శ్రీ శివ మహా పురాణము - 321


🌹 . శ్రీ శివ మహా పురాణము - 321 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

81. అధ్యాయము - 36

🌻. విష్ణు వీర భద్ర సంవాదము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-


అపుడీ విధముగా తన అభిప్రాయమును విష్ణువు ప్రకటించగా,ఇంద్రుడాయనను పరిహసించి, వజ్రమును చేత బట్టి, దేవతలతో గూడి యుద్ధమునకు సంసిద్ధుడాయెను (1). అపుడు ఇంద్రుడు ఏనుగును, అగ్నిమేకను, యముడు దున్నను, నిర్‌ ఋతి ప్రేతమును (2), వరుణుడు మొసలిని, వాయువు లేడిని, కుబేరుడు పుష్పకమును అధిష్ఠించి, జాగరూకత గల వారై యుద్ధమునకు సంసిద్ధులైరి (3). అదే విధముగా పరాక్రమవంతులగు ఇతర దేవతలు, యక్షులు, చారణులు, గుహ్యకులు తమ తమ వాహనముల నధిష్టించిరి (4).

అపుడు సర్వదేవగణములు, బలశాలురగు ఇంద్రుడు మొదలగు లోకపాలురు శివమాయచే విమోహితులై యుద్ధమును చేసిరి (5). అపుడు దేవతలకు, రుద్రగణములకు మధ్య గొప్ప యుద్ధము చెలరేగెను. వారు పదునైన బల్లెములతో, ఇనుపబాణములతో ఒకరితో నొకరు యుద్ధమును చేసిరి (6).

ఆ యుద్ధము అనే మహాసంరంభములో శంఖములు, భేరీలు, పెద్ద దుందుబులు, పటహములు, డిండిమములుఇత్యాది వాద్యములు మ్రోగింపబడెను (7). ఆ మహా శబ్దము చే ప్రోత్సాహింతులైన దేవతలు లోకపాలురతో గూడిన వారై, ఆ సమయములో శివకింకరులను సంహరింప జొచ్చిరి (8)

ఇంద్రుడు మొదలగు లోకపాలకులు, శంభుని గణములు వెనుదిరుగునట్లు చేసిరి. ఓ మహర్షీ! వారు భృగువు యొక్క మంత్రబలముచే సంహరింపబడిరి (9). యజ్వ యగు భృగువు దేవతలకు హవిర్భాగములనిచ్చి, దీక్షితుడగు దక్షుని సంతోషపెట్టుటకై ఆ రుద్ర గణములను తన మంత్రబలముచే తరిమి వేసెను (10). తన వారైన భూతప్రేతపిశాచములు ఓడి పోవుటను గాంచి వీరభద్రుడు మిక్కిలి కోపము గలవాడై, వారిని తనవెనుక ఉంచుకొని (11).

వృషభముల నధిష్ఠించిన గణములు ముందు నడుచు చుండగా, మహాబలుడగు ఆతడు స్వయముగా పెద్ద త్రిశూలము ధరించి దేవతలను పడగొట్టెను (12). అపుడు ఆ గణము దేవతలను, యక్షలను, సాధ్యుల గమములను, గుహ్యకులను, మరియు చారణులను శూలములతో పొడిచి వేగముగా సంహరింపజొచ్చిరి (13).

కొందరిని కత్తులతో రెండు ముక్కలుగా నరికిరి. మరికొందరిని ఇనుప రోకళ్లతో పొడిచి చంపిరి. ఆ గణములు ఆ యుద్ధములో దేవతలను ఇతర ఆయుధములతో గూడ కొట్ట జొచ్చిరి (14). ఈ విధముగా ఆ దేవతలందరు పారాజయమును పొంది, ఒకరితో మరియొకరికి సంబంధము లేకుండగా పారిపోయి, స్వర్గములో దాగిరి (15).

ఆ భయంకర సంగ్రామములో మహాబలవంతులగు ఇంద్రుడు మొదలగు లోకపాలురు మాత్రమే ఉత్సాహముతో ధైర్యము నవలంబించి నిలబడిరి (16). ఆ రణరంగమునందు ఇంద్రుడు మొదలగు వారందరు కలసి సంప్రదించుకొని, అపుడు బృహస్పతి వద్దకు వెళ్లి వినయముతో నమస్కరించి ఇట్లు ప్రశ్నించిరి (17).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


11 Jan 2021

No comments:

Post a Comment