భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 130



🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 130   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 4 🌻

30. విష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చినటువంటి బ్రహ్మ, విశ్వాన్ని సృష్టించమని తనకు విష్ణువుయొక్క ఆజ్ఞ అవటంచేత; “తాను ఏమి చేయాలి? సృష్టిని ఎక్కడ ప్రారంభించాలి?” అనే విచికిత్సచేసాడు.

31. ఈ ప్రశ్నలకు సమాధానం విష్ణువు ఆయనకు చెప్పలేదు. “నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చుకో!” అని బ్రహ్మను చాలాదూరం పంపించివేసాడు. నాభికమలంలోంచి ఒక గొప్ప తేజస్సు శతకోటియోజనాల దూరం ఎక్కడికో వెళ్ళిపోయింది.

32. ఆ ప్రకారంగా విష్ణువుయొక్క నాభికమలంనుంచీ చాలాదూరం వెళ్లిపోయి, సుదూరంలో బ్రహ్మాండమయిన ఒక కమలం విస్తారితమై, అందులో తననుతాను చూచుకున్నాడు. అక్కడ తనొక్కడే ఉన్నాడు బ్రహ్మ. తనుతప్ప ఇంకొకరు లేరు. ‘నేనెవరిని?’ అని అడిగితే జవాబు చెప్పేవారెవరూ లేరు.

33. తానొక్కడే ఉన్నప్పుడు, తన విషయం తనకు తెలియనప్పుడు, ఏ మనిషైనా యోచన చేస్తాడు. తనకు శరణ్యంగా తన బుద్ధి ఒక్కటే ఉంటుంది. దాన్నే శరణు అంటాడు. కాబట్టి తానెవరో తెలుసుకోవటానికి చిరకాలం చేసే ప్రయత్నానికే – ‘తపస్సు’ అని పేరు.

34. అంతర్ముఖుడై, ‘నేనెవరిని? నేనేంచేయాలి? నాకాజ్ఞ ఏమిటి? నా కర్తవ్యం ఏమిటి? ఒకవేళ కర్తవ్యమే సృష్టి అయితే, సృష్టియొక్క ఉపక్రమణము ఎలాగ? ఏ ప్రకారంగా మొదలుపెట్టాలి? ఎక్కడ మొదలుపెట్టాలి?’ ఈ విషయమంతా తెలుసుకునేందుకు బ్రహ్మ తపస్సు చేసాడు.

35. ఆ తపస్సులో – “ఓహో నేను ప్రత్యక్షంగా ఏ విషయాన్నీ సృష్టించటంకాదు. సృష్టికి హేతువులైనటువంటి ఋషులను (ప్రపంచ జ్ఞానము-బ్రహ్మజ్ఞానము రెండూ కూడా ఏకకాలమందు కలిగిన మహర్షులను) నేను సృష్టించాలి.

36. అప్పుడు పంచభూతాత్మకమైన శరీరములు, అందులో జీవాత్మలూ, వాటియొక్క కారయకారణ లక్షణములన్నీ కూడా ఆ ఋషులే బోధించి చెప్తారు. అది వాళ్ళ పని” అన్న్ జ్ఞానం ఆయనలో ఉద్బుద్ధమయ్యింది. అప్పుడు ఆయన తనలోంచి బ్రహ్మర్షులను సృష్టించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


08 Oct 2020

No comments:

Post a Comment