✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -40 🌻
అలా చేసుకోకుండా గుణత్రయాలను దాటి, సర్వసాక్షిత్వాన్ని ఆశ్రయించి, ఆ లక్ష్యాన్ని పొందాలని, ప్రత్యగాత్మ స్థితిలో నిలకడ చెంది ఉందాలి అని, ఉత్తమమైనటువంటి లక్ష్య సాధనను స్వీకరించి, ఈ సత్వగుణాన్ని కూడా తప్పక దాటాలి. ఇది కూడా తమోగుణావస్థ వంటి నిద్రావస్థ వంటిదే! నిద్ర ఎంతసేపు పోతాడు? సంతృప్తి కలిగేంత వరకూ పోతాడు. ఇంకా తరువాత పడుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి.
ఇంకా పడుకుంటే ఇంకా తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. అట్లాగే ఈ సత్వగుణాన్ని కూడా మనము ఒక నిద్రపోయేటప్పుడు దుప్పటి అవసరమా? కాదా? అంటే, ఎంతవరకూ అవసరం? దుప్పటిని విదిలించి మెలకువలోనికి ఎట్లా వచ్చేస్తున్నాము.
అట్లాగే ఈ సత్వగుణం అనేటటువంటి దుప్పటిని తీసి అవతల పారేయాలి. ఈ ఆవరణను తొలగించుకోవాలి. ఈ ఆశ్రయాన్ని విడవాలి. విడిచి ‘స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానంలో నిలవాలి’ అనేటువంటి ఉత్తమ ఉపదేశాన్ని ఇక్కడ యమధర్మరాజు గారు నచికేతునకు అందిస్తున్నారు.
హరిః ఓం
ప్రశ్న: స్వామీ, శ్రవణ మననాలు రెండు సాధనాలు. వాటి రిజల్ట్ [result] నిధి ధ్యాసలు అని విన్నాను స్వామి. తప్పా అండి అది?
సమాధానం: వాటిలో కలిగేటటువంటి పరిణామ ఫలం నీ అంతరిక పరిణామ ఫలం ఏదైతే వుంటుందో అది నిధి ధ్యాసలుగా మారుతుంది. నిజానికి సాధనాస్థితులలో ఆ నాలుగు స్థితులే. కానీ శ్రవణ మననాలే సరిగ్గా లేకపోతె నిధి ధ్యాసలు రావు కదా!
దీనికి ఒక ఉదాహరణ చెపుతా చూడు. నీవు.. నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని అనుకొంటూ జీవిస్తావా? అనుకోవడం లేదుగా? మనిషిగా సహజంగా జీవిస్తావు. మరి సహజంగా ఎలా వున్నావు? శ్రవణం చేశావా? మననం చేశావా? లేదే? సహజంగా నిధి ధ్యాసలలోనే వున్నావుగా! మరి సహజంగా నేను ఆత్మ స్వరూపుడుగా వుండాలిగా! మరి ఉండడం లేదుగా. ఎందువల్ల? శరీరం నేను అనేటటువంటి పద్ధతిగా సహజం అయ్యావు కాబట్టి.
కాబట్టి ఇప్పుడు మరలించాలి అంటే ఏమి చెయ్యాలి? నేను ఆత్మ స్వరూపుడు అనే భావాన్ని శ్రవణ మననాదుల ద్వారా అందించాలి. అందిస్తే, చేయగా, చేయగా, చేయగా.. కొంత కాలానికి ఏమైపోతుంది నీకు. నీ నామ రూపాలని నీవు మరచిపోతావు. నీ శరీరం నేను అనే భావన నుంచి మరచిపోతావు. మరచిపోయి క్రొత్తగా ప్రవేశపెట్టింది ఏమిటి ఇప్పుడు? నేను ఆత్మ స్వరూపుడు అనే భావాన్ని ప్రవేశపెట్టావు. ఆ భావనలో సహజం అయిపోతావు. ఎప్పుడైతే అందులో ఆ స్థితిలో సహజం అయిపోయావో అప్పుడు ఏమైంది? పాత్రోచితమైనటువంటివి కదా! .
నేను భార్యని, నేను అత్తగారిని, నేను అమ్మ గారిని, నేను స్త్రీ ని, నేను పురుషుడను ఇవన్నీ శరీర గతమైనటువంటి సంబంధోచితమైనటువంటివి. అంతే కదా! మరి అప్పుడు ఇవేవి సత్యం కాదు అని ఎవరు చెప్పక్కర్లేదు. నేను ఆత్మస్వరూపుడు అన్న భావనలో నువ్వు స్థిరం అయిపోతే నిధి ధ్యాసలుగా మారిపోయింది.
ఇప్పుడు సదా ఎక్కడ ఉంటావు అంటే, దృష్టి భ్రూమధ్యం నుంచి సహస్రారానికి, సహస్రారం నుంచి భూమాకి ప్రయాణం చేస్తుంది. ఆ ద్వాదశాంతం అయినటువంటి భూమా స్థితిలో సహజంగా నిలకడ కలిగి వున్నటువంటి వాడికి శరీర స్ఫురణ కలుగడం లేదు. శరీరగత సంబంధాల యొక్క స్ఫురణ కలుగడం లేదు. సదా సమాధి నిష్ఠుడై ఉంటాడు.
మరి ఆ సమాధి నిష్ఠలో ఏమి ఉనాయి అంటే నిధి ధ్యాసలే ఉన్నాయి. మరి ఆ నిధి ధ్యాస వరకు వెళ్ళాలిగా! శ్రవణ మననాదులను, నిధి ధ్యాసలు అయ్యేటట్లుగా చెయ్యాలిగా! ఆ షడ్ విధ సమాధి నిర్ణయాన్ని పొందాలిగా! ఆ సమాధికి అవతల ఉన్నటువంటి స్థితిలో నిలకడ కలిగి వుండాలి గా! ఆ స్థితి వలన నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందవచ్చు.
నీవు ఆత్మ నిష్ఠుడవు, బ్రహ్మ నిష్ఠుడవు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని సమాధి నిష్ఠ అనే పునాది గానే పూర్తి చేయాలి. వేరే మార్గం లేదు. కాబట్టి సమాధి నిష్టను పొందడం, బాహ్యం నుంచి విరమించినపుడు ఉత్తమమైన లక్ష్యముగా స్వీకరించాలి. మరలా అక్కడ నుంచి తదుపరి ప్రయాణన్ని పూర్తి చేయాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Nov 2020
No comments:
Post a Comment