష్ఠుడగు నాతడు ప్రయత్న పూర్వకముగా, దేవతలతో కూడియున్న విష్ణువును జయించి, దక్షుని తలను నరికి, దానిని అగ్నియందు వ్రేల్చెను (33).

గొప్ప ఉపద్రవమును కలిగించి, ఆతడు శీఘ్రముగా యజ్ఞమును ధ్వంసము చేసి, తరువాత కైలాస పర్వతమును చేరి, శివప్రభువకు నమస్కరించెను (34).

యజ్ఞధ్వంసోsభవచ్చేత్థం దేవలోకే హి పశ్యతి | రుద్రస్యానుచరైస్తత్ర వీరభద్రాదిభిః కృతః || 35

మునే నీతిరియం జ్ఞేయా శ్రుతిస్మృతిషు సంమతా | రుద్రే రుష్టే కథం లోకే సుఖం భవతి సుప్రభౌ || 36

తతో రుద్రః ప్రసన్నోభూత్‌ స్తుతిమాకర్ణ్య తాం పరామ్‌ | విజ్ఞప్తిం సఫలాం చక్రే సర్వేషాం దీనవత్సలః || 37

పూర్వ వచ్చ కృతం తేన కృపాలుత్వం మహాత్మనా | శంకరేణ మహేశేన నానాలీలావిహారిణా || 38

వీరభద్రుడు మొదలగు రుద్రాను చరులు, దేవతలు చూచుచుండగా, ఈ తీరున యజ్ఞమును ధ్వంసమొనర్చిరి (35).

ఓ మహర్షీ! మహా ప్రభువగు రుద్రుడు కోపించినచో, లోకములో సుఖమెట్లుండును? ఈ నీతిని వేదములు, స్మృతులు చెప్పుచున్నవి. మనమీ నీతిని తెలియవలెను (36).

అపుడు ఆ దేవతలందరు చేసిన గొప్ప స్తోత్రమును విని, దీనవత్సలుడగు రుద్రుడు ప్రసన్నుడై, వారి విజ్ఞప్తిని సఫలము చేసెను (37).

శుభకరుడు, మహేశ్వరుడు,అనేక లీలలను ప్రదర్శించి విహరించువాడు, మహాత్ముడు నగు రుద్రుడు ఎప్పటివలెనే కరుణను చూపెను (38).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

30.Aug.2020

No comments:

Post a Comment