శ్రీ శివ మహా పురాణము - 304
🌹 . శ్రీ శివ మహా పురాణము - 304 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
74. అధ్యాయము - 29
🌻. దక్ష యజ్ఞములో సతి - 2 🌻
ఓరీ! ఇంద్రా! నీవు మహాదేవుని పరాక్రమమునెరుంగవా? క్రూరమగు కర్మలను చేయగలిగే హరునిచే నీ వజ్రము భస్మము చేయబడినది (21). ఓ దేవతలారా!మహాదేవుని పరాక్రమమును మీరెరుంగరా? ఓయీ అత్రీ !వసిష్ఠా! మునులారా !మీరిచట ఏమి చేసినారు ?(22) పూర్వము దారువనములో ఆ రుద్ర విభుడు భిక్షాటమును చేసినాడు. ఏలయన, ఆ సమయములో మునులగు మీరు ఆయనను భిక్షుడవు కమ్మని శపించిరి (23). అట్లు శపించిననూ రుద్రుడు ఏమి చేసినాడో మరిచినారా ఏమి? లింగ రూపుడగు శివుడు స్థావర జంగమాత్మకమగు జగత్తునంతనూ దహించివేసినాడు (24).
విష్ణువు బ్రహ్మ మొదలగు సర్వ దేవతలు, మునులు, ఇతరులు శంకరుడు లేని ఈ యజ్ఞమునకు వచ్చి మూర్ఖులైరి (25). ఎవని నుండి సర్వవేదములు, వేదాంగములు, శాస్త్రములు, వాక్కు పుట్టినవో, ఎవడు వేదాంతములచే ప్రతిపాదింపబడుచున్నాడో, అట్టి శంభుని కొందరు మాత్రమే తెలియగలరు. ఇతరులకు ఆయన అందడు (26).
బ్రహ్మ ఇట్లు పలికెను -
జగన్మాతయగు సతీదేవి కోపముతో కూడియున్నదై దుఃఖితమగు హృదయముతో అచట ఇట్టి అనేకములగు పలుకులను పలికెను (27). విష్ణువు మొదలగు సర్వ దేవతలు, మునులు భయముచే కల్లోలితమగు మనస్సులు గలవారై ఆమె మాటలను విని మిన్మకుండిరి (28). అపుడు దక్షుడు తన కుమార్తె యొక్క ఆ పలుకులను విని, ఆ సతిని క్రూరమగు చూపులతో చూచి, కోపమును పొంది, ఇట్లు పలికెను (29)..
దక్షుడిట్లు పలికెను -
నీవు అధిక ప్రసంగము నేల చేయుచున్నావు ?ఇపుడునీ కిచట పని లేదు. ఓ మంగళ స్వరూపులారా! వెళ్లెదవా ?ఉండెదవా? నీవు ఏల వచ్చితివి ?(30). నీ భర్తయగు శివుడు అమంగళుడనియు, కులహీనుడనియు, వేద బహిష్కృతుడనియు, భూత ప్రేత పిశాచములకు రాజనియు పండితులు చెప్పుచున్నారు (31). అందువలననే , ఓ పుత్రీ! విద్వాంసుడనగు నేను ఈ సత్యము నెరింగి మిక్కిలి చెడు వేషమును ధరించు రుద్రుని దేవతలు, ఋషులు కొలువు దీర్చియున్న ఈ యజ్ఞమునకు ఆహ్వానించలేదు (32).
బుద్ధిహీనుడు, పాపియగు బ్రహ్మ ప్రేరేపించగా నేను, వేదతాత్పర్యము తెలియనివాడు, గర్విష్ఠి, దుర్మార్గుడనగు రుద్రునకు నిన్ను ఇచ్చి వివాహమును చేసితిని (33). ఓ స్వచ్ఛమగు చిరునగవు గలదానా !కాన నీవు కోపమును వీడి స్వస్థురాలవు కమ్ము. నీవు ఈ యజ్ఞమునకు ఎటులైననూ వచ్చితివి గాన, దీనిలో పాలు పంచుకొనుము (34).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుడిట్లు పలుకగా, దక్షుని కుమార్తె, ముల్లోకములకు పూజ్యురాలునగు ఆ సతి నిందావచనములను పలుకు తన తండ్రిని చూచి మిక్కిలి కోపమును పొందెను (35). అపుడామె ఇట్లు తలపోసెను. నేను శంకరుని వద్దకు ఎట్లు పోగలను ? నాకగు శంకరుని చూడవలెనని యున్నది. ఆయన వివరములనడిగినచో, నేను ఏమి సమాధానము నీయగలను ? (36) అపుడు ముల్లోకములకు తల్లియగు ఆ సతి క్రోధముతో కూడినదై, నిట్టూర్పులను విడచుచున్నదై, దుర్బుద్ధియగు ఆ దక్షునితో నిట్లనెను (37).
సతి ఇట్లు పలికెను -
ఎవడు మహాదేవుని నిందించునో, ఎవడు మహాదేవుని నిందను వినునో, వారిద్దరు సూర్యచంద్రులున్నంత వరకు నరకములో నుందురు (38). కావున నేను దేహమును వీడెదను. అగ్నిని ప్రవేశించెదను. తండ్రీ !నా ప్రభువును గూర్చి అనాదరముతో నీవు పలికిన పలుకులను విన్న నాకు జీవతముతో పనియేమి ?(39).
శక్తిగలవాడు శంభుని నిందించువాని నాలుకను బలాత్కారముగా కోసివేయవలెను. అపుడా నిందావచనములను విన్న అశుద్ధి నిస్సందేహముగా తొలగిపోవును (40). అట్లు చేయ శక్తిలేని బుద్ధిమంతుడగు మానవుడు చెవులను గట్టిగా మూసుకొని అచటి నుండి తొలగిపోయినచో, ఆతడు శుధ్ధుడగునని గొప్ప పండితులు చెప్పుచున్నారు (41)|
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
22 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment