శ్రీ శివ మహా పురాణము - 214


🌹 .  శ్రీ శివ మహా పురాణము - 214  🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

47. అధ్యాయము - 2

🌻. కామప్రాదుర్భావము - 3 🌻

కాంచనీకృత జాతాభః పీనోరస్క స్సునాసికః | సువృత్తోరు కటి జంఘో నీలవేలిత కేసరః || 24
లగ్న భ్రూయుగలే లోలః పూర్ణచంద్రని భాననః | కపాటాయత సద్వక్షో రోమరాజీవి రాజితః || 25
అభ్రమాతంగ కాకారః పీనో నీలసువాసకః | ఆరక్త పాణినయన ముఖపాదకరోద్భవః || 26
క్షీణ మధ్య శ్చారుదంతః ప్రమత్త గజగంధనః | ప్రపుల్ల పద్మపత్రాక్షః కేసరఘ్రాణతర్పణః || 27

ఆతడు బంగారము వలె ప్రకాశించెను. ఆతడు దృఢమగు వక్షస్థ్సలమును, సుందరముగ ముక్కును, గుండ్రటి ఊరువులను, మోకాళ్లను, పిక్కలను, నల్లని కేశములనుకలిగియుండెను (24).

ఆతని కనుబొమలు కలిసియుండి సుందరముగా కదలాడుచుండెను. ఆతని ముఖము పూర్ణిమ నాటి చంద్రుని బోలియుండెను తలుపువలె విశాలమైన, దృఢమైన వక్షస్థ్సలము గల ఆతడు రోమపంక్తిచే ప్రకాశించెను (25).

అతడు మేఘమువలె, ఏనుగువలె ప్రకాశించెను. ఆతడు బలిసి యుండెను. ఆతడు నీలవర్ణము గల సుందర వస్త్రమును ధరించియుండెను. ఆతని చేతులు, నేత్రములు, ముఖము, పాదములు రక్త వర్ణము కలిగియుండెను (26).

ఆతడు సన్నని నడుముతో, సుందరముగ దంతములతో, మదించిన ఏనుగువలె సుగంధము గలవాడై, వికసించిన పద్మము యొక్క పత్రముల వంటి కన్నులు గలవాడై ఉండెను. అతని ముక్కు పున్నాగ పుష్పము వలె ప్రకాశించెను (27)

కంబుగ్రీవో మీనకేతుః ప్రాంశుర్మకరవాహనః | పంచపుష్పాయుధో వేగీ పుష్పకోదండమండితః || 28
కాంతః కటాక్షపాతేన భ్రామయన్నయనద్వయమ్‌ | సుగంధిమారుతో తాత శృంగారరససే వితః || 29
తం వీక్ష్య పురుషం సర్వే దక్షాద్యా మత్సుతాశ్చ యే | ఔత్సుక్యం పరమం జగ్ము ర్విస్మయావిష్టమానసాః || 30
అభవద్వికృతం తేషాం మత్సుతానాం మనో ద్రుతమ్‌ | ధైర్యం నెవాలభత్తాత కామాకులిత చేతసామ్‌ || 31
మాం సోs పి వేధసం వీక్ష్య స్రష్టారం జగతాం పతిమ్‌ | ప్రణమ్య పురుషః ప్రాహ వినయానత కంధరః || 32

ఆతడు శంఖము వంటి కంఠము గలవాడు. చేపకన్నుల వాడు. పొడవైన వాడు. మొసలి వాహనముగా గలవాడు. అయిదు పుష్పములే ఆయుధములుగా గలవాడు. వేగము గలవాడు. పూలధనస్సుతో ప్రకాశించువాడు (28).

ప్రియమైన వాడు. కన్నులను త్రిప్పుచూ ఇటునటు చూచువాడు. వత్సా! ఆతనిపై నుండి వచ్చు గాలి పరిమళభరితమై యుండెను. ఆతనిని శృంగార రసము సేవించుచుండెను (29).

ఆ పురుషుని చూచి దక్షుడు మొదలగు నా కుమారులందరు విస్మయముతో నిండిని మనస్సు గలవారై మిక్కిలి ఉత్కంఠను పొందిరి (30).

కామముచే వ్యాకులమైన ఆ నా కుమారులను మనస్సు శ్రీఘ్రమే వికారమును పొందెను. వత్సా! వారు ధైర్యమును కోల్పోయిరి (31).

ఆ పురుషుడు స్రష్ట, జగత్ర్పభువు, బ్రహ్మయగు నన్ను గాంచి వినయముతో తలవంచి నమస్కరించి ఇట్లనెను (32).

పురుష ఉవాచ |

కిం కరిష్యామ్యహం కర్మ బ్రహ్మంస్తత్ర నియోజయ | మాన్యోsద్య పురుషో యస్మాదుచితశ్శోభితో విధే || 33
అభిధానం చ యోగ్యం చ స్థానం పత్నీ చ యా మమ | తన్మే వద త్రిలోకేశ త్వం స్రష్టా జగతాం పతిః || 34

పురుషుడిట్లు పలికెను-

హే బ్రహ్మన్‌! నేను చేయదగిన కర్మ ఏదియో, దాని యందు నన్ను నియోగింపుము. హే విధీ! ఈ లోకములో పూజనీయుడు, ధర్మశోభితుడు అగు పురుషుడు నీవేగదా (33).

నా పేరును, నాకు యోగ్యమగు స్థానమును, మరియు నా భార్యను గురించి నాకు చెప్పుము. ముల్లోకములకు ప్రభువగు ఓ బ్రహ్మా! సృష్టించువాడవు, జగత్పతివి నీవే గదా! (34).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

03.Sep.2020

No comments:

Post a Comment