గీతోపనిషత్తు -121


🌹. గీతోపనిషత్తు -121 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 5

🍀. 4 . సాంఖ్యము - యోగము - జ్ఞానయోగులచే పొందబడు గమ్యమే కర్మయోగము చేతను పొందబడుచున్నది. కర్మ జ్ఞానములు రెండిటినీ ఒకటిగ చూచువాడే తెలిసినవాడు. ఏమి చేయవలెనో, ఎట్లు చేయవలెనో తెలిసి కర్మమును చేయుట కర్మబంధము నుండి జీవునికి విముక్తి కలిగించును. విముక్తి కలిగిన తరువాత కూడ కర్మాచరణమే యుండును. ఆచరణమే ఆనందమయమై నిలచును. అపుడు నిర్వహించునది దివ్యకర్మ యని పిలువబడును. మొదట బుద్ధిని ప్రచోదనము గావించుకొని, చేయదలచిన పనులను చేయుట కాక, చేయవలసిన పనులను చేయుట నేర్వ వలెను. 🍀

5. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగై రపి గమ్యతే |
ఏకం సాంఖ్యంచ యోగం చ యః పశ్యతి స పశ్యతి || 5


జ్ఞానయోగులచే పొందబడు గమ్యమే కర్మయోగము చేతను పొందబడుచున్నది. కర్మ జ్ఞానములు రెండిటినీ ఒకటిగ చూచువాడే తెలిసినవాడు.

ఏమి చేయవలెనో, ఎట్లు చేయవలెనో తెలిసి కర్మమును చేయుట కర్మబంధము నుండి జీవునికి విముక్తి కలిగించును. విముక్తి కలిగిన తరువాత కూడ కర్మాచరణమే యుండును. ఆచరణమే ఆనందమయమై నిలచును. అపుడు నిర్వహించునది దివ్యకర్మ యని పిలువబడును.

మహాత్ము లందరును దివ్య కర్మమునే నిర్వర్తించు నుందురు. వారికి కర్మబంధము లేదు. ఆచరణమందలి ఆనందమే యుండును. ఫలితముల యందు వారి కాసక్తి యుండదు.

దేనిని గూర్చి రాగము గాని, ద్వేషముగాని యుండదు. తటస్థ స్థితి యందుండి తమ వద్దకు వచ్చిన కర్మను ధర్మ మాధారముగ నిర్వర్తింతురు. ఇట్టి తటస్థస్థితి వశిష్ఠ, అగస్త్యాది మహర్షులు నిర్వర్తించి చూపిరి. ఇదియే నిజమగు సన్న్యాసము.

దైవము గీతయందలి రెండవ అధ్యాయమున బుద్ధిని ఆశ్రయింపమని తెలిపెను. మూడవ అధ్యాయమున కర్మ మాచరింప మని తెలిపెను. నాల్గవ అధ్యాయమున కర్మాచరణము త్యాగ

స్ఫూర్తిని కలిగించి, పరహిత యజ్ఞములనెట్లు నిర్వర్తింప చేయునో తెలిపెను. తదనుగుణమగు జ్ఞాన మెట్లబ్బునో తెలిపెను.

ఐదవ అధ్యాయమున తటస్థస్థితిని చేరుట తెలుపుచున్నాడు. ఈ సోపానములను యిట్లే అధిరోహించుట వలన ప్రాపంచిక బంధములు తప్పక తొలుగగలవు. భగవద్గీత యందలి అధ్యాయము లన్నియు యిట్లోక ఆరోహణ క్రమమును కలిగియున్నవి. యోగ మనగ క్రమముగ యిందలి సోపానములను అధిరోహించుటయే.

మొదట బుద్ధిని ప్రచోదనము గావించుకొని, చేయదలచిన పనులను చేయుట కాక, చేయవలసిన పనులను చేయుట నేర్వ వలెను. చేయవలసిన పనులు చేయుచున్నపుడు ఫలితముల నాశించుట, ఫలితముల కొరకై వక్రతల నాశ్రయించుట, కర్మ ఫలములకు రాగము కారణముగ లొంగుట విసర్జించవలెను. అట్లు చేయు కర్మాచరణము శుద్ధమై త్యాగపు తీరములు చేరును.

అపుడే ద్రవ్యాది ద్వాదశ యజ్ఞములు నిర్వహించు సామర్థ్యము కలుగును. అట్లు కర్మయందుత్తీర్ణుడైనవాడు తటస్థ స్థితిని చేరి సన్న్యాసి యగును. ఇదియొక ముఖ్యమగు క్రమము. తోచినది తోచినట్లు చేయుటగాక, పై క్రమము ననుసరించి యుండవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jan 2021

No comments:

Post a Comment