🌹 . శ్రీ శివ మహా పురాణము - 242 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
54. అధ్యాయము - 9
🌻. మారగణములు - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! సృష్టికర్తనను నేను మన్మథుని ఆ వాక్యమును విని వారి కర్తవ్యము, పేరు ఇత్యాదులను నిర్దేశిస్తూ, మన్మథునితో నిట్లంటిని (41).
వీరు పుట్టుచుండగనే 'మారయ (చంపుడు)' అని పలుమార్లు అరచిరి గాన, వీరికి మారులు అనుపేరు సార్థకమగు గాక! (42).
ఈ గణములు తమను అర్చించకుండగా వివిధములగు కామనలను పొందగోరు మానవులకు సర్వదా విఘ్నములను కలిగించెదరు (43).
హే మన్మథా! నిన్ను అనుసరించి ఉండుట వీరి ప్రధాన కర్తవ్యము. వీరు ఎల్ల వేళలా నిన్ను అను సరించి ఉందురనుటలో సందియము లేదు (44).
నీవు నీ కర్తవ్యమును నిర్వర్తించుటకై ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడకు వెళ్లెదవో, అప్పుడప్పుడు అక్కడక్కడకు వీరు నీ సహయము కొరకు అనుసరించి రాగలరు (45).
నీ అస్త్రములకు వశమగు మానవులకు వీరు చిత్తభ్రాంతిని కలిగించెదరు. వీరు జ్ఞానుల జ్ఞానమార్గమునకు అనేక విధముల విఘ్నములను కలిగించెదరు (46).
ఓ మహర్షీ! ఈ నా మాటను విని, రతీ దేవితో మరియు అనుచరులతో కూడియున్న మన్మథుని ముఖములో కొంత ప్రసన్నత కానవచ్చెను (47).
ఆ గణములన్నియూ కూడ ఈ మాటను విని, నన్ను మన్మథుని చుట్టు వారి యథేచ్చగా అచట నిలబడి యుండిరి (48).
అపుడు బ్రహ్మ మన్మథుని ఉద్దేశించి ప్రీతితో నిట్లనెను. నా ఆజ్ఞను పాలింపుము. నీవు మరల వీరితో గూడి వెళ్లుము. మనస్సును లగ్నము చేసి శివుని మోహింపజేయు యత్నమును చేయుము . (49)
ఈ మారగణములతో సహావెళ్లి, శివుడు మోహమును పొందునట్లు చేయుము. అపుడు శివుడు వివాహమును చేసుకొనగలడు (50).
ఈ మాటలను విని మన్మథుడు నన్ను మర్యాద చేసి వినయముతో ప్రణమిల్లెను. ఓ దేవర్షీ! అపుడాతడు నాతో నిట్లనెను.
మన్మథుడు ఇట్లు పలికెను -
తండ్రీ! శివుని మోహింపజేయు ప్రయత్నమును నేను శ్రద్ధగా చేసితిని. కాని ఆయన మోహమును పొందలేదు. ఇపుడు గాని ఆతడు మోహమును పొందడు (52).
నీ మాట యందలి గౌరవముతో నీ యాజ్ఞాను సారముగా నేను మరల శివుని ధామమునకు వెళ్లెదను. ఈ మారగణములు నాకు కొంత ఆశను కల్గించు చున్నవి (53). కాని నా మనస్సు లో శివుడు మోహమును పొందడనియే నిశ్చయముగా తోచుచున్నది. హే బ్రహ్మన్ ! శివుడు నా దేహమును భస్మము చేయడు గదా యను శంక నాకు గలదు (54).
మన్మథుడు ఇట్లు పలికి భయము గలవాడై వసంతునితో, రతీ దేవితో గూడి అపుడు శివుని ధామమునకు వెళ్లెను. ఓముని శ్రేష్ఠా! మారగణములు కూడ ఆతనిని అనుసరించినవి (55).
అపుడు మన్మథుడు పూర్వమునందు వలెనే వసంతునితో గూడి బాగుగా ఆలోచించి అనేక ఉపాయములను శివుని పై ప్రయేగించి తన ప్రభావమును చూపెను (56).
మారగణములు కూడా అనే ఉపాయములను చేసిరి. కాని శివ పరమాత్మకు మోహము కలుగనే లేదు (57).
అపుడు మన్మథుడు వెనుదిరిగి నా స్థానమునకు వచ్చెను. మారగణములు గర్వమును వీడి దుఃఖముతో నా ముందు నిలబడెను (58),
కుమారా! అపుడు నిరుత్సాహముతో నిండియున్న మన్మథుడు మారగణులతో, వసంతునితో గూడి గర్వమును వీడి నా ముందు నిలబడి ఇట్లు పలికెను (59).
హే బ్రహ్మన్! శివుని మోహింప జేయు యత్నమును పూర్వము కంటె అధికముగా చేసితిని. కాని ధ్యానమునందు లగ్నమైన మనస్సు గల శివునకు మోహము లేశమైననూ కలుగలేదు (60).
దయామయుడగు శివుడు నా దేహమును భస్మము చేయలేదు. పూ ర్వపుణ్యమే దీనికి కారణమై యుండును. ఆ ప్రభువు నందు వికారము లేమియూ కలుగలేదు (61).
ఓ పద్మ సంభవా! శివుడు వివాహమాడ వలెననే ఇచ్ఛ నీకు ఉన్నచో, నీవు గర్వమును వీడి, మరియొక ఉపాయమును చేయవలెనని నా అభిప్రాయము (62).
బ్రహ్మ ఇట్లు పలికెను -
మన్మథుడిట్లు పలికి , నాకు నమస్కరించి, గర్వమును దునుమువాడు దీనులపై ప్రేమను గురిపించువాడునగు శంభుని స్మరించుచూ, తన అనుచరులతో గూడి తన ఆశ్రమమునకు వెళ్లెను (63).
శ్రీశివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సతీఖండములో కామ ప్రభావము - మారగణముల పుట్టుక అనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
08 Oct 2020
No comments:
Post a Comment