గీతోపనిషత్తు -100


🌹. గీతోపనిషత్తు -100 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 28. యజ్ఞార్థ జీవనము - యజ్ఞార్థ కర్మలు యజ్ఞార్థముగ తెలుసుకొని ఆచరించినచో కర్మము నుండి ముక్తుడై నిలుతువు. జీవుడు కర్మబద్ధుడు. బద్దతకు కారణము ఫలాసక్తియే. ఫలమునందాసక్తి గొన్న మనసును, కర్తవ్యమునందాసక్తి గలుగునట్లు చేయుట ముఖ్యము. శ్రీకృష్ణుడు కర్మ యందు కర్తవ్యమును చూడమని, తనకు వలసినది చూడవలదని, కర్తవ్యమును మాత్రమే నిర్వర్తించినచో కర్మమంటదని, యిప్పటివరకు అంటిన కర్మ కూడ నశించునని తెలిపినాడు. 🍀

32. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్ విద్ధితాన్ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే || 32

ఈ ప్రకారముగ అనేక విధములైన యజ్ఞములు బ్రహ్మాదుల ముఖము నుండి సవిస్తరముగ చెప్పబడి యున్నవి. ఇవి యన్నియు వివిధములగు యజ్ఞార్థ కర్మలు. వానిని యజ్ఞార్థముగ తెలుసుకొని ఆచరించినచో కర్మము నుండి ముక్తుడై నిలుతువు.

జీవుడు కర్మబద్ధుడు. బద్దతకు కారణము ఫలాసక్తియే. ఫలమునందాసక్తి గొన్న మనసును, కర్తవ్యమునందాసక్తి గలుగునట్లు చేయుట ముఖ్యము.

శ్రీకృష్ణుడు కర్మ యందు కర్తవ్యమును చూడమని, తనకు వలసినది చూడవలదని, కర్తవ్యమును మాత్రమే నిర్వర్తించినచో కర్మమంటదని, యిప్పటివరకు అంటిన కర్మ కూడ నశించునని తెలిపినాడు. ఈ అధ్యాయమునకు వేదవ్యాస మహర్షి జ్ఞానయోగమని పేరిడుట ఆసక్తికరము. నిజమగు జ్ఞానము కర్మబంధ విమోచన జ్ఞానమే కదా!

దైవారాధన చేసినను, బ్రహ్మయజ్ఞము చేసినను, ద్రవ్యయజ్ఞము చేసినను, భగవంతుడు తెలిపిన 12 రకముల యజ్ఞము లన్నియు చేసినను బంధములే కలుగుచు నుండును గాని, విముక్తి చాల మందికి కలుగదు.

కారణము, చేయు విషయమునందు మమకార మోహములు కలుగుట, ఆ కార్యములు తనవిగా భావించుట, అందలి ఫలితములు ద్రవ్యరూపమునగాని, కీర్తి రూపమున గాని తనకే దక్కవలె ననిపించుట, యివన్నియు బంధములే. అందులకే సత్కార్యములు చేయువారు కూడ బంధవిముక్తులు కాలేక యున్నారు.

విముక్తి కల్గించని యజ్ఞములు, యాగములు, సేవా కార్యక్రమములు ప్రస్తుతము జ్ఞానము కలిగిన మానవులను కూడ బంధించియున్నవి. జ్ఞానులు కూడ అజ్ఞానులవలె, ఫలాసక్తి కలిగి పరుగులెత్తుట, తాము చేయు కార్యములందు వ్యామోహపడుట, తమ కార్యములు నెరవేరవలెనని పట్టుదలతో పలువిధములైన సాధనములను ఉపయోగించుట జరుగుచునున్నది. అజ్ఞానులు - జ్ఞానులు ఒకే రకముగ విమోచనారహిత మార్గముల నడచు చున్నారు.

ఇది ప్రకృతి చేయు యింద్రజాలము. దానికి కృష్ణు డందించిన పరిష్కారము యజ్ఞార్థ జీవనము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2020

No comments:

Post a Comment