గీతోపనిషత్తు - 67


🌹. గీతోపనిషత్తు - 67 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 5. జీవాత్మ - పరమాత్మ - ప్రకృతి ప్రభావము తీవ్రమగు నదీ ప్రవాహమువలె నుండును. అది త్రిగుణముల అల్లిక. దానిలో నుండి పుట్టినవారు నిజముగ పుట్టిన వారు. దైవము పుట్టనివాడు. ప్రకృతి గుణముల నుండి జన్మించిన వారు, కాలము రూపమున వ్యయమగు చుందురు. దైవమట్లు వ్యయము కాడు. జీవులకు తమపై ఈశ్వరత్వముండదు. దైవమునకు తనయందే కాక, సర్వజీవుల ప్రకృతి యందు ఈశ్వరత్వము కలదు. 🍀

📚. 4. జ్ఞానయోగము - 5 📚

అజో2పి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో2 పి సన్ |

ప్రకృతిం స్వా మధిష్టాయ సంభవా మ్యాత్మామాయయా | 6

ఈ శ్లోకమున శ్రీకృష్ణుడు తాను దైవమునని అర్జునునకు తెలుపుచున్నాడు. ముందు శ్లోకమున “నీకును, నాకును చాలా జన్మలు గడచినవని” తెలిపెను. అట్లగుచో జీవులవలె అతడును జనన మరణముల ననుభవించినాడా అను ప్రశ్న తలయెత్తును.

జీవులు ప్రకృతి వశమై జన్మ ఎత్తుచుందురు. వారు జన్మ పరంపరల వశమై మృత్యువు ననుభవించుచు ముందుకు సాగుదురు. తానట్టివాడు కాడని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. అతడు ప్రకృతి వశమై జన్మ ఎత్తుట లేదని, తన నుండి వెలువడిన ప్రకృతి ఆధారముగ తన మాయాశక్తిచే తాను రూపమును ధరించు చున్నానని తెలుపుచున్నాడు. ప్రకృతి తన నుండి ఉద్భవించినది.

తాను స్వచ్ఛందముగ అందు ప్రవేశించినను స్వతంత్రుడే. జీవులట్టి వారు కాదు. వారు ప్రకృతి గుణములకు లోబడి యుందురు. వారిని ప్రకృతి వశపరచుకొని యుండును. తాను ప్రకృతిని వశపరచుకొని జన్మించుచున్నాడు. దైవమునకు జీవునకు ఇదియే వ్యత్యాసము.

ఒకడు నదీ ప్రవాహమున స్వచ్ఛందముగ ప్రవేశించి ఈత కొట్టుచున్నాడు. మరియొకడు నదీ ప్రవాహమున కొట్టుకొని పోవుచున్నాడు. ఇద్దరును సమాన మెట్లగుదురు. ఇందు రెండవవాడు రక్షణ లేనివాడు. మొదటివాడు రక్షించ గలిగినవాడు.

ప్రకృతి ప్రభావము తీవ్రమగు నదీ ప్రవాహమువలె నుండును. అది త్రిగుణముల అల్లిక. దానిలో నుండి పుట్టినవారు నిజముగ పుట్టిన వారు. దైవము పుట్టనివాడు. ప్రకృతి గుణముల నుండి జన్మించిన వారు, కాలము రూపమున వ్యయమగు చుందురు. దైవమట్లు వ్యయము కాడు. జీవులకు తమపై ఈశ్వరత్వముండదు.

దైవమునకు తనయందే కాక, సర్వజీవుల ప్రకృతి యందు ఈశ్వరత్వము కలదు. జీవాత్మ, పరమాత్మలకు గల వ్యత్యాస మీ శ్లోకమున తెలియును.

శ్రీకృష్ణుడు పుట్టలేదు. దేవకీదేవి ప్రసవించిన శిశువుపై తన నాపాదించుకొనెను. కాలము కారణముగ అతడు వ్యయమై వృద్ధుడు కాలేదు. ఎప్పుడునూ పదహారు సంవత్సరముల యువకుని వలెనే గోచరించెను. అతని జీవితమున ఎన్నో ఘట్టములు జీవులపై తనకు గల ఈశ్వరత్వమును ప్రకటించినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


04 Nov 2020

No comments:

Post a Comment