✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 47 📚
ఎన్ని జన్మలెత్తిననూ, ఎంత మేధస్సును పెంచుకొనిననూ, ఎన్ని గ్రంథంములు చదివిననూ, ఎన్ని విజయములు పొందిననూ, ఎంత ధనము, కీర్తి సంపాదించిననూ మానవుడు ఎందులకో జీవితమున ప్రాథమిక సూత్రముల ననుసరించుట లేదు.
భారత దేశమున వేలాది సంవత్సరములుగా సగటు భారతీయునికి భగవానుడు తెలిపిన ఈ క్రింది సూత్రము తెలియును కానీ ఆచరింపము. ముమ్మాటికి ఆచరింపము. అందువలనే జీవన విభూతి లేదు.
కర్మణ్యేవాధికార స్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫల హేతుర్భూ ర్మా తే సంగో-స్త్వకర్మణి || 47
సూ|| ''కర్మ చేయుట యందే నీకధికారము కలదు గాని, ఫలముల యందు నీ కెప్పుడూ అధికారము లేదు.''
ఈ సూత్రము విననివారు లేరు. అంగీకరించి, అనుసరించు వారునూ లేరు! ఇంతకన్న జీవితమున మాయ ఏమి కలదు? కేవలము ఫలము కొరకే ప్రాకులాడు జాతికి నిష్కృతి లేదేమో!!అను నిస్పృహ కలుగక తప్పదు.
అధికారము లేని ఫలముల యందే అమితాసక్తి మానవ మేధస్సు కనబరచును కాని, తన అధికారములోని కర్తవ్యమును మాత్రము నిర్వర్తించము.
ఇది ఏమి లీల! రోగికి ఔషధము చేదుగా నుండును. అందు వలననే ఔషధము స్వీకరింపక మానవుడు మరల మరల మరణించుచున్నాడు.
కేవలము కర్తవ్యము నందు ఆసక్తి కలిగి ఫలితము నందు అనాసక్తత కలుగ వలెనన్నచో రెండే రెండు ఉపాయములు గలవు.
ఒకటి - యోగేశ్వరుల జీవిత చరిత్రలను పఠించి, స్ఫూర్తి చెంది, అట్లు జీవించుటకు ప్రయత్నించుట;
రెండవది - మన మధ్య తిరుగాడుచున్న యోగులను గుర్తించి ప్రత్యక్షముగ పై తెలిపిన సూత్రమును దర్శించి, తద్వారా స్ఫూర్తి చెంది, అట్లు జీవించుటకు ప్రయత్నించుట. ఇతరములైన మార్గములు కష్టతరములు.
ఇట్టి ప్రాథంమిక సూత్రమును మరచి, పండితులు గీతా పారాయణమునకు కూడ ఫలితమును నుడివిరి. ఫలిత మాశింపక కర్తవ్యమును ఆచరింపుమని లేదా నిర్వర్తింపుమని బోధించు గ్రంథంరాజమునకే పండితులు పంగ నామములు పెట్టిరి. వీరు 'కలి' చే నియమింపబడిన వారే కాని, తెలిసినవారు కారని తెలియుచున్నది కదా !
నిజముగ జీవితమును పండించు కొనదలచినచో భగవద్గీత యందలి ఈ ఒక్క వాక్యము చాలును.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
03.Sep.2020
No comments:
Post a Comment