గీతోపనిషత్తు - 66


🌹. గీతోపనిషత్తు - 66 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 3. రహస్యము -యోగము, జ్ఞానము పురాతనములు. తమకు తెలిసినపుడు తమకు నూతనమే కాని అది ఎప్పుడును సనాతనమే. తెలిసిన దానినే మరల తెలియ జెప్పుట యోగులు, జ్ఞానులు చేయుదురు. శ్రద్ధ కలిగి దైవమునకు సన్నిహితు లగుటకు సంసిద్ధులగు వారికి మాత్రమే యోగ మందించ వలెనని సూచన. 🍀

📚. 4. జ్ఞానయోగము - 3 📚

03. స ఏవాయం మయా 32 ద్య యోగః ప్రోక్తః పురాతనః

భక్త సి మే సఖా చేతి రహస్యం హ్యేత దుత్తమమ్ || 3

పురాతనము, శ్రేష్ఠము, రహస్యము అగు ఈ యోగమును నీవు నా మిత్రుడవు, భక్తుడవు అగుటచే నీకిపుడు నాచే తెలుపబడినది. అని భగవంతుడు పలుకుటలో చాల విశేషము ఉన్నది. శ్రీ కృష్ణుడుగ తానిపుడు అర్జునునకు తెలుపుచున్నను నిష్కామ కర్మయోగము సృష్టి ఆరంభము నుండి యున్నదని తెలుపుచున్నాడు. తాను స్థాపించినదని తెలుపుట లేదు. అందులకే అతడు జగద్గురువు.

సద్గురువు లెవరును తాము ఒక నూతన మార్గమును స్థాపించితిమని పలుకరు. పలుకువారు సద్గురువులు కారు. యోగము, జ్ఞానము పురాతనములు. తమకు తెలిసినపుడు తమకు నూతనమే కాని అది ఎప్పుడును సనాతనమే. తెలిసిన దానినే మరల మరల తెలియ జెప్పుట నిజమగు యోగులు, జ్ఞానులు చేయుదురు. అంతకు ముందు లేనిది తామిపుడు తెలుపుచున్నా మని పలుకువారు జ్ఞానులు, యోగులు కాజాలరు.

మానవులకు మరపు సహజము. మరచిన వారికి గుర్తు చేయుట పెద్దల కర్తవ్యము. కొన్ని విషయములు గుర్తు చేసినచో గుర్తు యుండును. కాని జ్ఞానపరము, యోగపరమగు విషయములు ఎన్నిమార్లు గుర్తు చేసినను మరపు కలుగుచుండును. అందువలన ఈ యోగము రహస్యమై నిలచినది అని భగవానుడనుచున్నాడు.

యోగము రహస్యముగ నుండుట ఎవరో స్వార్థముతో దానిని దాచి పెట్టుట వలన కాదు. జ్ఞానము కూడ నంతే. తెలిపినను మరపు వచ్చుట వలన అది నిజముగ రహస్యమై యున్నది. నిజమునకు గుర్తు కలిగి ప్రవర్తించినచో అంతకన్న ఉత్తమమైన జీవనము లేదు. అందుచే దైవము దీనిని ఉత్తమము, రహస్యము, సనాతనము అగు యోగమని పలికెను.

సన్నిహితుడవు, శ్రద్ధ కలవాడవు కనుక నీకు తెలుపుచున్నాను అని అనుటలో కూడ విశేషమున్నది. అర్జునుడు జన్మతః శ్రద్ధ కలవాడు. అతని శ్రద్ధ కారణముగనే దైవమగు శ్రీకృష్ణుని దర్శించిన వెంటనే సన్నిహితుడగుటకు ప్రయత్నించెను. శ్రద్ధ కలిగి దైవమునకు సన్నిహితు లగుటకు సంసిద్ధులగు వారికి మాత్రమే యోగ మందించ వలెనని మరియొక సూచన. అనగా యోగము సంతర్పణము చేయరాదు అని హెచ్చరిక.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


02 Nov 2020

No comments:

Post a Comment