భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 185


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 185 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. విశ్వామిత్రమహర్షి - 5 🌻


28. సత్వగుణంచేత-పుణ్యశీలి కాబట్టి-వైశ్యుడిస్తాడు, క్షత్రియుడు క్షాత్ర గుణంతో ఇస్తాడు. బ్రాహ్మణుడు లోభగుణం కలిగి ఉంటాడు భయస్థుడు కాబట్టి. సత్వగుణంచేత ఇతడు దాత కాలేడు అనిచెప్పి, అనేక స్మృతులలో కూడా ఉంది. అయితే ఎవ్వరూ చేయలేని దానం బ్రాహ్మణుడిని చేయమని స్మృతిలో ఒకచోట చెప్పబడింది. తపస్సుచేసి దానిని దానంచెయ్యమని ఉంది.

29. అందులోనూ, తపస్సుచేసి ఆ ఫంలాన్ని ధారపోస్తే సహజంగా ముక్తి లభిస్తుంది. అందుకనే బ్రాహ్మణుడు చేసేవన్నీకూడా లోకానుగ్రహంకోసమే అంటారు. యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆ ఫలాన్ని లోకపాలకులైన ఈశ్వరుడు-బ్రహ్మలకు, పరమేశ్వరభావనతో అర్పణం చెయ్యటం-పరమేశ్వరార్పణం. అలా చేస్తే లోకానికి క్షేమం కలుగుతుందని, అలా చెయ్యమని చెప్పారు. (బ్రాహ్మణుడు ధనం నిల్వపెట్టుకోకూడదు అని ఒక సూచన)

30. ఆ మాటకొస్తే ఐశ్వర్యవంతులయిన బ్రాహ్మణులున్నారు, తపోవృత్తియందుండేటటువంటి బ్రాహ్మణులు; అంతేగాక లోకంలో, సంఘంలో ప్రవర్తించే బ్రాహ్మణులు కూడా ఉన్నారు. తరువాత యుగములు మారినకొద్దీ వాళ్ళల్లో అనేక మార్పులు వచ్చాయి. అనేక ధర్మాలు బ్రాహ్మ్యంలో క్షాత్రం, క్షాత్రంలో బ్రాహ్మణ్యం ఇలాగ సంకీర్ణమయిన ధర్మములు వచ్చాయి.

31. ఈ యుగానికి ఈ ధర్మమని అలాగ కచ్చితంగా గీతలుగీసి విడిగా చూపించటానికి లేదు. క్షాత్రలక్షణం కలిగిన బ్రాహ్మణులు, బ్రాహ్మణుడయిన క్షత్రియుడు, ఇలాగ చెప్పుకుంటుంటే అనేక ధర్మములు ఒకదానిక్తో ఒకటి కలిసిపోతాయి. కలిలో ప్రధానమయినది, అందరూ విధిగా నిర్వర్తించవలసింది సత్యధర్మము. కలిలో అంతఃశౌచము చెప్పబడింది.

32. మనోబుద్ధి చిత్తముల శుచి ముఖ్యం. వందమాట్లు స్నానంచేసి, అంతఃకరణలో శౌచంలేనటువంటివాడు వ్యర్థుడు. శరీరానికి శుచి అనేమాట అసలు వర్తించనే వర్తించదు. ఎన్నిసార్లు స్నానంచేసినా లోపల మాలిన్యం అనేది ఉండనేఉంది కదా! స్నానంచేసేది కేవలం చర్మం మాత్రమే కదా! స్నానంవలన లోపలి వస్తువు క్షాళనమవుతుందా! చర్మాన్ని శుభ్రపరచుకోవడమే స్నానం అవుతుందిగాని, దీనివలన శుచిని పొందాడని అనుకోవటం పొరపాటే అవుతుంది.

33. పూర్వయుగాలలో శరీరకశౌచముకూడా చాలా గొప్పగా ఉండేది. యోగబలంచేత వాళ్ళు నిరాహారులుగా ఉండేవాళ్ళు. ఆహారం లేకుండా ఎందుకు తపస్సు చేయాలి? శౌచంతో నిరాహారంగా తపస్సుచేయటం వాళ్ళ ఉద్దేశ్యం. నిత్యమూ ఆహారంతీసుకునే శరీరంలో శౌచమేలేదు, శుచి ఉండదు కాబట్టి; పరిపూర్ణమయిన శౌచవిధితో శరీరం తపస్సుయందు వినియోగించాలి.

34. అంటే ఆహారం తీసుకోకుండా ఉండటమే! శరీరం అనేది ప్రాణానికి చిన్న గూడులాంటిది. శుష్కించిన శరీరం, దమించబడిన ఇంద్రియాలు, మహోగ్రమైనటువంటి అంతఃకరణ -ఇదీ తపస్సుయొక్క స్థితి. శరీరాన్ని క్షయింపచేస్తే, మనుష్యుని లోపలుండే అంతరంగబలం క్షీణిస్తుందని ఎప్పుడూ అనుకోకూడదు. శరీరం శుష్కించటం వేరు. లోపల బలం, నేను అనే అహంకారం, జీవునియందున్న ప్రాణశక్తి, దాంట్లో ఉండే బలంవేరు. అది తపస్సుతో పెరుగుతుంది. శరీరం క్షీణిస్తుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2020

No comments:

Post a Comment