రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
62. అధ్యాయము - 17
🌻.సతీ వరప్రాప్తి - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఈ విధముగా దేవతలు శివుని గొప్ప స్తోత్రములతో స్తుతించిరి. శివుని నుండి ఆ సతీదేవి వరమును పొందెను. ఈ వృత్తాంతమును శ్రద్ధతో వినుము (1).
అపుడు సతీదేవి ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు మరల ఉపవసించి సర్వేశ్వరుని భక్తితో పూజించెను (2). ఈ తీరున నందా వ్రతము పూర్తి అయెను. నవమినాడు పగటి సమయమునందు ఆమె ధ్యానమునందు నిమగ్నురాలై యుండగా శివుడు ప్రత్యక్షమయ్యెను (3). ఆయన సర్వావయములయందు సుందరుడు. తెల్లని వాడు. అయిదు మోముల వాడు. ముక్కంటి . నుదుటిపై చంద్రుని ధరించియుండెను. ప్రసన్నమైన మనస్సు గలవాడు. తెల్లని కంఠము (నీలభాగము తక్క) గలవాడు. నాల్గు భుజములు కలవాడు (4).
త్రిశూలమును బ్రహ్మకపాలమును వరముద్రను అభయముద్రను చేతులయందు ధరించెను. ఆయన భస్మచే తెల్లగా ప్రకాశించుచుండెను. ఆయన శిరస్సుపై మందాకిని విలసిల్లు చుండెను.ఆయన సర్వాంగ సుందరుడు (5). ఆయన లావణ్యమునకు పెన్నిధి. కోటి చంద్రులతో సమానముగా ప్రకాశించెను. కోటి మన్మథులతో సమమగు కాంతిని గలిగి యుండెను.ఆయన ఆకారము యువతులకు అన్ని విధములుగా ప్రీతిపాత్రమగును (6).
సతీదేవి ఈ విధముగా నన్ను శివప్రభువును ప్రత్యక్షముగా గాంచి సిగ్గుతో వంగిన ముఖముగలదై ఆయన పాదములకు సమస్కరించెను (7). అపుడు మహాదేవుడు తపస్సునకు ఫలముగా ఆమెను భార్యగా స్వీకరించగోరి, మహావ్రతము ననుష్ఠించుచున్న సతీదేవితో నిట్లనెను (8).
మహాదేవుడు ఇట్లు పలికెను -
ఓ దక్షపుత్రీ! నీవు మంచి వ్రతమును చేసితివి. నీ యీ వ్రతముచే నేను సంతసించితిని. నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. ఇచ్చెదను (9).
బ్రహ్మ ఇట్లు పలికెను -
జగత్ర్ప భువగు మహాదేవునకు ఆమె మనస్సులో భావము తెలిసినదే. కాని ఆమె మాటను విను కోరికతో వరమును కోరుకొనుము అని పలికెను (10). కాని ఆమె లజ్జచే హృదయములోని మాటను చెప్పలేకపోయెను. ఆమె అభిష్టము లజ్జచే కప్పివేయబడెను (11).
ఆమె శివుని ప్రియమైన పలుకులను విని అతిశయించిన ప్రేమలో మునిగిపోయెను. భక్తవత్సలుడగు శంకరుడా విషయమునెరింగి మిక్కిలి ప్రసన్నుడాయెను (12). అంతర్యామి, సత్పురుషులకు శరణ్యుడు అగు శంభుడు సతీదేవి యొక్క భక్తికి వశుడై వెంటనే 'వరము నడుగుము, వరము నడుగుము' అని మరల పలికెను (13).
అపుడామె తన సిగ్గును నియంత్రించుకొని, 'వరముల నిచ్చువాడా! నివారింపశక్యము కాని వరమును నీకు ఇష్టమైన దానిని ఇమ్ము' అని పలుకగా (14), అపుడు భక్తవత్సలుడగు వృషభధ్వజుడు వాక్యము పూర్తి యగువరకు వేచి యుండలేదు. నీవు నా భార్యవు కమ్ము అని ఆయన ఆమెతో పలికెను (15).
అభీష్ట ఫలమును ప్రదానము చేసే శివుని ఈ మాటను విని, తన మనస్సులో నున్న కోరిక తీరుటచే మిక్కిలి ఆనందించినదై సతీదేవి మిన్నకుండెను (16). ప్రేమతో కూడియున్న శివుని యెదుట నిలబడి సుందరమగు చిరునవ్వుగల ఆ సతి శివుని కామమును వృద్ధి పొందించే హావ భావములను ప్రకటించెను (17).
అపుడు భావములతో కూడి శృంగారరసము వెంటనే వారి హృదయములలో ప్రవేశించెను. పైగా చెప్పిన తీరున హావభావములు సుందరముగా ప్రకటమయ్యెను (18). ఓ దేవర్షీ! లోకలీలలను అనుకరించే వారిద్దరిలో శృంగార ప్రవేశము వలన చిత్రాచంద్రమసులయందు వలె వారిద్దరి యందు వర్ణింపశక్యము కాని శోభ కన్పట్టెను (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
02 Nov 2020
No comments:
Post a Comment