✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 59 🌻
ఎందుకనంటే ఇవి ఏవీ కూడా స్వయముగా పనిచేయడం లేదు. కారణం ఏమిటంటే, దేవతలకి కూడా ఆ యా ఆసక్తులు పనిచేయడం చేత, వాళ్ళు కూడా ఈ విషయంలో సంశయగ్రస్థులు అవుతున్నారు. వాళ్ళు కూడా ఆత్మతత్వాన్ని ఎరగాలి అంటే, ఆత్మనిష్ఠులు అవ్వాలి అంటే, ఆ యా ఇంద్రియ అధిష్ఠాన దేవతలు కూడా మరలా మానవశరీరాన్ని ధరించవలసినటువంటి అవసరము ఉన్నది.
అంత విశేషమైనటువంటి మానవ దేహాన్ని ధరించి, కేవలము ఇంద్రియ వ్యాపార లక్షణము చేత, కేవలము ఇంద్రియ వ్యాపార సుఖము చేత, లాగబడుతూ, ప్రేరేపించబడుతూ అట్టి ఇంద్రియ వ్యాపారముల ఫలితములైనటువంటి సుఖదుఃఖములే సత్యమనుకొని, సుఖాపేక్షచేత ప్రేరేపించబడుతూ, జీవభావమునుండి మగ్నత చెందడం వల్ల, ఆ వివేకంతో, ప్రయత్నశీలివై లక్ష్యమునందు శుద్ధి కలిగినటువంటి వాడవై, సరియైన గురువును ఆశ్రయించి, ఈ పంచీకరణాన్ని, సాంఖ్యవిచారణని సాంగోపాంగముగా ఎరిగిన వాడవై, నీ నిజజీవితంలో ఆ రకమైనటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి, ఆత్మసాక్షాత్కార జ్ఞానమును, పరిణామ రహితమైనటువంటి స్థితిని పొందవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. ఇట్టి ఆత్మోపదేశాన్ని మానవులందరూ తప్పక అందుకోవాలి అనేటటువంటి ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నారు.
(ఇంతకు మందు ఇంద్రియములకు అంతరముగా మనస్సు, మనస్సుకు అంతరముగా బుద్ధి, బుద్ధికి అంతరముగా ఆత్మ ఉన్నటుల చెప్పబడినది. ఇప్పుడు ఆ ఆత్మ అన్నిటికి, అంతరముగా యుండి బుద్ధి మనస్సులతో కూడి, ఇంద్రియముల ద్వారా శబ్దాది విషయములను గ్రహించుచున్నటుల చెప్పబడినది. ఈ విధముగా ఆత్మయునికి దృఢముగాను, స్పష్టముగాను చెప్పబడినది. అయినప్పటికి అవిద్యతో కూడిన, అల్పజ్ఞానులు ఈ ఆత్మను తెలియలేకున్నారు.)
మరలా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలని సుస్పష్ట పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అజ్ఞానం ఆవరించియున్నప్పడు, ఆ యా దేహేంద్రియ మనోవ్యాపారం సత్యం అని తోస్తూఉంటాయి. తాత్కాలికములైనటువంటి సుఖదుఃఖములు సత్యములని తోస్తూఉంటాయి. షడ్రుచులు సత్యమని తోస్తూఉంటాయి. దశవిధ నాదాలు సత్యమని తోస్తూఉంటాయి. బాహ్యములైనటువంటి ఇంద్రియ వ్యాపారములే సత్యమని తోస్తూఉంటాయి. జన్మించినది అసలు ఇంద్రియ సుఖం కోసమేనని, తోస్తూ ఉంటాడు. తలపోస్తూ ఉంటాడు. ఇంద్రియాదులందు సుఖదుఃఖములను అనుభవించడం కొరకే పుట్టాను అనేటటువంటి మోహాన్ని పొందుతున్నాడు.
ప్రయత్నశీలియైనటువంటి వాడు, వివేకి అయినటువంటి వాడు, పెద్దల మార్గమును అనుసరించినటువంటి వాడు, మోక్షమార్గ అనురక్తుడైనటువంటి వాడు, స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ప్రయత్నశీలియైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, అతడు దృఢముగా ప్రయత్నం చేస్తాడు. జీవితంలోని దశాంతర్దశలయందు ఆత్మయొక్క ఉనికి లెస్సగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.
పైన చెప్పినటువంటి ఉపమానం ఏదైతే మరణావస్థతో పోలిక చెప్పారో, ప్రతీ ఒక్కరూ ఆ మృత్యుకాలమందు తాను ఎట్లు అగుచున్నాడో గుర్తుచేసుకుని, మరణావసాన సమయమందు, ఈ శరీరము ఎట్లు నిశ్చేతనమగుచున్నదో, అచేతనమగుచున్నదో, కట్టెవలె, కొయ్యవలె, దారువు వలె, శిలవలె పరిణామ రహితమై పడివుండుచున్నదో, కేవలము ఆత్మచైతన్య సంగత్వము చేత, ఆత్మచైతన్య ప్రభావము చేత, ఆత్మచైతన్య అంశీభూతము అగుట చేత, ఆత్మ చైతన్య ప్రభావశీలమై శరీరమంతా వ్యాపించి తన చైతన్యమును వ్యాప్తి ఒనరించడం చేత మాత్రమే ఇవన్నీ పనిచేస్తున్నాయనే సత్యాన్ని గుర్తించగలుగుతాడు.
తన మరణాన్ని తాను ఎఱిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, తనలో ఉన్నటువంటి ఆత్మచైతన్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు ఈ శరీరాన్ని ఒక తోలుతిత్తి వలె, ఒక వస్త్రము వలె, ఒక చెక్క వలె, ఒక మృణ్మయ దేహము వలె, ఒక మృత్తికా భాండము వలె చూస్తూ ఉంటాడు.
ఈ రకమైనటువంటి దృష్టి కలిగినటువంటివాడికి, ఈ ఘటము యొక్క విశేషము, ఈ ఘటము యొక్క పనితనము తెలిసినటువంటి వాడై, ఘటమును ప్రకాశింప చేసేటటువంటి స్వప్రకాశమే ప్రధానంగాని, ఘటము అప్రధానం అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడు. - విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Dec 2020
No comments:
Post a Comment