🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 24 🌻
171. ఒకసారి నారదమహర్షి ధర్మరాజు చేసే రాజసూయయాగానికి వెళ్ళాడు. ఆ రాజసూయయాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి నిందించాడు. అప్పుడు శ్రీకృష్ణుడి చేతిలో వధించబడ్డ శిశుపాలుడి నుంచి ఒక తేజస్సు వెళ్ళి శ్రీకృష్ణుడిలో ప్రవేశించింది.
172. ధర్మరాజు నారదుడితో, “ఇదేమిటయ్యా? వీడు ఇంత దుర్మార్గుడు, ఆయనలో ప్రవేశించాడు. వీడు ఏ నరకానికో పోతాడూ అనుకున్నాను నేను. ఈ విషయంలో ధర్మబోధచేయవలసింది” అని అన్నాడు.
173. ఆయనతో నారదుడు, “అది అంతే! అది శాసనం. అలాగే జరుగుతుంది! ఎందుచేతనంటే క్రొధంతోకాని, స్నేహంతోకాని, భయంతోకాని, కోరికతోకాని, బాంధవ్యంతోకాని, విరోధంతోకాని – వీటిలో ఏ గుణంతోనైనా ఏకాగ్రంగా హరిని ధ్యానం చేసేవాడు ఆయనలో కలిసిపోతాడు. అదే రహస్యం.
174. కాసేపు భక్తి, కాసేపు రక్తి ఉండేవాడు ఎటూపోడు!” అని అన్నాడు. “కామోత్పన్నంచేత గోపికలు ఆయనలో కలిసిపోయారు. భయంతో కంసుడు ఆయనలో కలిసిపోయాడు. విరోధంతో కలిసిపోయాడు శిశుపాలుడు. సంబంధులై కృష్ణుడిపై ప్రేమతో సోదరులు అందరూ ఆయనలో కలిసిపోయారు. భక్తితో మేము విష్ణువులోకి వెళతాము” అని చెప్పాడు నారదుడు.
175. నారదుడు ధర్మరాజుకి వర్ణాశ్రమధర్మాలన్నీ బోధించాడు. సత్యము, దయ, ఉపవాసాలు, తపస్సు మొదలయినవి. ఉపవాసము అంటే రెండురోజులు ఏమీ తినకుండా ఉండటము, ఆ మర్నాడేమో ఒక్కసారి తినడం కాదు. సదోపవాసి, నిత్యోపవాసి అనేది ఒకటుంది. ఎప్పుడూ మితంగా తినేవాడు సదోపవాసి. అతడికి ఏకాదశీ ఒక్కటే, పౌణమీ ఒక్కటే. ఎప్పుడూ మితంగా తినాలి. అది ఉత్కృష్టమైన వృతమని చెప్తారు. శౌచము,
176. సదసద్వివేకము, మనోనియమము, బాహ్యమయిన ఇంద్రియజయము మొదలయిన లక్షణాలు కలిగి ఉండాలి. జపమంటే, ఏదో కోరికలను ఆశ్రయించి ఒక లక్ష జపము చేయటము కాదు.
177. యథోచితజపం అంటే, ఇష్టదైవాన్ని ఎప్పుడూ సంతుష్టితో సుష్టుగా ప్రార్థించటం అని అర్థం. దానివల్ల ఫలం తక్కువేమీ రాదు. బ్రాహ్మణుడు తపోదాన యజ్ఞాదులవలన ఏ ఫలాన్ని పొందుతాడో, అటువంటి ఫలాన్నే ఆయన అనుగ్రహంచేత ఇట్టి జపం చేసిన వాడు కూడా పొందగలడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
02 Nov 2020
No comments:
Post a Comment