గీతోపనిషత్తు - 48





🌹.   గీతోపనిషత్తు - 48   🌹

🍀   8. మోక్షము - బంధము - తన శ్రేయస్సు కన్న ఇతరుల శ్రేయస్సు మిన్నగ యుండడుటయే పవిత్రతకు కారణము. అదియే భగవానుని ఆదేశము  🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚.   కర్మయోగము - 13   📚


కర్మానుష్ఠాన మార్గమున మలినముల నుండి విముక్తి చెందుటకు భగవానుడీ సూత్రము పలికినాడు. ఇతరులకు పెట్టి తాను తినువాడు పవిత్రుడగును. తనకు తాను తినువాడు అపవిత్రుడగును. ఇది సృష్టి ధర్మము.


🌻 13. యజ్ఞశిష్టాశిన స్సన్తో ముచ్యంతే సర్వకిల్బిషైః |

భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మ కారణాత్ || 13 🌻


వ్యాపారము చేయువాడు తన సంస్థ యందలి సమస్త కార్యవర్గమునకు జీతభత్యములను ఏర్పరచి, ప్రభుత్వమునకు ఈయవలసినది, సంఘమునకు ఈయవలసినది ఇచ్చి, కుటుంబ సభ్యులకు కూడ అందించవలసినది అందించి, అటుపైన తననుగూర్చి భావించవలెను. అట్లు చేసినచో యజ్ఞమున మిగిలిన అవశిష్టమును భుజించినవాడగును. అందరి పరితృప్తి తరువాత తన తృప్తి.

అందుచేత అతని యందు తన శ్రేయస్సు కన్న ఇతరుల శ్రేయస్సు మిన్నగ యుండును. అదియే పవిత్రతకు కారణము. అదే విధముగ ఒక అధికారి, ఒక యజమాని తన ఆశ్రయములో (లేక పరిధిలో) నున్నవారి క్షేమమును నిర్వర్తించి అటు పైన తనను గూర్చి అలోచింపవలెను. ఇది ధర్మము.

అందరికన్న ముందుగ భోజనము చేయుట, అందరికన్న ముందుగ తాను పొందుట, ముందుగ అనుభవించుట మొదలగున వన్నియు అపవిత్రమగు కార్యములు. పోటీపడి ఇతరుల కన్న తాను ముందు పొందవలెనను భావనతో జీవించువాడు, మానసికముగ బంధితుడు. అతడు యావజ్జీవ బంధితుడే. ఈ విషయము తెలియక ఆధునిక యుగమున పోటీలు ఎక్కువ అయినవి. తత్కారణముగ అశాంతి ఎక్కువైనది.

తత్కారణముగ ఘర్షణలు, హత్యలు, మారణ హోమములు జరుగుచున్నవి. తోటి వారి శ్రేయస్సును గమనించని వాడు నరపశువేగాని నరుడు కాదు. నరపతి కాదలచినచో లోక హితమునకై పాటుపడవలెను గాని పశువువలె కుమ్ము లాడుచు, దౌర్జన్యముతో దోచుచు భోగించువాడు భయంకరముగ బంధింప బడును.

తెలిసి నిర్వర్తించిన వారికి కర్మలు మోక్ష కారణము. తెలియక నిర్వర్తించు వారికి కర్మలు బంధకారణము. మోక్షము పేరున మోహపడిన జీవులు ఎన్నో రకములుగ ఇతర ఉపాయముల నాలోచింతురు. కర్మ మార్గమున మోక్షము సులభమని తెలిసినవారు తమ వంతు కర్మను యజ్ఞార్థముగ నిర్వర్తింతురు.

ఒక మనిషి పవిత్రతకు, అపవిత్రతకు మూలకారణము అతని కర్మానుష్ఠాన విధానముననే యున్నది. కర్మను జీవ శ్రేయోదాయకముగ నిర్వర్తించిన పవిత్రుడగుచు అగ్నిహోత్రునివలె ప్రకాశించును. లేనిచో అంధకారమున పడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


08 Oct 2020

No comments:

Post a Comment