భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 152



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 152 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 26 🌻


పాపపుణ్యాలు అనేవి మనుష్యులకు మిశ్రమంగా ఉంటాయి. కేవలం పుణ్యంమాత్రమే చేసి ఉండేటట్లయితే, కేవలం పుణ్యంమాత్రమే ఉంటే, అసలు జీవుడు భూలోకంలో మనిషిగా పుట్టనేపుట్టడు. స్వర్గంలోనే ఉండిపోతాడు. కేవలం పాపంమాత్రమే చేసిఉంటే అధోలోకాల్లోనే ఉంటాడు. పశుపక్ష్యాది తిర్యగ్జంతు రూపంలో ఉంటాడు. భూలోకంలో మనుష్యుడు ఈ రెండూచేసినవాడై ఉంటాడు.

సుఖం అనేది మనసులోనే ఉన్నది. దుఃఖం కూడా మనసులోనే ఉంది.

సుఖము, దుఃఖము అంటూ సృష్టిలో ప్రత్యేకంగా ఏమీలేవూ. మనసుకు ఏది నచ్చితే అది సుఖము. మనసుకు నచ్చకపోతే అది దుఃఖము. మనసులేనివాడికి సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. అంటే కష్టసుఖాలనేవి మనస్సుకు ఇష్టమయినది, కానిది అనేదాన్నిబట్టే నిర్ధారింపబడతాయి.

జ్ఞానంలోంచివచ్చే మనస్తత్వం వేరుగా ఉంటుంది.

జ్ఞానంచేత తన శరీరం బాగా లేదేమో అని నిత్యం భయపడుతూ ఉండే దుఃఖం లోకంలో సామాన్యుడిది. ఆ విధంగా సుఖము, దుఃఖము అనే రెండువస్తువులు యథార్థంగాలేవని చెప్పి, అని శూన్యమే అయితే ఈ స్వర్గనరకాలుకూడా శూన్యమేనా అన్న ప్రశ్నకు – అవును శూన్యమే అని సమాధానం.

ఎందుచేతనంటే, ఈ జీవులు పాపాలుచేసే సమయంలోనే పాపచింతనతో ఉండి, అంటే దుఃఖపెట్టేటటువంటి లక్షణంతోనే ఆ పాపక్రియ చేస్తున్నారు. ఇంకొకరిని దుఃఖపెట్టేటటువంటి క్రియ అంటే, తాను దుఃఖాన్ని అవలంబించటమే అన్నమాట. వాళ్ళ మనసు వాళ్ళకుతెలియకుండానే దుఃఖాన్ని అనుభవించింది.

ఇంకొకళ్ళని కష్టపెట్టినా, వాస్తవానికి వాడి కన్ను వాడు పొడుచుకున్నట్లే. అంటే, దుఃఖాన్ని ఆశ్రయించటమే! అటువంటి స్థితిలోనే నరకానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళు నరకానికి రావటానికి హేతువు వాళ్ళు సృష్టించికున్నదే!

ఏ జీవుడి నరకం వాడే అనుభవిస్తున్నాడుకాని, ‘మనమందరము నరకంలో ఉన్నాము’ అని ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చూచు కోవటం అనేదేదీ లేదు.

ఏ జీవుడయినాకూడా, తన నరకంతో తాను ఇక్కడికి వచ్చాడు. తన స్వర్గంతో తానువెళ్తాడు. కాబట్టి మనఃప్రవృత్తిలో ఎప్పుడూ ఏ భావన ఉంటుందో, దేహాంతరమందుకూడా దానినే పొందుతాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



04 Nov 2020


No comments:

Post a Comment