భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 190


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 190 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 3 🌻


12. ఒక గృహస్థాశ్రమంలోనే యోగము, భోగము, తపస్సు, దానము, త్యాగము, ధర్మము, సంగానికి ఋణం తీర్చుకోవడము – ఇటువంటివన్నీ సాధ్యమవుతాయి. అటువంటి ఆదర్శమైన గృహస్థధర్మాన్నే మన ఋషులు సాధించారు.గృహస్థ ధర్మం అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మహర్షులనే జ్ఞాపకం తెచ్చుకోవాలి. సంసారం బంధనం, బాధ అంటాం కాని; ఆ సంసారంలోనే ధార్మికదృష్టి కలిగిన వాడికి ఋణాలు తీర్చుకోవడానికి, ధర్మం అవలంబించడానికి, తపస్సు చేసుకోవడానికి అవకాశంఉంది.

13. సంసారంలో ఇబ్బందులు, బాధలు పుణ్యం లేకపోవడంవల్ల వస్తాయి. పూర్వపుణ్యం లేనటువంటి సంసారం చాలా కష్టభూయిష్టమైనది. అటువంటి సంసారంలోకూడా ఉత్తములు తపోభంగం లేకుండా జీవించారు. వాళ్ళ తపస్సుకు, నిష్ఠకు, ధర్మానికి ఏ భంగమూ కలుగకుండా వారు సంసారక్లేశాలను అనుభవించారు. కష్టంలేని సంసారమైనప్పటికీకూడా, ఇవన్నీ చేయగలమని అనుకోకూడదు. ఎన్నో కష్టాలు పడుతూకూడా మన పూర్వులు తమ ధర్మనిష్టలో లోపంరాకుండా జీవించారు. అదే భారతీయ ఆదర్శం.

14. తీవ్రమైన కోరికకలిగినా, దుఃఖంకలిగినా, గొప్ప అవమానం జరిగినా – ఈ లోకవ్యవహారాన్ని వదిలిపెట్టి తపస్సుకు వెళ్ళటమనేది ఆనాడు ఆర్యుల విధానం. ఆ తపస్సులోతప్ప శాంతికలుగదు.

15. విశ్వామిత్రుడు వసిష్ఠునిపై దండెత్తినప్పుడు, విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రసంపదంతా ఆ బ్రహ్మాండంలో లయమైపోయింది. అది నిర్గుణమైన బ్రహ్మవస్తువు. దాంట్లోంచే సగుణమైన జగత్తంతా పుట్టింది. అందువల్ల జగత్తంతా అందులో లయంచెందవలసిందే. ఈ జగత్తులో ఎటువంటి శక్తి అయినా, పదార్థమైనా, లక్షణమైనా, బలమైనా, అస్త్రమైనా బ్రహ్మలో లీనంకావలసిందే.

16. దేనియందు సృష్టియంతా లయం చెందుతుందో దానికి ప్రతీకయే ఆ బ్రహ్మదండం. అంతేకాని వసిష్ఠుడు ప్రత్యస్త్రప్రయోగం చేయడు.తిరిగి వేరే అస్త్రాలతో యుద్ధంచేయటం అనేది అవిద్యామూలకమైనదవుతుందే తప్ప, వస్తువులను లయంచేసే బ్రహ్మవస్తువు కాదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


22 Dec 2020

No comments:

Post a Comment