కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 91



🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 91 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -21 🌻

నిద్రలో చాలా మంది లేచి కూర్చుంటూ ఉంటారు. అనేక రకాలైనటువంటి మనోవ్యాకులతలు వాళ్ళకు కలుగుతూ ఉంటాయన్నమాట! స్వప్నవశాత్‌ కానీ, లేదా మెలకువలో జీవించినటువంటి జీవన ధర్మంలో వ్యాపించినటువంటి వ్యతిరేక శక్తుల ప్రభావం వల్లగాని, వ్యతిరేక ఆలోచనల ప్రభావం వల్లగానీ, తానొకటి తలచిన, దైవమొకటి తలచునన్నట్లుగా జరుగుతున్నటువంటి వాస్తవిక కర్మానుభవం చేత గానీ, ఏమౌతుంది అంటే, ఈ రకమైనటువంటి మనోవ్యాకులత పెరుగుతుంది.

కర్మవశాత్‌ రజోగుణ ధర్మం ప్రేరణకు గురై, ఆ రజోగుణ ధర్మం చేతనే, పీడించబడుతూ ఉంటాడు. తానే పీడించబడుతాడు. కోపం, క్రోథం అనేటువంటి దానికి వశమౌతుంటాడు. కామము బలవత్తరమైపోతుంది.

“కామశ్చ క్రోధశ్చ లోభశ్చ” - వరుసగా ఆ ఒక్కొక్క గుణం కలగడం మొదలుపెడుతుందన్నమాట! అరిషడ్వర్గాలన్నీ కూడా ఒక దాని తరువాత ఒకటి లంఘించడం ప్రారంభిస్తాయి. అవి సూక్ష్మంగా పనిచేస్తూ, మనసుని మొత్తాన్ని ఆక్రమించేస్తాయి. “బుద్ధి నాశాత్ ప్రణశ్యతి” అంటుంది భగవద్గీత.


ధ్యాయతో విషయాన్‌ పుంసః సంఙ్గస్తేషూ పజాయతే |

సంఙ్గాత్సంజాయతే కామః కామాత్క్రోధోభిజాయతే ||


క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్‌ స్మృతి విభ్రమః |

స్మృతి భ్రంశాత్‌ బుద్ధి నాశో, బుద్ధి నాశాత్‌ ప్రణశ్యతి ||


బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |

లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా ||


‘సంగం త్యక్త్వా కరోత్య‘ అసలు మనం చేయవలసిన పద్ధతి ఏమిటిట? సంగత్వ దోషాన్ని విడిచి కర్మను ఆచరించాలి. కానీ మనం ఎలా చేస్తున్నామట? సంగత్వ దోషానికి గురై కర్మ చేస్తున్నాము. ఇదే బంధము. వేరే ఇంకేమీ లేదు. బంధాన్ని విడగొట్టుకోవాలి అంటే నిశ్చలబుద్ధి ఉండడం చాలా అవసరం. నిశ్చల బుద్ధి ఉన్నవాడు, పరమాత్మను తప్పక ఆశ్రయిస్తాడు. తప్పక పొందుతాడు.

కాబట్టి నిశ్చల బుద్ధి పొందాలన్నా కూడా ఎవర్ని పట్టుకోవాలయ్యా అంటే “మాం అను స్మరణ్‌” అంటుంది భగవద్గీత. నన్నే పట్టుకోవయ్యా బాబూ! త్రిగుణాత్మకమైనటువంటి నా మాయ, అతిక్రమింప రానిది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


02 Nov 2020

No comments:

Post a Comment