గీతోపనిషత్తు - 56

 

🌹. గీతోపనిషత్తు - 56 🌹


🍀 16. సృష్టి రసాయనము - సమస్తమగు కర్మకాండ గుణముల నుండియే పుట్టుచున్నది. అందుచే జీవుడు సంగము లేక వీని యందు ప్రవర్తించినచో ముక్తుడుగ నుండును. సంగము కలిగినచో బద్దుడగును. 🍀


✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. కర్మయోగము - 28 📚

28. తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః |
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే || 28 ||

సృష్టి యంతయు ఒక రసాయనము. పురుషుని సాన్నిధ్యమున ప్రకృతిశక్తులు రసాయనము చెంది, సృష్టిగ వర్తించుచున్నవి. గుణములు గుణములయందు అహర్నిశలు రసాయనము చెందుచూ, సృష్టికార్యము నడచుచున్నది.

సమస్తమగు కర్మకాండ గుణముల నుండియే పుట్టుచున్నది. అందుచే జీవుడు సంగము లేక వీని యందు ప్రవర్తించినచో ముక్తుడుగ నుండును. సంగము కలిగినచో బద్దుడగును. సంగము లేక కర్మ లాచరించుటయే కర్మలయందు కౌశలము. సంగము వలననే జీవుడు ద్వంద్వములకు చిక్కును.

నిజమునకు ప్రకృతి రమణీయత, ఆకర్షణీయత చూచు వానిని బట్టి యుండును. స్త్రీ, పురుష శరీరములుగ కన్పట్టుచున్నది రక్తమాంసాదులతో నిర్మించబడిన రూపమని తెలిసిన జీవుడు వికారము చెందడు. లేనిచో వికారము చెందును. ఆకర్షణమునకు లోనగుట జీవునకు జరుగుచున్నది గాని, ఆకర్షించు కార్యక్రమము ప్రకృతికి లేదు.

సృష్టి ఆకర్షణముగ నున్నను, అట్టి ఆకర్షణమున కతీతముగ నున్నవారు గలరు. ఆకర్షణమునకు లోనైన వారునూ గలరు. ఈ భేదము సంగము లేకుండుట, ఉండుట వలన కలుగుచున్నది. అసంగుని సృష్టి ఆకర్షింపలేదు కదా! సనక సనందనాదులట్టివారు.

సంగము ఒక బలహీనత. అసంగమే బలము. అసంగుడు ముక్తుడు. అతడు గుణముల వ్యాపారమున బడడు. అట్టి వాడే యథార్థమును తెలిసినవాడు. (3-28).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


17 Oct 2020


No comments:

Post a Comment