గీతోపనిషత్తు -112


🌹. గీతోపనిషత్తు -112 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚

🍀. ముందు మాట - నిజమునకు సృష్టియందు జరుగుచున్న కార్యము చాల హెచ్చు. చేయుచున్న కార్యములు అతి స్వల్పము. చేయుట నుండి సృష్టి యందు జరుగుచున్న కార్యములోనికి ప్రవేశించుటయే నిష్కామ కర్మయోగము నుండి కర్మసన్న్యాస యోగములోనికి ప్రవేశించుట. కర్మ సన్న్యాస యోగమున స్థిరపడిన జీవునికి కర్మ చేయుచున్నానను భావన యుండదు. కర్మ జరుగుచున్నదన్న భావనయే యుండును. ముందు తెలుపబడిన మూడు అధ్యాయముల నిష్కామకర్మ నిర్వహణ సూత్రములకు యీ అధ్యాయమున ఒక పరిపూర్తి ఏర్పడును. మనసు కర్మలయందు లగ్నము కాక, దైవము నందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట కర్మసన్న్యాసయోగ రహస్యము. 🍀

కర్మఫల సన్న్యాసమే కర్మసన్న్యాసముగ ఈ అధ్యాయమున పేర్కొనబడును. కర్మఫల సన్న్యాసము అనుభవమైన వారికి కర్మ చేయుట అను భావన నశించి, కర్మ జరుగుట అను అనుభూతి దైనందినముగ కలుగుచునుండును. కర్మ సన్న్యాస మనగ తమనుండి యితరుల నుండి జరుగుచున్న కర్మను సాక్షీభూతుడై గమనించుట.

నదీ ప్రవాహమును నదియొడ్డున నుండి గమనించినట్లు, జరుగుచున్న కర్మను గమనించు స్థితి అభ్యాసవ శమున నిష్కామ కర్మ యోగులకు కలుగును. వారికి కర్మ జరుగుచుండుట ఎక్కువగ గోచరించును. చేయుచుండుట అందులో భాగమని తెలిసి యుండును. పడవ ఒకటి ప్రవాహమున ప్రయాణము చేయుచుండగ, పడవ నడచుచున్నదని గ్రహించుట ఒక పద్ధతి.

ప్రవాహమే పడవను నడిపించుచున్నదని తెలియుట మరియొక పద్ధతి. పడవ లోని ప్రయాణికుడు తాను ప్రయాణము చేయుచున్నాడని భావించుట మరియొక పద్ధతి. పడవకు ప్రయాణికునికి ప్రవాహమే ఆధారము కదా! ప్రవాహమే లేనపుడు పడవకు, ప్రయాణికునికి ప్రయాణమే లేదు.

నిజమునకు సృష్టియందు జరుగుచున్న కార్యము చాల హెచ్చు. చేయుచున్న కార్యములు అతి స్వల్పము. చేయుట నుండి సృష్టి యందు జరుగుచున్న కార్యములోనికి ప్రవేశించుటయే నిష్కామ కర్మయోగము నుండి కర్మసన్న్యాస యోగములోనికి ప్రవేశించుట.

క్రొత్తగ వాహనము నడుపుట నేర్చినవాడు తానే వాహనమును నడుపుచున్నానని భావించును. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు హెచ్చరికగ వాహనము నడుపుట యందు లగ్నమై యుండును. క్రమముగ నిపుణతరాగ ఆడుచు, పాడుచు, సంభాషణములు చేయుచు, గంభీరమైన విషయములను మాట్లాడుచు వాహనము నడుపుచుండును.

ఇచట గమనించవలసిన విషయమొకటున్నది. బాహ్యేంద్రియములు వాహనమును యాంత్రికముగ నడుపుచుండగ, అంతఃకరణములతో జీవుడు ప్రసంగించుట, ఆడుట, పాడుట చేయుచుండును.

అతనికి వాహనము నడపు చున్నానను భావన కూడ అంతంత మాత్రముగనే యుండును. ఛలోక్తులతో ఆసక్తికర ప్రసంగములతో, పాటలతో సమయము గడచుచుండగ, ప్రయాణము పూర్తియగును. తాను వాహనము నడపిన భావమే యుండదు.

అట్లే కర్మ సన్న్యాస యోగమున స్థిరపడిన జీవునికి కర్మ చేయుచున్నానను భావన యుండదు. కర్మ జరుగుచున్నదన్న భావనయే యుండును. ముందు తెలుపబడిన మూడు అధ్యాయముల నిష్కామకర్మ నిర్వహణ సూత్రములకు యీ అధ్యాయమున ఒక పరిపూర్తి ఏర్పడును.

మనసు కర్మలయందు లగ్నము కాక, దైవము నందు లగ్నమగుటచే కర్మలు అప్రయత్నముగను, అనాయాసముగను సాగునని తెలుపుట కర్మసన్న్యాసయోగ రహస్యము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jan 2021

No comments:

Post a Comment