🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 13 🌻
97. అనంతరం శ్రీమహావిష్ణువు గురించి ఊర్ధ్వబాహుడై ఒక్క పాదంమీద నిలబడి అనేక సంవత్సరములు తపస్సుచేసాడు. నారదునికి ఒక దివ్యమైన స్వరూపంతో దర్శనమిచ్చాడు. “నారదా! నీవంటి తపోనిష్ఠకలవాడికి నా లక్షణము తెలియచేయటముకోసమే నీకు దర్శనం ఇచ్చాను. ఇలా తపస్సు చేసిన వారికే ఈ దర్శనమవుతుంది. నేనే ఇరవై నాలుగు తత్త్వాలలో ఉన్నాను. నేనే పరమపురుషుడను, నేనే విరాట్టును, వాసుదేవుణ్ణి.
98. భూతాత్మక మయినటువంటి ధాతువుల యొక్క సంయోగమే దేహము. అందులో జీవవ్యాప్తి లేకపోతే, శరీరానికి చేష్టలుండవు. జీవశరీరములు రెండూ పరస్పరము ఆశ్రయించుకొని ఉంటాయి. నేను లేకుండా జీవుడు స్వతంత్రుడై ఎన్నడూ ఉండడు. కాబట్టి నేను సన్నిహితంగా అతడియందు ఉంటూ అతడిని అనుసరించి ఉంటాను. అతడు నాయందే స్థితి కలిగి ఉంటాడు.
99. ఈ స్థితికి అతడి యందు నేను ఉండటమే కారణం, వేరొకటిలేదు అని ఎవరైతే తెలుసుకుంటారో అతడికి తక్షణమే సర్వకర్మలు నశించి అతడు ముక్తిని పొందుతాడు. జీవాత్మనుంచీ ముక్తిని పొందుతాడు. అతడు తననుతాను ఆధేయంగాను, అతడికి ఆధారమైన వస్తువుగా నన్ను తెలుసుకోవాలి. అంతే!
100. ఈ లోకాలను సృష్టించే బ్రహ్మదేవుడిని నేను సృష్టించాను. లోకాలు ప్రవర్తించే కాలంలో కూడా జగత్ హితమయినటువంటి, కార్యాలకోసం నేను మళ్ళీ పుడుతుంటాను” అని చెప్పి ఆ రూపము అదృశ్యమయి పోతుంది.
101. పరమేశ్వర స్వరూపంలో ఉన్న శివుడి యొక్క ప్రకృతిని ‘దుర్గ’ అంటారు. విష్ణువుకు ప్రక్కన ఉండేటటువంటి పరాశక్తిని లక్ష్మి అంటారు. బ్రహ్మకు ప్రక్కన ఉండే పరాశక్తిని సావిత్రి అంటారు. స్వర్గంలో ఉంటే స్వర్గలక్ష్మి అంటారు. రాజు ఇంట్లో ఉంటే రాజ్యలక్ష్మి అంటారు. గృహంలో ఉంటే గృహలక్ష్మి అంటారు. ఈ ప్రకారంగా పరాశక్తి అక్కడ నుంచి క్రిందిదాకా అంతటా వ్యాపించి ఉంది. పురుషుడి ప్రక్కనే ఆశ్రయించి ఆ చైతన్య స్వరూపిణి ఉంది.
102. గణేశ ఖండములో గణపతి యొక్క జన్మ వృత్తాంతము ప్రస్తావించబడింది. అతడియొక్క ప్రభావము, అతడి శక్తి అంతా చెప్పబడింది. ఆ గణేశ్వరుని యొక్క ప్రభావము ఏమిటంటే, సమస్త జీవకోటి, అంటే శరీరధారణ చేసిన ప్రతి జీవునికీ, ‘ఈ శరీరమే నేను’ అనే భావాన్ని దృఢంగా కల్పించినవాడు అతడు.
103. అతడిని ఉపాసించటం ఎందుకంటే, అట్టి దేహాత్మ భావన విడిపోవటానికి. హేతువును ఉపాసిస్తే సత్యం చూపిస్తుంది. హేతువు చేసేదేమీ లేదు. దేహాత్మభావనకు హేతువైనటువంటి శక్తి ఏదో ఆ శక్తి నారాధిస్తే ఆ శక్తి ఇతడిని విడిచిపెడుతుంది.
104. దేహాత్మ భావన పోతే సత్యం వెంటనే తెలుస్తుంది. నేను దేహం కాను అని నోటితో, మనసుతో అనుకుంటున్నాం. దేహాత్మభావనలోంచే ఆ మాట వస్తున్నది. దేహాత్మభావన కలిగినవాడికే, ‘నేను దేహం కాను’ అనే వేదాంతవాక్యం చెబుతున్నారు. పలుకుతున్నారు, వింటున్నారు.
105. ఊరికే రోజూ ‘నాహం దేహో న ఇంద్రియాణి’ అంటూ జపంచేస్తే అనుభవంలోకి వస్తుందా? కాని గణపతి ఆరాధనచేస్తే, దీని సత్యం అవగత మయ్యేటట్లు అనుభూతినివ్వగలడు! ఎందుకంటే గణపతి స్థితుడై ఉన్న మూలాధార మందే దేహాత్మభావన స్థితి ఉంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17 Oct 2020
No comments:
Post a Comment