గీతోపనిషత్తు -106


🌹. గీతోపనిషత్తు -106 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


శ్లోకము 39 - 1

🍀 34 - 1. శ్రద్ధ - శ్రద్ధయనగ పరిపూర్ణ ఆసక్తితో కూడిన ఆచరణ. శ్రద్ధ కలవాడు తాను చేయు పనియందే మనసు లగ్నము చేసి యుండును. శ్రద్ధ గల మనసు సంయమము అను శక్తిని పొందును. ఎపుడైనను, ఎచటైనను విషయములు సూటిగ గోచరించుట, అవగాహన యగుట యుండును. సూక్ష్మమగు విషయములు కూడ సులభముగ అర్థమగును. శ్రద్ధ గలవా డన్ని విషయము లందును శ్రద్ధగ నుండును. 'శ్రద్ధ' అను గుణము సమస్తమగు సిద్ధులను సాధింపచేయును. జ్ఞానమునకు కూడ శ్రద్ధయే ప్రధానము. చేయు పనియందు శ్రద్ధ, ఫలముల యందనాసక్తి ముఖ్యమని తెలియవలెను. 🍀

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |
జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి మచిరే ణాధిగచ్ఛతి || 39


శ్రద్ధగలవాడు, తదేక నిష్ఠగలవాడు, యింద్రి యార్థము లందు చిక్కుకొననివాడు ఈ జ్ఞానమును పొందగలడు. జ్ఞానమును పొందినవాడు త్వరితగతిని పరమశాంతిని పొంద గలడు. జ్ఞానమునకు మూడరతతీ శ్లోకమున చెప్పబడినవి. అందు మొదటిది శ్రద్ధ, రెండవది నిష్ఠ. మూడవది యింద్రియ నియమము.

1. శ్రద్ధ :

శ్రద్ధయనగ పరిపూర్ణ ఆసక్తితో కూడిన ఆచరణ. ఆసక్తి లేనిదే ఎవ్వడును ఏ పనియు చేయడు. ఆసక్తి పూర్ణముగ నున్నచో మనసు పరిపూర్ణముగ ఒక పనియందర్పింప బడును. శ్రద్ధగ పనిచేయు వానికి మనసు పనియందు సమర్పితమగుట చేత యితర విషయములపై ప్రసరింపదు. పరిసరములందేమి జరుగుచున్నను అతనికి వాటి అస్థిత్వముండదు.

అర్జునుడు బాణము ఎక్కు పెట్టినపుడు పిట్టకన్ను మాత్రమే కనిపించుట, యితరములు గోచరింపకుండుట జరిగినది. ఇది శ్రద్ధకు తార్కాణము. అటులనే శ్రీరాముడు తాటి చెట్టు ఏడుతలలను కొట్టుట, పదునాలుగువేల రాక్షసుల నొక్క బాణముతో చంపుట శ్రద్ధకు తార్కాణము. శ్రద్ధ కలవాడు తాను చేయు పనియందే మనసు లగ్నము చేసి యుండును.

ఎన్ని సంవత్సరములైనను చేయు పనియందే శ్రద్ధ గోచరించును. శ్రద్ధ గల మనసు సంయమము అను శక్తిని పొందును. ఎపుడైనను, ఎచటైనను విషయములు సూటిగ గోచరించుట, అవగాహన యగుట యుండును. సూక్ష్మమగు విషయములు కూడ సులభముగ అర్థమగును. శ్రద్ధ గలవా డన్ని విషయము లందును శ్రద్ధగ నుండును.

కొన్ని విషయములందు శ్రద్ధ, కొన్ని విషయములందు అశ్రద్ధ యుండదు. రాముని జీవితమే దీనికి తార్కాణము. (భరతు నెట్లాద రించెనో, గుహుని కూడ అట్లే ఆదరించెను.) శ్రద్ధగలవాడు ప్రస్తుతమునందే యుండును. భవిష్యత్తు లోనికి తొంగిచూచుట, గతమును నెమరువేయుట యుండదు. శ్రద్ధ గలవానికి ఎదుట నున్న కర్తవ్యమే దైవము.

శ్రద్ధ అను గుణము చిన్నతనముననే నేర్చినవారు కార్యము లందు సులభముగ విజయమును సాధింపగలరు. మరపు గల వారందరు శ్రద్ధ లేనివారే.

ప్రస్తుత కాలమున మర పెక్కువ. అనగ శ్రద్ధ తక్కువ. నిజమునకు 'శ్రద్ధ' అను గుణము సమస్తమగు సిద్ధులను సాధింపచేయును. జ్ఞానమునకు కూడ శ్రద్ధయే ప్రధానము. చేయు పనియందు శ్రద్ధ, ఫలములయందనాసక్తి ముఖ్యమని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


23 Dec 2020

No comments:

Post a Comment