శ్రీ శివ మహా పురాణము - 312


🌹 . శ్రీ శివ మహా పురాణము - 312 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

77. అధ్యాయము - 32

🌻. వీరభద్రుడు - 2 🌻


జగత్సంహారమును చేయు ఆ రుద్రుడు అపుడు ఒక జటను ఊడబెరికి పర్వతముపై కోపముతో విసిరి కొట్టెను (20). ఓ మహర్షీ! ఆ ప్రభువు యొక్క జట విసిరి కొట్టుటచే రెండు ముక్కలై, మహాప్రలయమునందు వలె భయంకరమగు గొప్ప ధ్వని కలిగెను (21).

ఓ దేవర్షీ! ఆ జటయొక్క పూర్వభాగమునుండి మహాబలుడు, అతి భయంకరుడు, గణములకు నాయకుడు అగు వీర భద్రుడు జన్మించెను (22). ప్రలయకాలాగ్ని వలె ప్రకాశించువాడు, మిక్కిలి ఎత్తైన వాడు, వేయి భుజములు గలవాడు అగు ఆ వీరభద్రుడు భూమిని అంతనూ పూర్తిగా చుట్టివేసి ఆపైన పది అంగుళముల వరకు వ్యాపించి యుండెను (23).

అచట సర్వేశ్వరుడగు మహారుద్రుని కోపముతో గూడిన నిట్టూర్పుల నుండి వంద జ్వరములు, పదమూడు సన్నిపాత రోగములు పుట్టినవి (24). శివుని జటయొక్క రెండవభాగమునుండి మిక్కిలి భయంకరురాలగు మహాకాళి జన్మించెను. వత్సా! ఆమెను కోట్లాది భూతములు చుట్టువారి యుండెను (25).

విగ్రహమును ధరించిన క్రూరములగు ఆ జ్వరములన్నియు సర్వలోకభయమును గొల్పుచూ, తమ తేజస్సుచే ప్రకాశించుచూ, సర్వమును దహించునా యన్నట్లుండెను (26). అపుడు వీరుడు, చక్కగా మాటలాడే నేర్పు గలవాడునగు వీరభద్రుడు దోసిలియొగ్గి పరమేశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను (27).

వీరభద్రుడిట్లు పలికెను -

మహారుద్రా !నీవు అతి భయంకరుడవు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని నీ నేత్రములు. ఓ ప్రభో! నేను చేయదగిన పని యేమి ?వెంటనే ఆజ్ఞాపింపుము (28). హే ఈశానా !అర్ధ క్షణములో సముద్రములను ఎండింపజేయవలెనా? ఓ ఈశ్వరా! ఆర్థ క్షణములో పర్వతములను నుగ్గు చేయవలెను? (29) హే హరా! క్షణకాలములో బ్రహ్మాండమును భస్మము చేయవలెనా యేమి? క్షణకాలములో దేవతలను గాని, మునిశ్రేష్ఠులను గాని భస్మము చేయవలెనా? (30)

హే శంకరా! సర్వలోకములలో వాయు సంచారము లేకుండగా చేయవలెనా? ఈశానా! సర్వప్రాణులను సంహరించవలెనా యేమి? (31) ఓ మహేశ్వరా! నీ అనుగ్రహముచే నేను చేయలేని పని ఎచ్చటనైననూ లేదు. పరాక్రమములో నాతో సమానమైన వాడు పుట్టలేదు, పుట్టబోడు (32).

ఓ ప్రభూ! నీవు నన్ను ఎచటికైననూ ఏ కార్యమునైననూ ఉద్దేశించి పంపవచ్చును. నేను నీ అనుగ్రహముచే ఆ కార్యమును సత్వరమే నిశ్చయముగా సాధించగలను (33). మంగళకరుడగు నీ శాసనముచే అల్పులు కూడ సంసారసముద్రమును తరించెదరు. హే హరా! నేను మహావిపత్తు అనే సముద్రమును తరింప సమర్థుడను కాకపోదునా ?(34)

ఓ శంకరా !నీచే నియోగింపబడిన గడ్డి పోచయైననూ సునాయాసముగా గొప్ప కార్యమును క్షణములో చేయగల్గుననుటలో సందేహము లేదు (35). హే శంభో! కార్యము నీ సంకల్పరూపమగు లీలచేతనే సిద్ధించును. అయిననూ, ఆ కార్యము కొరకై నన్ను పంపుడు. ఇది మీకు నాపై గల అనుగ్రహమే (36).

హే శంభో! నాకు ఇటువంటి శక్తి నీ అనుగ్రహమువలననే కలిగినది. హేశంకరా! నీ అనుగ్రహము లేనిదే ఎవ్వనికైననూ శక్తి ఉండదు (37). ఎవడైననూ నీ ఆజ్ఞ లేనిదే గడ్డిపోచవంటి వస్తువులనైననూ కదల్చ సమర్థుడు కాడనుటలో సందేహము లేదు. ఇది సత్యము (38).

హే శంభో! మహేశ్వరా! దేవాదులందరూ కూడ నీ ఆజ్ఞకు బద్ధులగుదురు. సర్వప్రాణులను నియంత్రించునది నీవే. అటులనే, నీవు నన్ను కూడ నియోగించుము (39). ఓ మహాదేవా !నీకు నేను అనేక నమస్కారముల నాచరించుచున్నాను. హే హరా !నీవు నీకు అభీష్టమగు కార్యమును చక్కబెట్టుట కొరకై నన్ను ఇప్పుడు వెంటనే పంపించుము (40).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 Jan 2021

No comments:

Post a Comment