🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వసిష్ఠమహర్షి-అరుంధతి - 4 🌻
17. బ్రహ్మతేజోబలమే నిజమైన బలం, క్షత్రియ బలంకాదు అన్నది. “ధిక్ క్షత్రియబలం, బ్రహ్మతేజోబలం బలం” అనుకున్నాడు విశ్వామిత్రుడు. క్షాత్రం అంటే సృష్టిలో ఉండే శక్తులు. ఇవన్నీ సృష్టిలోని పదార్థాలే. ఈ పదార్థమంతా దేనియందుపుట్టి, దేనిలో స్థితికలిగి ఉండి, దేనిలో తిరిగి లయం చెందుతున్నదో; అటువంటి బ్రహ్మోపాసన చేసినవాడి బలం అనంతం. బలమంటే అదే.
18. బ్రహ్మజ్ఞాని అయిన వసిష్ఠుడికి దుఃఖం రావడమేమిటి? ఆత్మహత్యాప్రయత్నం చేయడమేమిటి? అనే సందేహాలు కలుగవచ్చు. అదంతా శరీరము, సంసారము యొక్క లక్షణమంతే. మరి బ్రహ్మజ్ఞానికి దుఃఖం అంటదంటారు కదా అని ప్రశ్న. దుర్భరమైన దుఃఖం ఆవేశించినా అది జ్ఞానికి ఒక్క క్షణమే. క్షణంలోనే దానిని ఉపసంహారం చేసుకుంటారు.
19. ఆ క్షణంలో ఏదయినా జరుగవచ్చు. ప్రకృతియొక్క ప్రభావం ఎంతటివాడిపైననైనా ఉంటుందని చెప్పటానికి మాత్రమే ఈ గాథలు ఏర్పడ్డాయి. వసిష్టుడికి వచ్చిన ఆగ్రహం, దుఃఖం ఒక్క ఘడియ, అంతే. ప్రకృతికి జ్ఞానిపై అంతవరకే ప్రభావం. ‘జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా | బలాదాకృష్య మోహాయ మహా మాయా ప్రయఛ్ఛతి||’ అని అందుకే అన్నారు. అంటే ఎంతటి నిగ్రహం కల వానినైనా, జ్ఞానినైనా ఒక్కక్షణం అజ్ఞానం ఆవరించవచ్చు. అది ప్రకృతియొక్క లక్షణం.
20. ఈ ప్రకృతిపట్ల అభినివేశంతో, ఈ సంసారం నాది అనే భావన ఒక్క క్షణం కలిగి, అంటే ఆత్మవిస్మృతి కలిగినపుడు ఒక్క తృటి దుఃఖం లేదా ఆగ్రహం జ్ఞానికి కూడా కలుగవచ్చు. అయితే సామాన్యులకు, జ్ఞానులకు భేదమేమిటంటే; శరీరమున్నంతసేపూ మనస్సు, బుద్ధి, చిత్తము బ్రహ్మజ్ఞాని యందుకూడా ఉన్నప్పటికీ, ప్రకృతియొక్క వికారము వారి మనోబుద్ధుల యందే క్షణంపాటు ఆవరిస్తుందే తప్ప, అది వారి ఆత్మయందు ప్రవేశించదు.
21. ఇంకా విశదంగా చెప్పాలంటే, సామాన్యుడికొచ్చే ఆగ్రహం అహంకారంగా జీవాత్మయందు ప్రవేశించి, కర్మచేయించి, దానిఫలాన్ని ఉత్తరజన్మకు ఇస్తుంది. అయితే జ్ఞానికి వచ్చే ఆగ్రహం కేవలం మనోబుద్ధులవరకు మాత్రమే పరిమితంకాని, వారి ఆత్మవస్తువుయందు ప్రవేశించదు, కర్మఫలహేతువుకాదు.
వసిష్ఠుడిని “యోగం అంటే ఏమిటి?” అని అడిగాడు జనక చక్రవర్తి. “యోగమంటే ధ్యానమే! అది రెండువిధాలుగా ఉంటుంది.
22. ప్రాణాయామపూర్వకంగా ఉంటుంది. మనస్సున ఏకాగ్రవృత్తి అనేదొకటుంది. సగుణభావంతో ప్రాణాయామము ఫలప్రదమవుతుంది, నిర్గుణభావంలో ఏకాగ్రత లభిస్తుంది. ఈ రెండూ యోగంవల్ల సాధ్యమవుతాయి” ‘మితాక్షర’ను ఆధారం చేసుకునే ‘హిందూ లా'(Himdu Law) పుట్టింది. బ్రిటీష్ హిందూ లా వచ్చింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Dec 2020
No comments:
Post a Comment