రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
58. అధ్యాయము - 13
🌻. నారదునకు శాపము - 1 🌻
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్ ! విధీ! నీవు మహా బుద్ధిశాలివి. ప్రవక్తలలో శ్రేష్ఠుడవు. దక్షుడు ప్రీతితో ఇంటికి వెళ్లిన తరువాత ఏమయినది? మాకు చెప్పుము (1).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్ష ప్రజాపతి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై తన ఆశ్రమమునకు వెళ్లి నా ఆజ్ఞచే అనేక తెరంగుల మానసిక సృష్టిని చేసెను (2). దక్ష ప్రజాపతి ఆ సృష్టిలో వృద్ధి లేకపోవుటను గాంచి తండ్రియగు నాకు నివేదించెను (3).
దక్షుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! తండ్రీ! ప్రజాపతీ! ప్రభూ! నాచే సృష్టింపబడిన సంతానములో వృద్ధి ఏమియూ కానవచ్చుట లేదు . ఎంతమందిని సృష్టించితినో, అంతమందియే ఉన్నారు (4). హే ప్రజానాథా! నేను ఏమి చేయుదును? ఈ సంతానము తనంత తాను వృద్ధి పొందు ఉపాయమును చెప్పుము. నేను సృష్టిని చేసెదను. దానిలో సంశయము లేదు (5).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వత్సా! దక్ష ప్రజాపతీ! నా మంచి మాటను విని అటులనే చేయుము. నీవు దేవతలలో శ్రేష్ఠుడవు. శివుడు నీకు శుభమును చేయగలడు (6). కుమారా! పంచజన ప్రజాపతికి అసిక్నియను అందమైన కుమార్తె గలదు. ఓ ప్రజాపతీ! నీవు ఆమెను భార్యగా స్వీకరించుము (7). నీవు అట్టి సుందరియగు భార్యయందు మైథున ధర్మముచే ఈ ప్రజాసృష్టిని విస్తారముగా చేయగలవు (8). అపుడు దక్షుడు నా ఆదేశముచే వీరణుని (పంచజనుని ) కుమార్తెను, మైథున ధర్మముచే సంతానమును గనుటకై వివాహమాడెను (9).
అపుడా దక్ష ప్రజాపతి వీరణుని కుమార్తె యగు అసిక్నియందు హర్యశ్వులు అను పేరుగల పదివేల మంది కుమారులను గనెను (10). ఓ మహర్షీ! వారందరు ఒకే ధర్మము గలవారై ఉండిరి. వారు తండ్రియందు భక్తి గలవారై నిత్యము వేదమార్గము నందు నిష్ఠ కలిగియుండిరి (11). తండ్రి వారిని సంతానమును గనుడని చెప్పెను వత్సా! ఆ దక్షపుత్రులందరు తపస్సు కొరకు పశ్చిమ దిక్కునకు వెళ్లిరి (12).
అచట దివ్యమగు సింధునది సముద్రములో కలిసే సంగమము వద్ద పరమ పవిత్రమైన నారాయణ సరస్సు అనే తీర్థము గలదు (13). ఆ జలములను స్పృశించినంతనే వారి హృదయములలోని మాలిన్యములు క్షాళితమై పోయెను. వారి బుద్ధి పరమ హంస ధర్మము (నివృత్తి ధర్మము) నందు పరినిష్ఠితమయ్యెను (14). పుణ్యాత్ములు, జితేంద్రియులు అగు దక్షపుత్రులు తండ్రియొక్క ఆదేశముచే నియంత్రింపబడిన వారై, సంతాన వృద్ధి కొరకై అచట తపస్సును చేయుచున్నారని నీకు తెలిసినది. నీవు విష్ణువు హృదయములోని భావమునెరింగి అచటకు వెళ్లితివి (16).
దక్షకుమారులారా! హర్యశ్వులారా! భూమి యొక్క అంతము నెరుంగనే మీరు సృష్టిని చేయుటకు ఎట్లు సిద్ధమైతిరి? అని నీవు ఆదరముతో ప్రశ్నించితివి (17). ఆ హర్యశ్వులు జాగరూకులై నీ మాటను వినిరి. వారందరు పుట్టుకతోడనే బుధ్దిశాలురు గదా ! వారు నీ మాటలను సమగ్రముగా విచారణ చేసిరి (18).
శాస్త్రమే తండ్రి. శాస్త్రము నివృత్తిని బోధించుచున్నది. అట్టి శాస్త్రాదేశమును తెలియనివాడు త్రిగుణములను నమ్ముకొని సృష్టికి పూనుకొనుట యెట్లు పొసగును? (19). బుద్ది శాలులు, దృఢనిశ్చయము గలవారునగు ఆ దక్ష పుత్రులు ఇట్లు నిశ్చయించుకొని, ఆ నారదునకు నమస్కరించి, ప్రదక్షిణము చేసి పునరావృత్తి లేని జ్ఞానమార్గములోనికి వెళ్లిరి (20).
ఓ నారదా! శంభుని మనస్సు నీవే (ఎరుంగుదువు) .ఓ మహర్షీ! నీవు ఒంటరిగా లోకములను తిరుగాడెదవు. నీవు వికారములు లేనివాడవై సర్వదా మహేశ్వరుని మనోవృత్తులను (ఆశయములను ) నెరవేర్చెదవు (21). చాల కాలము గడచిన తరువాత నా కుమారుడగు దక్ష ప్రజాపతి తన కుమారులు నారదుని వలన ప్రవృత్తి మార్గము నుండి తొలగిరని విని మిక్కిలి దుఃఖించెను (22).
మంచి కుమారులను కలిగి యుండుట దుఃఖములకు నిధానము అని పలుమార్లు పలుకుచూ దక్షడు శివమాయచే మోహితుడై అనేక విధములుగా దుఃఖించెను (23). నేను వచ్చి కుమారుడగు దక్షునకు శాంతముగా నుండుమనియు, దైవము బలీయమైనదనియు చెప్పి ప్రీతిపూర్వకముగా ఓదార్చితిని (24).
నాచే ఇట్లు ఓదార్చ బడిన దక్షుడు పాంచజన్య (పంచజనుని కుమార్తె) యను తన భార్యయందు శబలాశ్వులను పేరుగల వేయిమంది కుమారులను గనెను (25). దృఢమైన వ్రతము గల ఆ దక్షపుత్రులు కూడా తండ్రిచే ఆదేశింపబడిన వారై ప్రజా సృష్టిని చేయగోరి, తమ సోదరులు పూర్వము సిద్ధి పొందిన తీర్థమునకే వెళ్లిరి (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
19 Oct 2020
No comments:
Post a Comment