రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
66. అధ్యాయము - 21
🌻. సతీ శివుల విహారము - 2 🌻
అంగదములను, కంకణములను, ఉంగరములను మరల మరల వాటి స్థానములనుండి విడదీసి, శివుడు వాటిని మరల అదే స్థానములో అమర్చెడి వాడు (22). కాలికా! నీతో సమానమైన వర్ణము గల ఈ నీ చెలికత్తె వచ్చు చున్నది అని శివుడు పిలిచెడి వాడు. ఆమె ఆ దిశలో చూచుచుండగా, ఆమె ఉన్నతమగు స్తనములను దర్శించుట కొరకై అట్లు పిలిచెడివాడు (23).
ఒకప్పుడు మన్మథవికారముచే ఉన్మత్తమైన మానసము గల ఆ ప్రమధగణాధిపతి నర్మకేళి యందు ప్రీతిగల ఆమెతో గూడి ఆనందముతో నర్మకేళి యందు లగ్న మయ్యెడి వాడు (24). శంకరుడు పద్మములను, సుందరమగు పుష్పములను తెచ్చి సర్వావయవముల యందు ఆదరముతో పుష్పాభరణములను సమకూర్చెడివాడు (25).
భక్తవత్సలుడగు మహేశ్వరుడు కైలాసమునందు రమ్యములైన లతా గృహములన్నింటి యందు ప్రియురాలగు సతీదేవితో గూడి విహరించెను (26). ఆయన ఆమె లేనిదే ఎచటికైననూ వెళ్లడు; ఒంటరిగా ఉండడు; ఏ పనినీ చేయడు. శంకరుడు ఆమె లేనిదే క్షణమైననూ సుఖముగా నుండలేకపోయెను (27).
కైలాస పర్వత లతా గృహము లందు చిరకాలము విహరించి, శివుడు తన ఇచ్ఛచే హిమవత్పర్వతమును స్మరించి అచటకు వెళ్ళెను (28). మన్మథుడు శంకరుని సమీపమునందు ప్రవవేశించగానే, వసంతుడు కూడ ఆ ప్రభువు యొక్క హృదయములోని భావమును గ్రహించి తన ప్రభావమును విస్తరించెను (29).
వృక్షములన్నియు పుష్పించినవి. లతాదులు పుష్పించినవి. సరస్సులు వికసించిన పద్మములతో నిండినవి. పద్మములు తుమ్మెదలతో శోభిల్లినవి (30). అచట వసంతర్తువు ప్రవేశించ గానే, మలయమారుతము వీచెను. మంచి సువాసన గల పుష్పములు పడుటచే జలములు పరిమళ భరితములాయెను (31).
సంధ్యా కాలము నందలి చంద్రుని వలె ప్రకాశించే మోదుగు పుష్పములు ఆ వృక్షములు అనే యువతుల అధరములపై వసంతుని చిహ్నములు వలె, మన్మథుని అస్త్రము వలె రాజిల్లెను (32). సరస్సులయందు పద్మములు ప్రకాశించినవి. మెల్లగా వీచే వాయుదేవత సర్వమానవులను మోహింపజేయుటకు సంసిద్ధమగు చుండెను (33).
శంకరుని సన్నిధిలో నాగకేశర వృక్షములు బంగరువన్నె గల పుష్పములతో మన్మథిని జెండాల వలె మనోహరముగా ప్రకాశించినవి (34). లవంగముల తీగ పరిమళ గంధముచే వాయువును సువాసితము చేసి కామి జనుల మనస్సులను మిక్కిలి మోహింపజేసెను (35).
మామిడి చిగుళ్లను భక్షించి మధురముగా కూయు కోయిలలు మన్మథ బాణముల సముదాయమువలె నున్న మామిడి చిగుళ్లు అనే పర్యంకములపై మన్మథపీడితములై భాసిల్లెను (36). నిర్మలములగు సరస్సులు వికసించిన పద్మములతో కూడి, ఆత్మ జ్యోతి యొక్క ప్రకాశముతో నిండియున్న మహర్షుల హృదయముల వలె ప్రకాశించెను (37).
మంచు తునకలు సూర్యరశ్ముల సంగమముచే నీరుగారిని హృదయము గలవై అంతరిక్షములోనికి ఆవిరి రూపములో ఎగసినవి (38). అపుడు రాత్రులు చంద్రునితో, మంచుతో కూడియున్నవై ప్రియునితో కూడిన అందమైన యువతులవలె నిర్మలముగా ప్రకాశించుచున్నవి (39).
ఆ సమయములో మహాదేవుడు భార్యతో గూడి ఆ గొప్ప పర్వతమునందు లతా గృహములలో, మరియు నదులలో యథేచ్ఛగా చిరకాలము రమించెను (40). ఓ మహర్షీ! శివుడు ఆమె లేనిదే క్షణమైననూ శాంతముగా నుండలేక పోయెను. అదే తీరున, ఆ దాక్షాయణి కూడా ఆయనతో సమానముగా విహరించుచూ ప్రకాశించెను (41).
సంభోగ విషయములో సతీదేవి ఆయన మనస్సునకు ప్రీతిని కలిగించెను. ఆమె శివుని దేహములో ప్రవేశించు చున్నదా యన్నట్లు , ఆయన శక్తిని ఆ స్వాదించు చున్నదా యన్నట్లు ఉండెను (42). శివుడు ఆమె దేహమునంతనూ తాను స్వయముగా రచించిన పుష్పమాలలతో నూతన గృహమా యన్నట్లు అలంకరించెను (43).
శివుడు సల్లాపములతో, చూపులతో, హాస్యములతో, మరియు ప్రసంగములతో ఆ సతీదేవికి ఆ క్షణమునందే ఆత్మ జ్ఞానమును బోధించినాడా యన్నట్లుండెను (44). ఆమె ముఖార వింద సౌందర్యమును పానము చేసి హరుడు ఆనందముగా నుండెను. ఆయన ఆ సుందరితో అనేక విశేషములతో గూడిన గార్హస్థ్యములో ప్రేమావస్థను బడసెను (45).
ఆమె ముఖ పద్మము యొక్క సుగంధము చేత, ఆమె సౌందర్యములచేత, నర్మకేళుడు చేత బంధింపబడిన శివునకు, త్రాళ్లచే బంధిపబడిన మహాగజమునకు వలె, ఇతర చేష్టలు లేకుండెను (46).
మహేశ్వరుడు దక్షపుత్రితో గూడి ఈ తీరున హిమ వత్పర్వతమునందలి లతాగృహములలో, గుహలలో ప్రతిదినము రమించెను. ఓ దేవర్షీ! ఆయన ఇట్లు క్రీడించుచుండగా దివ్యమానముచే ఇరవై అయిదు సంవత్సరములు గడచినవి (47).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండలో సతీశివక్రీడా వర్ణనమనే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Nov 2020
No comments:
Post a Comment