రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
72. అధ్యాయము - 27
🌻. దక్షయజ్ఞ ప్రారంభము - 2 🌻
దీక్షితుడై, రక్షాబంధనోత్సవమును నిర్వర్తించి, స్వస్తి పుణ్యాహవాచనమును చేసిన దక్షుడు భార్యతో గూడి ఆ సమయములో మిక్కిలి ప్రకాశించెను (21). శంభుడు కపాలధారి గనుక, ఆయనకు యజ్ఞార్హత లేదని నిశ్చయించి, దురాత్ముడగు దక్షుడు ఆ యజ్ఞమునందు శివుని ఆహ్వానించలేదు (22).
దోషదర్శియగు దక్షుడు, సతి తన కుమారైయే అయిననూ, కపాలధారి యొక్క భార్య అను కారణముచే యజ్ఞమునకు ఆహ్వానించలేదు (23). ఈ విధముగా దక్షయజ్ఞమహోత్సవము కొనసాగుచుండెను. యజ్ఞనియుక్తులైన వారందరు తమ తమ కార్యములయందు నిమగ్నులైరి (24). ఇంతలో శివభక్తుడగుదధీచుడు అచట శంకర ప్రభువు కానారాక పోవుటచే ఉద్వేగముతో నిండిన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (25).
దేవ ప్రముఖులారా! ఋషి ప్రముఖులారా! మీరందరు నా మాటను ఆనందముతో వినుడు. ఈ యజ్ఞముహోత్సవమునందు శంభుడు ఏల రాలేదు?(26) ఈ దేవ ప్రభువులు, గొప్ప మునులు, లోకపాలురు కూడ వచ్చినారు గదా! కాని మహాత్ముడగు ఆ పినాకి లేనిదే ఈ యజ్ఞము అధికముగా శోభించుటలేదు (27). మంగళములన్నియు ఎవని వలన కలుగునవి గొప్ప విద్వాంసులు చెప్పెదరో, అట్టి ఆ పురాణ పురుషుడు, వృషధ్వజుడు,నీలకంఠుడు అగు పరమేశ్వరుడు ఇచట కానరాలేదు (28).
ఓ దక్షా! ఎవ్వనిచే స్వీకరింపబడిన అమంగళములు కూడా మంగళములగునో, అట్టి శివుడు తన పదిహేను నేత్రములతో చూడగా మహానగరములైననూ వెంటనే మంగళమయములగును (29). కావున, నీవు స్వయముగా పరమేశ్వరుని ఆహ్వానించవలెను. లేదా, బ్రహ్మచే గాని, సర్వ సమర్థుడగు విష్ణువుచే గాని వెంటనే ఆహ్వానింపజేయుము (30). యజ్ఞసిద్ధికొరకై ఇప్పుడు ఇంద్రుడుగాని, లోకపాలురు గాని, విప్రులుగాని, సిద్ధులుగాని ఆ శంకరుని తప్పని సరిగా తోడ్కోని రావలెను (31). మహేశ్వర దేవుడు ఉన్న చోటికి మీరందరు వెళ్లుడు. సతీ దేవితో సహా శంభుని వెనువెంటనే తోడ్కొని రండు (32).
దేవ దేవుడు, సాంబుడు, పరమాత్మయగు శంభుడు ఇచటకు వచ్చినచో సర్వము పవిత్రమగును (33). శివుని స్మరించుటచే, నామమును ఉచ్చరించుటచే యజ్ఞము పరిపూర్ణము, సుకృతము అగును. కాన సర్వ ప్రయత్నములను చేసి శివుని ఇచటకు తీసుకుని రండు (34). శంకరుడు ఇచటకు వచ్చినచో యజ్ఞము పావనమగును. అట్లు గానిచో యజ్ఞము పూర్ణము కాబోదు. నేను సత్యమును పలుకుచున్నాను (35).
బ్రహ్మ ఇట్లు పలికెను -
మూఢబుధ్ది, క్రోధావిష్టుడనగు దక్షుడు ఆయన యొక్క ఆ మాటలను విని చిరునవ్వును నటిస్తూ వెంటనే ఇట్లు పలికెను (36). విష్ణువు దేవతలకు ఆధారము. సనాతన ధర్మము ఆయన యందు ప్రతిష్ఠితమై యున్నది. అట్టి విష్ణువును నేను సాదరముగా రప్పించితిని. ఈ యజ్ఞమునకు ఏమి లోటు వచ్చినది?(37).
ఎవనియందు వేదములు, యజ్ఞములు, వివిధ కర్మలు సర్వము ప్రతిష్ఠితమైయున్నవో, అట్టి విష్ణువు ఇచటకు వచ్చియున్నాడు (38). లోకములకు పితామహుడగు బ్రహ్మ వేదములతో, ఉపనిషత్తులతో, వివిధ శాస్త్రములతో గూడి సత్యలోకమునుండి విచ్చేసినాడు (39).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17 Dec 2020
No comments:
Post a Comment