గీతోపనిషత్తు -105


🌹. గీతోపనిషత్తు -105 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 33. కర్మ నిర్వహణ జ్ఞానము - ఈ ప్రపంచములో జ్ఞానముతో సమానమైన పవిత్రత కలిగినది ఏదియు లేదు. ఈ నిష్కామ కర్మయోగ జ్ఞానము కాలక్రమమున యోగసిద్ధిని గావించి, సాధకునకు 'తాను' ఎవరో స్వయముగ తెలుపును. పరమ పవిత్ర స్థితియే విభూతి. ఆచరణ యందలి నిష్కామత, ఫలమునందు నిరాసక్తి, నిర్వహణము నందు త్రికరణ శుద్ధి, సిద్ధించిన కార్యము లందు మమకార పడకుండుట మాత్రమే మార్గము. జ్ఞానము సర్వము కర్మనిర్వహణ జ్ఞానమే 🍀

యథైధాంసి సమిద్దాం గ్ని ర్భస్మసాత్ కురుతేట ర్జున |
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా || 37

న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే |
తత్స్వయం యోగ సంసిద్ధః కాలే నాత్మని విందతి || 38


ఓ అర్జునా! బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలనే ప్రకారముగ భస్మీభూత మొనర్చుచున్నదో, ఆ ప్రకారముగనే, జ్ఞానమను అగ్ని సమస్త కర్మలను భస్మము చేసి వేయును. ఈ ప్రపంచములో జ్ఞానముతో సమానమైన పవిత్రత కలిగినది ఏదియు లేదు. ఈ నిష్కామ కర్మయోగ జ్ఞానము కాలక్రమమున యోగసిద్ధిని గావించి, సాధకునకు 'తాను' ఎవరో స్వయముగ తెలుపును.

కోరికలు, ఆవేశకావేశములు, స్వార్థచింతన, అహంకార పూరితమగు భావనలు, ఫలములం దాసక్తి, కార్యములందు వక్రత, తనదనుకొను వానియందు మమకారము పచ్చి కట్టెల వంటివి. అట్టి కట్టెలు అగ్నికార్యమునకు పనికిరావు.

కేవలము చివికి నశించుట జరుగును. ఎండుకట్టె అగ్ని స్పర్శతో త్వరితముగ మండగలదు. స్థితి మార్పులు పొందగలదు. పవిత్రీకరింపబడి, విభూతియై మిగులగలదు. విభూతి పరమ పవిత్రము. కారణమేమనగ అగ్ని దానిని ఏమియును చేయలేదు. పరమ పవిత్ర స్థితియే విభూతి. అగ్నివలననే కట్టె విభూతిగ మారుచున్నది.

జ్ఞానము వలననే మనిషి మహాత్ము డగుచున్నాడు. జ్ఞానమనగ, కర్మలను నిర్వర్తించు జ్ఞానము. కర్మ నిర్వహణమున పాత కర్మలు, ప్రస్తుత కర్మలు నశించవలెను. క్రొత్తకర్మలు పుట్టరాదు. వ్యక్తిగత కర్మము నుండి విమోచనము పొందినవారు దివ్యకర్మయందే చిరకాలము జీవించుచు నుందురు. శాశ్వతులుగ నుందురు.

అట్టివారు భగవత్ విభూతియే. కేవలము దైవమే వారి నుండి వ్యక్తమగుచు, శ్రేయస్సు చేకూర్చుచు నుండును. స్వయముగ భగవంతుడే వారియందు ఉపస్థితుడై యుండుటచేత 'స్వయమును' గూర్చి కూడ వారు కాలక్రమమున తెలిసిన వారగుదురు.

ఈ రెండు శ్లోకములలో స్థూలముగ మూడు పురోగమన ములు గోచరించును.

1. జ్ఞానముతో కూడి నిర్వర్తించు కర్మ వలన కర్మ నాశనము క్రమముగ నగుట.

2. కర్మమోచనము పొందినవారు పవిత్రులై నిలచి దివ్య కార్యములకు సమర్పణ చెందియుండుట.

3. దైవము తమనుండి దివ్యకర్మను వ్యక్తము చేయుచుండగ, కాలక్రమమున తామెవ్వరో తమకు తెలియుట.

ఇట్లాత్మజ్ఞానము కర్మ నిర్వర్తించు జ్ఞానము నుండే పొంద వచ్చని, మరియొక మార్గము లేదని దైవము సూచించు చున్నాడు. ఎంత తెలిసినను, ఎంత పాండిత్యమున్నను, ఎన్ని విధములగు విద్యలు నేర్చినను, ఆచరణ యందలి నిష్కామత, ఫలమునందు నిరాసక్తి, నిర్వహణమునందు త్రికరణ శుద్ధి, సిద్ధించిన కార్యము లందు మమకార పడకుండుట మాత్రమే మార్గము. జ్ఞానము సర్వము కర్మనిర్వహణ జ్ఞానమే అని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


22 Dec 2020

No comments:

Post a Comment