కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 70



🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 70   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 34 🌻

పుట్టాం కదా పోక తప్పదు కదా! అంటూ వుంటారు ప్రతి మానవుడూ కూడా. ఏది పుట్టింది ఏది పోతోంది అనే ప్రశ్న వేసుకొనజాలము. వృద్ధాప్యంలో వున్నటువంటి వాళ్ళని ఎవరిని మనం పలకరించినా కూడా ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది, వచ్చాం కదా ఏదో ఒక రోజుకి పోవాలి కదా అంటూంటారు. ఎప్పుడూ మరణము యొక్క సంగతిని మృత్యువు యొక్క సంగతిని స్మరిస్తూ వుంటారు. కారణం ఏమిటట?

అంటే శరీర త్యాగం చేస్తున్నాను, శరీరాన్ని ఉపయోగించుకున్నాను, శరీర మనే గృహాన్ని ఉపయోగించుకున్నాను, శరీరమనే ఆశ్రయాన్ని ఉపయోగించుకున్నాను, శరీరమనే వస్త్రాన్ని ధరించాను, శరీరమనేటటువంటి పనిముట్టును వాడుకున్నాను, దానితో ఔపాసన తీరింది కాబట్టి విసర్జిస్తున్నాను.

నేను సర్వకాల సర్వావస్థలయందును సర్వదా నేను ఎల్లకాలము వున్నవాడను. ఏ మార్పు లేనివాడను. అప్రమేయుడను. గంభీరుడను. భావనాతీతుడను. నిరుపమానుడను. నిశ్చలుడను. నిరంతరాయముగా నిర్గుణుడను. నిరహంకారిని. ఈ రకమైనటువంటి లక్షణాలతో నేను శరీరమును త్యజిస్తున్నాను అనేటటువంటి పద్ధతిగా ఎవరైతే వుంటారో వారు ముక్తులు.

నేనే పుట్టాను నేనే పోతాను, ఎప్పటికైనా పోకతప్పదు కదా. నేను శరీరం కాబట్టి నేను ఎట్టైనా పోతాను అనేటటువంటి మరణ భయాన్ని, మృత్యుభయాన్ని ఏ రూపంలో పొందినప్పటికీ కూడా - చాలా మందికి చాలా రకాలైన భయాలు వుంటాయి- ఏ భయమనేటటువంటి స్పర్శ ఏ రూపంలో నీకు తగిలినప్పటికీ, ప్రభావితమైనప్పటికీ తప్పక నీకు మృత్యు భయము వుండక తప్పదు.

అన్ని భయములూ కూడా ఆ మృత్యు భయము ప్రాణ భీతి యొక్క ప్రతిబింబములే. కాబట్టి భయరహిత స్థితి, అభయం - వేదాంత తత్వ విచారణ యందు ప్రధమ ప్రయోజనం అభయం - భయ రహిత స్థితికి చేరుకుంటావు. ఎందుకని? చంపేవాడెవడు? చచ్చేవాడెవడు?


అశోచ్యా నవ్యసోచస్తవం ప్రజ్ఞావాదాంశ భాషసే |

గతాసూన గతాసూంచ్య నానుసోచ్యంతి పండితః ||


మన గురించే మొట్టమొదటే శ్రీకృష్ణుడు గీతాచార్యుడు “అశోచ్యానవ్యసోచస్తుం” శోకింప తగనివాటి గురించి శోకించుట తగదు అని మనందరికీని ఉద్దేశ్యించి అర్జునిని తాత్కాలికముగా ఉద్దేశించి చెప్పినట్లు చెప్పినప్పటికీ మనయొక్క మూఢమతిత్వాన్ని పోగొట్టడానికి ఈ పద ప్రయోగాన్ని చేశారనమాట.

కాబట్టి ప్రతిఒక్కరూ తప్పక ఈ విధానాలని ఈ ఆత్మ ధర్మాన్ని, ఈ శరీర ధర్మాన్ని, దీని యొక్క బేధమును, శరీర ధర్మ త్యాగమును, ఆత్మ భావ ఆశ్రయమును పొందేటట్లుగా మనయొక్క నిత్య జీవిత సాధనని మనం జాగ్రత్తగా చేసుకోవలసినటువంటి అవసరం వున్నదని నచికేతుడి ఆధారంగా యమధర్మరాజు మనకి బోధిస్తూ వున్నారు.

ప్రశ్న: ప్రతి ఒక్కరూ కూడా వారియొక్క లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకుని వుండాలని, లక్ష్యము పట్ల స్పష్టత లేకపోతే ప్రయాణము సరిగా సాగదు అని, వారు ఎక్కడికి చేరాలనుకుంటున్నారనే గమ్యము పట్ల తగిన అవగాహన కలిగి వుండాలని చెప్పారు.

అంటే అది స్వస్వరూప లక్షణమే కదా స్వామి. అంటే స్వరూప లక్షణం తెలిస్తే సరిపోతుందా?

సమాధానము: నీవు ఏ స్థితిలో వున్నా ప్రయాణము మొదలు పెట్టావన్న దగ్గరి నుండి మొదలు పెడితే ఈ క్రమానుగతిలో ఏ ఏ స్థితుల ద్వారా నువ్వు లక్ష్యాన్ని చేరతావు అనే ప్రగతిశీల మార్గమంతా నీకు బాగా తెలిసి వుండాలి.

దేని తరువాత ఏదవుతుంది, దేని తరువాత ఏమొస్తుంది, దేని తరువాత ఎలా జరుగుతుంది అనేటటువంటి క్రమమార్గమంతా నువ్వు తెలుసుకున్నవాడవై వుండాలి. ఆ ప్రయాణాన్ని సరిగా చేయడానికి కావలసినటువంటి సమర్ధతని సరియైనటువంటి గురువు ద్వారా ఆశ్రయాన్ని పొందినటువంటి వాడవై వుండాలి. ఆ రకంగా మాత్రమే ఈ ప్రయాణం పూర్తవుతుంది. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment