కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 40


🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 40  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 4 🌻

ఈ రకంగా ఆత్మ వస్తువు గురించి శాస్త్ర జ్ఞాన పద్ధతిగా, తర్క పద్ధతిగా - రెండు పద్ధతులున్నాయట.

శాస్త్రం ఎప్పుడూ నిన్ను తర్కానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణ వల్ల నీలో బుద్ధి వికాసం పూర్తవుతుంది. ఇది శాస్త్ర ప్రయోజనం. ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసినా కూడా ఆ అధ్యయనము నీ బుద్ధి వికాసాన్ని పూర్తిచేస్తుంది - తార్కికమైనటువంటి పద్ధతిలో.

అసలు ఈ తర్కానికి సంబంధించినటువంటిది ఒక సూత్రం వుంది. ఏమిటంటే తర్కానికి నిలబడనిది జ్ఞానం కాదు. లాజికల్ ఈక్వేషన్ [Logical Equation] కి నిలబడకపోయినట్లయితే - తర్కానికి నిలబడనటువంటిది జ్ఞానం కాదు.

ప్రక్కనే దానికి కంటిన్యుఏషన్ ఇంకొక పాదం కూడా వుంటుంది. తర్కించేవాడు జ్ఞాని కాదు. నువ్వు తర్కిస్తూ వున్నంతకాలం నువ్వు ఆత్మజ్ఞానివి ఎప్పటికీ కాలేవు అని అసలు తర్కమే చెయ్యనంటావా అప్పుడు నీకు జ్ఞానం కలిగే అవకాశమే లేదు.

కాబట్టి “శాస్త్ర దృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మ నిశ్చయమ్”. ఇది క్రమ ముక్తికి మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే తప్పక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి.

అధ్యయనం చేసి బాగా తర్కించాలి. తర్కించగలిగిన విధానములు ఎన్ని వున్నాయో ఆ షట్ ప్రమాణ సహిత పద్దతిగా వాటిని బాగా తర్కించాలి. ఆ తర్కించడం వల్ల ఏమవుతుంది? నీ బుద్ధివికాసం పూర్తవుతుంది. గిన్నెకి నెయ్యి ఆధారమా , నేతికి గిన్నె ఆధారమా.

ఒక నెయ్యి గిన్నె పట్టుకున్నాడట ఒకాయన. నెయ్యి గిన్నె పట్టుకుని ఈ ప్రశ్న వచ్చిందట. ఏమిటదీ? గిన్నె - గిన్నె కాదిది - నేతి గిన్నె. నేతికి గిన్నె ఆధారమా, గిన్నె కి నేయి ఆధారమా అని బోర్లించాడు. ఇప్పుడు గిన్నెలో వున్నా నెయ్యంతా ఏమైంది? నేలపాలయింది. అర్ధమైందా? మన తర్కం అంతా ఇలానే వుంటుంది.

నెయ్యి ప్రధానమా గిన్నె ప్రధా నమా మనకిప్పుడు. నెయ్యి ప్రధానం. కాని గిన్నె ప్రధానం అనుకుని, గిన్నెని పట్టుకుని నెయ్యి పారబోశాం. ఇట్లా ఏది ప్రధానమో ఏది అప్రధానమో తెలియాలి అంటే తప్పక తర్కాన్ని ఆశ్రయించాలి.

అంటే ఈ విచారణలో కొన్ని విమర్శలున్నాయి. ఈ విమర్శ ఎలా చేయాలి అంటే జడచేతన విమర్శ, ఆధార ఆధేయ విమర్శ, కార్యకారణ విమర్శ, చేతనా అచేతన విమర్శ, నిత్య అనిత్య విమర్శ, ఆత్మ అనాత్మ విమర్శ, సదసత్ విమర్శ, దృగ్ దృశ్య విమర్శ, ధ్యాత-ధ్యేయము-ధ్యానము అనేటటువంటి త్రిపుటి యొక్క విమర్శ, పంచకోశ విచారణ, అవస్థాత్రయ విచారణ, శరీరత్రయ విచారణ , దేహత్రయ విచారణ - ఈ రకంగా అనేక పద్దతులుగా ఈ తర్కాన్ని అనేటటువంటి అవధిని నిన్ను దాటించేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట ఆత్మా విచారణలో. ఇన్ని రకాలైనటువంటి విమర్శలని నీకు సాధికారత కలిగేటట్లుగా చేస్తారనమాట.

ఇది ఆత్మజ్ఞానాన్ని బోధించే విధానం. నీకు ఎట్లా చెప్పాడయ్యా? నువ్వు ఏది చెప్పినా దానిని ఒక విమర్శ రీత్యా దానిని నిరూపించడమో, ఖండించడమో, నిరసించడమో చేస్తాడనమాట.

తద్వారా ఏమౌతావు నువ్వు? ఆ విమర్శలో బాగా బలవత్తరమైనటువంటి సమర్ధతని, బుద్ధిబలాన్ని నువ్వు సాధిస్తావనమాట. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

30 Aug 2020

No comments:

Post a Comment