కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 93



🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 93 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -23
🌻

నాయనా! ఈ తోలుతిత్తి శరీరానికి తొమ్మిది చిల్లులున్నాయి. కుండకి తొమ్మిది చిల్లులున్నాయి. ఈ తొమ్మిది చిల్లులున్నటువంటి కుండ, ఈ చిల్లులే పనిచేస్తున్నాయని అనుకోవడం తప్పు కదా! అనేటటువంటి విచారణ చేయమంటున్నాడు. కళ్ళున్నాయి... కళ్ళు రెండు రంధ్రాలు. గోడకి రంధ్రాలు కొడితే ఎంత ఉపయోగమో, దీనికి కూడా రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాల వలన అంతే ప్రయోజనం. నిజానికి గుడ్డివాళ్ళకి కళ్ళు లేవా? అంటే, కళ్ళు అనే ఇంద్రియాలు ఉన్నాయి. కానీ, ఆ గోళకములకు వెనుక పనిచేసేటటువంటి ఇంద్రియాలు పనిచేయడం లేదు.

ఆ కంటి ఆప్టిక్‌ నర్వ్‌, మెదడుకు ఏదైతే కనెక్షన్‌ ఇచ్చేది ఉందో, అక్కడ ఫెయిల్‌ అయిపోతుంది. అందువల్ల ఏమైపోయింది? కళ్ళుండీ పనిచేయడం లేదు. కళ్ళు లేవా అంటే కళ్ళున్నాయి. కంటియొక్క వ్యవస్థ సరిగ్గా లేదు. కాబట్టి ఇది ఒకదానికంటే మరియొకటి సూక్ష్మం. దానికంటే అవతలది సూక్ష్మతరం. దానికంటే అవతలది సూక్ష్మతమం. కాబట్టి, ఈ రకంగా ఒక్కొక్క విధానం నుండి ఒక్కొక్కటి వెనుకకు మరలడం ఎట్లాగ అనేది చెప్తుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దృశ్యస్థానం దగ్గర ఉన్నాము. నిజానికి మాట్లాడితే దృశ్య స్థానము దగ్గర కూడా లేము.

దృశ్యస్థానము చేత ప్రతిఫలించిన సుఖదుఃఖ విశేషణం దగ్గరున్నాము. ఫలితం అన్నమాట అది. ఆ ఫలిత స్థానం దగ్గర మన విచారణ కొనసాగుతుంది. ఇది విచారణ స్థానం.

ఏదైనా ఒకదానిని చూచాం. చూసిన తరువాత దాని వల్ల సుఖమో, దుఃఖమో కలిగింది. ఇది బాగుంది, ఇది బాగోలేదు అనే ప్రియ అప్రియములు కలిగినాయి. కాబట్టి, ఈ ప్రియాప్రియములనె ఫలితముల వలన నువ్వు దేంట్లోకి గురైనావు? అంటే, నువ్వు ఎక్కడ ఉండాలి యాక్చువల్‌గా? ఆత్మస్థానంలో ఉండాలి. ‘నేను’ అనే స్వస్వరూప జ్ఞానంలో ఉండాలి. కానీ ఈ నేను ఒక్కొక్కమెట్టూ కిందకు దిగుతూ వచ్చేసింది. ఎక్కడి నుండి దిగుతూ వచ్చేసిందట? ఈ ఆత్మ పురుషుడు.

పురుషస్థానం దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు క్రిందకు దిగుతూ వచ్చేసింది. ఎంతసేపటిలో వచ్చింది? రెప్పపాటులో వచ్చేసింది. కనురెప్పపాటులో అది ఫలిత స్థానానికి దిగి వచ్చేసింది.

ప్రతి బింబములు ఒక దాని ప్రతిబింబము మరియొక దాని మీద పడుతూ వచ్చేసింది. అనేక అద్దాలు ఉన్నాయి, ఒక అద్దంలో ప్రతిఫలించినటువంటి ప్రతిబింబం మరియొక అద్దంలో ప్రతిఫలించింది. మరొక అద్దంలో ప్రతిఫలించింది మరొక అద్దంలో.... ఈ రకంగా ఒకదాని నుంచి మరొకదానికి ప్రతిబింబ సమాహారమంతా ఏర్పడిపోయింది. అది ఎట్లా ఏర్పడిందనేది క్రమంగా చెప్తున్నాడు. క్రింది నుంచీ పైకి చెప్తున్నాడు.

ముందు ఆ దృశ్యం. ఆ దృశ్యాన్ని చూడడానికి కావలసినటువంటి గోళకము ఏ పేరైనా పెట్టుకో! శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను గ్రహించడానికి కావలసినటువంటి నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియము లేదా చక్షురేంద్రియము, శ్రోత్రేంద్రియము. త్వక్‌, చక్షు, ఘ్రాణ, జిహ్వ అనే జ్ఞానేంద్రియములు. ఇవి కాక, వాక్‌, పాణి, పాద, పాయు, ఉపస్థలనే కర్మేంద్రియములు.

అవికాక ప్రాణాపాన సమాన వ్యాన ఉదాన మనే ప్రాణేంద్రియములు. అవికాక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయేంద్రియములు. ఇవి గాక ఇంకేవైనా వున్నాయా? మనోబుద్ధి చిత్త అహంకారములనే అంతరేంద్రియాలు. కాబట్టి, కొన్నేమో బయట గోళకములుగా వున్నవి.

ఈ గోళకముల వెనుక ఒక వ్యవస్థ ఉంది. ఆ నెర్వ్‌ సెంటర్లన్నీ పని చేస్తేనే, ఆ ఇంద్రియాలు పని చేస్తాయి. ఆ నెర్వ్‌ సెంటర్లు పని చేయలేదు. అప్పుడు ఏమైపోయింది? ఇంద్రియాలు ఉన్నాయి కానీ, పనిచేయడంలేదు. కాబట్టి, గోళకములు వేరే, ఇంద్రియములు వేరే. ఇంద్రియము అంటే ఆ నరాల వ్యవస్థ ఏదైతే ఉందో, పని చేసేటటువంటి ‘నెర్వ్‌ సెంటర్‌’, మెదడులో పని చేసేటటువంటి ‘నెర్వ్‌ సెంటర్‌’, న్యూరాన్ సెంటర్ ఏవైతే ఉన్నాయో, వాటికి ఇంద్రియములు అని పేరు. కాబట్టి, ఏమండి ఈయనికి బ్రయిన్‌లో క్లాట్‌ వచ్చిందండి. ఆ క్లాట్‌ ఏ ప్రక్క భాగానికి ఆగిపోతే, ఆ ప్రక్కభాగం ఇంద్రియాలు పని చేయడం మానివేస్తాయి.

పెరాల్సిస్‌ అంటే అర్థం ఏంటి? పక్షవాతం అంటే అర్థం ఇదే! వేరే ఇంకేమీ లేదు. ఇంద్రియాలు అన్నీ ఉంటాయి. కానీ వాటికి పటుత్వం ఉండదు. గోళకములు అన్నీ ఉన్నాయి. కానీ అవి పనిచేయవు. అర్థమైందా? అండీ! - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


04 Nov 2020

No comments:

Post a Comment