శ్రీ శివ మహా పురాణము - 294


🌹 .  శ్రీ శివ మహా పురాణము - 294 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

71. అధ్యాయము - 26

🌻. దక్షుని విరోధము - 2 🌻


శ్మశానమందు నివసించే ఈ సిగ్గులేనివాడు నాకీనాడు నమస్కారము నేల చేయుట లేదు? ఈతడు వైదిక కర్మలనన్నిటినీ త్యజించి, భూతపిశాచములచే సేవింపబడుతూ, మదించివాడై, వేదవిధులను జవదాటి, సర్వదా నీతి నియముములను ఉల్లంఘించుచుండును (15).

ఈతని అనుచరులు నాస్తికులు, దుర్జనులు, పాపాత్ములు. వారు బ్రాహ్మణుని చూచి బిగ్గరగా నిందింతురు. ఈతడు సర్వదా భార్యయందు అనురాగము కలిగియున్నవాడు. కావున, ఈతనిని శపించుటకై నేను ఉద్యుక్తుడనగుచున్నాను (16).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మహాదుష్టుడు కోపముతో కూడినవాడై అపుడిట్లు పలికి, రుద్రుని ఉద్దేశించి మరల ఇట్లు పలికెను. బ్రాహ్మణులారా! దేవతలారా! వినుడు. ఈతడు నాచే వధింపబడుటకు అనుమతిని మీరు ఈయదగుదురు (17). ఈ రుద్రుడు యజ్ఞమునుండి బహిష్కరింపబడినాడు. వర్ణహీనుడు. వికృతరూపము గలవాడు. ఈతనితో గూడి దేవతలు యజ్ఞ భాగమును స్వీకరించరు. ఈతడు శ్శశానమునందు నివసించును. యోగ్య కులములో జన్మించినవాడు కాదు (18).

ఈ దక్షుని మాటలను విని భృగువు మొదలగు ఋషులందరు దేవతలతో సహా, రుద్రుని దుష్ట వ్యక్తిగా భావించి గర్హించిరి (19). ఈ మాటలను విని నందీశ్వరుడు మిక్కిలి కోపముతో కూడిన వాడై కనుగ్రుడ్లను త్రిప్పుచూ, దక్షుని శపించగోరి, వేగముతో నిట్లనెను (20).

నందీశ్వరుడిట్లు పలికెను -

ఓరీ వంచకుడా!మహామూర్ఖా!దక్షా! దుష్టబుద్ధీ! నీవు నా స్వామియగు మహేశ్వరుని యజ్ఞ బాహ్యునిగా ఎట్లు చేసితివి?(21). ఎవనిని స్మరించినంత మాత్రాన యజ్ఞములు సఫలమగునో, తీర్థములు పవిత్రములగునో, అట్టి శివుని శపించుట ఎట్లు? (22) ఓ దుర్మతీ!దక్షా!నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివుని వ్యర్థముగా శపించితివి. దుష్టుడు గాని మహా ప్రభువగు రుద్రుని వ్యర్థముగా అవహేళన చేసితివి (23).

ఓరీ బ్రాహ్మణాధమా! ఎవ్వనిచే ఈ జగత్తు సృష్టింపబడి, పాలించబడి, లయము చేయబడునో, అట్టి మహేశ్వరుడగు రుద్రుని శపించుట ఎట్లు సంభవమగును? (24).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


12 Dec 2020

No comments:

Post a Comment