రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
62. అధ్యాయము - 17
🌻.సతీ వరప్రాప్తి - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ప్రజాపతిని అగు నాతో ఇట్లు మాటలాడి మహాదేవుడు సరస్వతిని చూచి, వెంటనే సతీవియోగమునకు వశుడయ్యెను (37). శివుడు ఈ తీరున ఆజ్ఞాపించగా, కృతకృత్యుడనై నేను మిక్కిలి సంతసించితిని. భక్తవత్సలుడగు ఆ జగన్నాథునితో నేను ఇట్లు పలికితిని (38). హే భగవాన్! శంభో! నీవు చెప్పిన పలుకులను విచారణ చేసి యుక్తమేనని నేను నిశ్చయించుకొంటిని. హే వృషభధ్వజా! ఈ వివాహమునందు ప్రధానముగా దేవతలకు, మరియు నాకు కూడ స్వార్థము గలదు (39).
దక్షుడు స్వయముగనే నీకు తన కుమార్తెను ఈయగలడు. నీమాటను నేను కూడా ఆతనికి చెప్పగలను (40). సర్వేశ్వరుడు, ప్రభువు అగు మహాదేవునితో నేనిట్లు పలికి మిక్కిలి వేగముగల రథముపై నెక్కి దక్షుని ఇంటికి వెళ్లితిని (41).
బ్రహ్మ ఇట్లు పలికెను -
సతీ తపస్సును చేసి, మనస్సునకు అభీష్టమైన వరమును పొంది, ఇంటికి వెళ్లి,అపుడు తల్లిదండ్రులకు నమస్కరించెను (43). సతీదేవి యొక్క భక్తికి సంతసించి మహేశ్వరుడు వరమునిచ్చిన వృత్తాంతమును ఆమె తన సఖి చేత సమగ్రముగా తల్లి దండ్రులకు చెప్పించిరి (44).
సఖి నోటినుండి ఈ వత్తాంతమును వినిన తల్లిదండ్రులు పరమానందమును పొంది, గొప్ప ఉత్సవమును చేసిరి (45). విశాల హృదయుడగు దక్షుడు బ్రహ్మణులకు కోరినంత ధనమునిచ్చెను. గొప్ప మనసు గల వీరిణి కూడా అంధులు, దీనులు మొదలగు వారికి ధనమునిచ్చెను (46).
వీరిణి ప్రేమను వర్థిల్ల జేయు తన కుమార్తెను కౌగిలించుకొని, లలాటమునందు ముద్దిడి, ఆనందముతో మరల మరల కొనియాడెను (47). కొంత కాలము గడిచిన తరువాత ధర్మవేత్తలలో శ్రేష్ఠుడగు దక్షుడు ఇట్లు చింతిల్లెను. ఈ నా కుమార్తెను శివునకిచ్చి వివాహమును చేయుట యెట్లు?(48) ప్రసన్నుడై విచ్చేసిన ఆ మహాదేవుడు తిరిగి వెళ్లినాడట. ఈ నా కుమార్తె కొరకు ఆతడు మరల ఇచటకు వచ్చు ఉపాయమేది? (49) నేను వెంటనే ఎవరినో ఒకరిని శంభునివద్దకు పంపించవలెను. కాని అట్లు చేయుట యోగ్యము కాదేమో! ఆయన నా కుమార్తెను గ్రహించనిచో నా ప్రార్థన వ్యర్థమగును (50).
లేదా, నేను ఆ వృషభధ్వజుని పూజించెదను. ఇట్టి భక్తిచే నా కుమార్తె స్వయముగనే ఆయనకు భార్య కాగలదు (51). మరియు, ఆమెచే పూజింపబడిన శంభుడు తాను ఆమెకు భర్త కాగలనని వరమిచ్చి యున్నాడు. ఆయన కూడా పెద్దల ద్వారా వివాహయత్నమును చేయవచ్చును (52). దక్షుడు ఈ తీరున చింతిల్లు చుండగా నేను సరస్వతితో కూడి ఆతని ఎదుట వెనువెంటనే నిలబడితిని (53).
తండ్రినగు నన్ను చూచి దక్షుడు ప్రణమిల్లి వినయముతో నిలబడెను. మరియు ఆతడు నాకు యోగ్యమగు ఆసనమును సమర్పించెను (54). దక్షుడు చింతతో కూడి యున్ననూ నన్ను చూచి ఆనందించి, వెంటనే సర్వజగత్ర్పభువునగు నన్ను అట్లు విచ్చేయుటకు గల కారణమును గూర్చి ప్రశ్నించెను (55).
దక్షుడిట్లు పలికెను -
హే జగద్గురో! సృష్టికర్తవగు నీవు నాపై గొప్ప అనుగ్రహము గలవాడవై ఇచటకు వచ్చి యుంటివి. నీ రాకకు కారణమును చెప్పుము (56). హే లోకకర్తా! నీవు నా ఆశ్రమమునకు పుత్రప్రేమచే వచ్చితివా లేక, ఏదేని కార్యము కొరకై వచ్చితివా? మీ దర్శనముచే నాకు ఆనందము కలిగినది (57).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
04 Nov 2020
No comments:
Post a Comment