కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 78

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 78 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -08 🌻

ఇంకా ఆత్మయొక్క లక్షణాలను విశేషంగా చెప్తున్నారు. ఈ విశేషం గా చెప్పేటటువంటి అంశాలలో ఆత్మకు శరీరం లేనివాడు. అసలు ఆత్మకు శరీరమే లేదు. కుండకు లోపల బయటా ఆకాశం ఎలా సర్వవ్యాపకముగా ఉన్నదో, ఆత్మ ఈ శరీరమునకు లోపల, బయటా అంతటా వ్యాపించి ఉన్నది. 

కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఏ రకమైన శరీరమూ లేదు. అష్టవిధ శరీరములు లేవు. అష్టతనువులు లేవు. కనుక ఆత్మ అశరీరి. శరీరములు అనిత్యములు. శరీరము అంటే అసలు అర్థమేమిటి? ‘శీర్యతే ఇతి శరీరః’ - అంటే, తనకు తానుగా నశించిపోవునది ఏదో, అదే శరీరము. తనకు తా పుట్టినది, తనకు తా నశించిపోవునది.

        అనగా అర్థమేమిటంటే, సముద్రపు అలల మీద నురుగు వస్తుంది, ఆ నురుగులో బుడగలు వస్తాయి. ఆ బుడగల మధ్యలో గాలి ఉంటుంది. బుడగల బయట కూడా గాలి వుంటుంది. బుడగలు గాలిలో తేలుతూ ఉంటాయి. ఆ బుడగ ఎంత సేపు ఉంటుంది? ఎంత సేపటికి పోతుంది? అంటే ఎవరైనా చెప్పగలరా? గాలి లోపలా ఉన్నది, గాలి బయటా ఉన్నది. కానీ సముద్రము లేదా ఆ బుడగలో..? ఆ నీళ్ళు లేవా? వీటి అన్నిటి యొక్క సంయోజనీయత ఉన్నట్లుగా తోచుచున్నది. 

ఆ గాలి బుడగ బ్రద్దలైంది. బ్రద్దలైతే ఏమైంది? ఆ గాలి గాలిలో కలిసిపోయింది, నీరు నీటిలో కలిసిపోయింది. ఇంక ఎక్కడా ఏమీ లేవు. దానికి రూపమే లేదు, ఆకారమే లేదు. అప్పటివరకూ ఉన్న బుడగ ఎక్కడికి పోయిందయ్యా? ఏ గాలిలో పుట్టిందో, ఆ గాలిలోకే పోయింది. ఏ నీటితో పుట్టిందో, ఆ నీటిలోకే పోయింది. ఏ పంచభూతాలతో పుట్టిందో, ఆ పంచభూతాలలోకే పోయింది.

        ఇట్లా క్షణ భంగురమైనటువంటి శరీరము అనంతముగా వ్యాపించి యున్న విశ్వము అనేటటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మము యొక్క కాలమానం దృష్ట్యా చూసినప్పుడు, ఒక మానవుడు పుట్టి, జీవించి, పోవడం అనేటటువంటిది ఒక గాలి బుడగతో సమానమైనటువంటిది. 

దానికి ఎంత విలువ వుందో, దీనికి అంతే విలువ ఉంది. కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఎందుకని? ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది. అనంత విశ్వ వ్యాపకమైనటువంటిది. బృహద్వ్యాపకమైనటువంటిది. కాబట్టి అది అశరీరి. శరీరములు అనిత్యములు. జీర్ణించి పోవునవి. పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ నిత్యుడు. ఎప్పుడైతే ఆ నిత్యత్వం అంటే సర్వకాల సర్వావస్థల యందును ‘ఉండుట’ అనేటటువంటి లక్షణం కలిగియున్నదో ఆ ఆత్మ నిత్యత్వమును కలిగియున్నది. 

సర్వ వ్యాపకుడు. ఎంతగా సర్వవ్యాపకుడు అంటే, దీనికి కంటే అవతల ఎల్లలు లేవు ఇక. ఎంతమేరకు చెబితే అంతమేరకు వ్యాపించి ఉన్నది. సర్వము గురించి చెబితే అంత మేరకు వ్యాపకధర్మమును కలిగి వున్నది. అచలుడు - అంతగా వ్యాపించి ఉండటం చేత, కదలడానికే అవకాశం లేనంత స్థితి వరకూ వ్యాపించడం చేత అది (ఆత్మ) కదలికే లేకుండా ఉంది. ఇది అచలము. అంతటా ఎల్లప్పుడూ ఉన్నది. ‘ఉండుట’ అన్నది మాత్రమే కలిగియున్నది. 

అందుచేత అనిత్యములైనటువంటి శరీరములందు నిత్యుడై ఉన్నది. శరీరము అనిత్యమే కానీ, ఆత్మ నిత్యము. ఆత్మ అనే ఆధారమే లేకుండా శరీరము అనేటటువంటిది ఉండే అవకాశమే లేదు. శరీరము - అనునది ఉన్నట్లుగా తోచినప్పటికి, అది ఆత్మ అనే దానియందు అంశీభూతమై యున్నది.

        అనేకముగా అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రము నుంచి అనేకములైన బుడగలు పుట్టినంత మాత్రమున, అలలు పుట్టినంత మాత్రమున అవన్నీ సముద్రములో భాగములు కావా? అట్లే, అఖండముగా వ్యాపించియున్నటువంటి బ్రహ్మమునందు అనేక జీవులు, ఈ అలలవలె, నురుగు వలె, బుడగల వలె ఉత్పన్నమౌతున్నవి. 

అయినచొ అందంతటను వ్యాపించినది ఒకే ఒక బ్రహ్మము మాత్రమే. ఒకే ఒక ఆత్మయే. అట్టి గొప్పవాడును సర్వవ్యాపి అగు ఆత్మ, ధ్యానాదుల మూలమున తెలుసుకున్న జ్ఞాని శోకింపడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. శోక రహితమైన స్థితిని.. బుద్ధుడు కూడా చెప్పినటువంటి పద్ధతి ఇదే! - విద్యా సాగర్ స్వామి  

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹




19 Oct 2020

No comments:

Post a Comment