కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 159


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 159 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 89 🌻

ఎంత స్పష్టముగా చెబుతున్నాడో చూడండి. ఎన్ని ఉపమానాలు చెబుతున్నాడో చూడండి. ఇన్ని రకాలైనటువంటి అనాత్మ వ్యవహారమంతా ఉంది.

మరి ఇట్టి అనాత్మ వ్యవహారములలోనుంచి నిత్యమైనటువంటి అఖండమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వ విలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి ఆత్మ వస్తువును మానవుడు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే దివ్యత్వము సాధ్యమౌతుంది. అప్పుడు మాత్రమే జన్మరాహిత్యము సాధ్యమౌతుంది. అప్పుడు మాత్రమే అమృతత్వము సాధ్యమౌతుంది.

మానవుడు ఎప్పటికీ ఈ సత్యాలను గుర్తుపెట్టుకుని జీవిస్తూఉండాలి. తన ఆ జీవన పర్యంతమూ జనన మరణాలతోసహా, మృత్యుకాలంలో సహా, సహజమైనటువంటి తన స్వస్వరూప జ్ఞానాన్ని, స్వయం ప్రకాశాన్ని ఆశ్రయించి ఎవరైతే ఉంటారో వారికి మృత్యువే లేదు. ఎందుకని అంటే, వారు ఆ మృత్యువును దాటినటువంటి వారు.

వారు జనన మరణాలను దాటినటువంటి వారు. సశరీరులైన ఉన్నటువంటి అశరీరులు. శరీరము నందే ఉండి ముక్త స్థితిలో ఉన్నటువంటి వారు. వారికి శరీరము వలన ఏ రకమైనటువంటి సంగత్వము లేదు. అధ్యాస లేదు. ఈ రకంగా అనాత్మ యొక్క విశేషాలని వివరిస్తూ, అట్టి విశేషాలని త్యజించాలని చూపిస్తూ, అష్టవిధ శరీరాలలో సాక్షిగా ఉండాలనేటటువంటి బోధను మనకు అందిస్తున్నారు.

నచికేతా! అట్టి బ్రహ్మను తెలియుటకు సదాచార్యుల ఉపదేశము వలన మనస్సును సంస్కరింపవలయును, యమ నియమాదుల చేత బుద్ధిని శుద్ధమొనర్చవలెను. అట్టి శుద్ధ బుద్ధి చేతనే, ఏకరసమైన ఈ బ్రహ్మము తెలియదగినది. అన్యమార్గము లేదు.

బ్రహ్మము ఒక్కటే వాస్తవమనియు, దానికి వ్యతిరేకముగా ఏదియూ లేదని, దృఢనిశ్చయము చేయవలెను. అట్టి నిశ్చయము వలన అవిద్య నశించును. బ్రహ్మము ఏకము అను నిశ్చయము లేని వారికి, అవిద్య నానాత్వ బుద్ధిని కలిగించును. నానాత్వ బుద్ధి కలవారు మాటిమాటికి జనన మరణములను పొందుచున్నారు.

మరల స్పష్టముగా నిర్వచిస్తున్నారన్న మాట. ఏకరసమైనటువంటి, శుద్ధ బుద్ధి చేతనే, ఏక రసమైనటువంటి ఈ బ్రహ్మము తెలియదగినది. అన్యమార్గము లేదు.

అర్థమైందా? అండీ! అంటే ప్రపంచములో నువ్వు ఎన్ని మార్గాలలో వెతికినప్పటికి, ఎన్ని శోధనామార్గములు ప్రయత్నము చేసినప్పటికీ, అవన్నీ నిన్ను ఎక్కడకు తీసుకొచ్చి వదిలేస్తాయి. అంటే శుద్ధ బుద్ధి దగ్గరకు తీసుకొచ్చి వదిలేస్తాయి. ఆ శుద్ధ బుద్ధి చేత, నువ్వు పొందదగినటువంటి, ఏకైక వస్తువు బ్రహ్మము. ఏకైక వస్తువు ఆత్మ. మరి అట్టి, ఏకత్వస్థితిని చెందించేటటుంవంటి, శుద్ధ బుద్ధిని సాధించడమే మానవుని యొక్క ప్రయత్న ఫలము.

ఏమండీ! నన్ను పూజలు చేయమంటారా? జపం చేయమంటారా? ధ్యానం చేయమంటారా? యోగం చేయమంటారా? ఆసనాలు వేయమంటారా? ప్రాణాయామం చేయమంటారా? ఏం చేయమంటారు? విచారణ చేయమంటారా? లేదా సత్ క్రతువులు ఏమైనా యజ్ఞయాగాది కర్మలు చేయమంటారా?

లేదా, నవవిధ భక్తి మార్గాలలో ఉన్నటువంటి వాటిని ఏమైనా ఆచరించమంటారా? లేదా ఇతరత్రా దూషిత కర్మలలో నేను ఏమైనా ప్రయత్నం చేస్తే, నేను ఏమైనా ఉద్ధరించ బడ గలగుతానా? అనేటటువంటి ప్రశ్నలన్నీ మానవులకు కలుగుతూ ఉంటాయి. ఏం చేస్తే నేను బయట పడగలను? ఏం చేస్తే నేను ఉద్ధరింపబడగలను.

ఏం చేస్తే, నేను పొందవలసినటువంటి దానిని పొందుగలుగుతాను? ఏమి చేస్తే నేను ఈ స్థితిని అధిగమించ గలుగుతాను? అనేటటువంటి ప్రశ్నలు జననం నుంచి మరణం వరకూ వస్తూనే ఉంటాయి. కారణం ఆయా పరిస్థితులు కానీ, ఆయా అవసరములు కానీ, ఆయా ఆకాంక్షలు కానీ, ఆయా మోహ సదృశమైనటువంటి పరిస్థితులు కానీ, ప్రేరణలు కానీ, కామ క్రోధాది అరిషడ్వర్గములు కానీ, త్రిగుణాత్మకమైన వ్యవహారము కానీ, అవిద్య, మోహము కానీ...

వీటన్నిటిలోనుంచీ మానవుడు తప్పించుకోవడం రావాలి. వివేకంతో తప్పించుకోవాలి. విచారణతో తప్పించుకోవాలి. ఎదురుగా వెళ్ళి గోడ వుంటే, ఢాం అని గుద్దుకొని, ముక్కు పగిలిందండి, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారండీ? అంటే, నాయనా! గుద్దుకోకముందుకదా నీవు ఆలోచించాలి, తల పగలక ముందు కదా ఆలోచించాలి? అని అంటారు పెద్దలు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Jan 2021

No comments:

Post a Comment