శ్రీ శివ మహా పురాణము - 305


🌹 . శ్రీ శివ మహా పురాణము - 305 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

74. అధ్యాయము - 29

🌻. దక్ష యజ్ఞములో సతి - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -


ఆమె ఈ తీరున ధర్మమును నీతిని చెప్పి, పశ్చాత్తాపమును పొందెను. ఆమె కలుషితమైన మనస్సుతో శంకరుని మాటలను స్మరించుకొనెను (42). అపుడా సతి మిక్కిలి కోపించి దక్షునితో , విష్ణువు మొదలగు దేవతలతో, మరియు మునులతో అందరితో నిశ్శంకముగా నిశ్చయముగా నిట్లు పలికెను (43).

సతీదేవి ఇట్లు పలికెను -

తండ్రీ! నీవు శంభుని నిందించితివి. తరువాత దుఃఖించెదవు. ఇహ లోకములో మహాదుఃఖముననుభవించి, మరణించిన తరవాత నరకయాతనలను పొందెదవు (44). ఏ పరమాత్మకు ద్వేష్యుడగు ప్రాణిగాని, ప్రియుడగు ప్రాణిగాని లేడో, అట్టి అజాత శత్రువగు శంకరునిపై నీవు తక్క మరెవ్వరు కక్ష గట్టెదరు? (45) దుర్మార్గులు ఈర్ష్యతో సర్వదా మహాత్ములను నిందించుట ఆశ్చర్యకరము కాదు. కాని మహాత్ముల పాదధూళిచే నశింపజేయబడిన తమోగుణము గలవారికి మహాత్ములను నిందించుట శోభావహము కాదు (46).

ఏ మానవులు ఒక్కసారి 'శివ' అను రెండక్షరములను ఉచ్చరించెదరో వారి పాపములన్నియూ వెనువెంటనే నశించును (47). అమంగళుడవు, దుష్టుడవు అగు నీవు పవిత్రమగు కీర్తి గలవాడు, ఉల్లంఘింప శక్యము కాని శాసనము గలవాడు, సర్వేశ్వరుడునగు శంభుని ద్వేషించుట ఆశ్చర్యము (48).

మహాత్ములు తమ మనస్సు అనే తుమ్మెదలతో ఆయన పాదములనే పద్మములను బాగుగా సేవించెదరు. ఆయన పాదములు భక్తుల కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. బ్రహ్మానందమును గోరు ముముక్షువులు ఆయన పాదములను ఆదరముతో గొల్చెదరు (49). శివుడు భక్త జనులకు వరములను ప్రేమతో వర్షించును. సర్వప్రాణులకు హితుడగు ఆయనపై మూర్ఖత వలన నీవు ద్వేషమును చూపుచున్నావు (50). శివుడు (మంగళ స్వరూపుడు) అమంగళ##వేషధారియా? బ్రహ్మాది దేవతలు, మునులు, సనకాది సిద్ధులు, ఇతరులు, విద్వాంసులు అట్లు తలచుట లేదు. నీవు మాత్రమే అట్లు తలంచుచున్నావు (51).

విశాల హృదయుడగు ఆయన, జటలను విరబోసుకొని, భూతములతో గూడి, శ్మశానమునందు కపాలధారియై, కపాలమాలను, భస్మను ధరించి ప్రీతితో నివసించుచున్నాడు (52). ఈ సత్యము నెరింగిన మునులు, దేవతలు ఆయన పాదధూళిని నిర్మాల్యముగా స్వీకరించి, ఆదరముతో శిరస్సుపై ధరించుచున్నారు. ఆ శివుడు పరమేశ్వరుడు (53).

వేదములో ప్రవృత్తి, నివృత్తి అను రెండు విధముల కర్మ విధింపబడినది. విద్వాంసులు వాటి మధ్య గల భేదమును విచారించి నిరూపించినారు (54). ఈ రెండు పరస్పర విరుద్ధములు గనుక, ఒకే వ్యక్తి ఒకే కాలములో రెండింటినీ అనుష్ఠింపజాలడు. పరబ్రహమ్మయగు శంభునియందు ఈ ద్వివిధ కర్మల సంబంధము లేదు (55).

ఓ తండ్రీ !ఆయనను మీరు పొందలేరు. మీరు యజ్ఞశాలలో కామ్య కర్మలననుష్ఠించి ధూమ్రమార్గమును పొందెదరు. మావంటి ఆత్మ జ్ఞానపరులు మాత్రమే కర్మ ఫలములను త్యజించి పరమాత్మను భజించెదరు (56). ఆయన లక్షణము ఇంద్రియ గోచరము కాదు. ఆయనను అవధూతలు చక్కగా సేవించెదరు. కావున, ఓ తండ్రీ! నీవు దుర్బుద్ధితో చూచి, అహంకారమును పొందకుము (57).

ఇన్ని మాటలేల ? నీవి దుష్టుడవు. నీ బుద్ధి అన్ని విధములుగా భ్రష్టమైనది. నీ నుండి జన్మించిన ఈ దేహముతో నాకు ప్రయోజనమేమియూ లేదు (58). మహాత్ములను పరిపరివిధముల నిందించు దుష్టుని జన్మ నిందార్హము. విద్వాంసుడు అట్టి వానితో సంబంధమును ప్రయత్నపూర్వకముగా వీడవలెను (59).

భగవాన్‌ వృషభధ్వజుడు నన్ను నీ కుమార్తెను గనుక దాక్షాయణి అని పిలుచును. అట్టి సందర్భములలో నా మనస్సు వెనువెంటనే మిక్కిలి క్లేశమును పొందును (60). కావున, నీ శరీరమునుండి ఉద్భవించిన ఈ దేహము శవమువలె మిక్కిలి అశుచియైనది, నిందితమైనది, కావున నేను ఇప్పుడు ఈ దేహమును నిశ్చయముగా వీడి సుఖమును పొందగలను (61).

ఓ దేవతలారా! మునులారా! మీరందరు నా మాటను వినుడు. దుష్ట బుద్ధిగల మీరందరు సర్వధా అనుచితమగు పనిని చేయుచున్నారు (62). శివుని నిందించి, కలిని ప్రేమించు మీరందరు మిక్కిలి మూఢులు. మీకు సంపూర్ణమగు దండన హరుని నుండి నిశ్చితముగా కర్మ ఫల రూపముగా లభించగలదు. దీనిలో సందేహము లేదు (63).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడా సతి యజ్ఞశాలయందు దక్షుని, ఇతరులను ఉద్ధేశించి ఇట్లు పలికి విరమించెను. ఆమె ప్రాణప్రియుడగు శంభుని మనస్సులో స్మరించెను (64).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు సతీ ఖండలో సతీ వాక్య వర్ణనమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


23 Dec 2020

No comments:

Post a Comment