కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 44


🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 44  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 8 🌻

ఆశీఃపూర్వకమైన వాక్యమును ఇక్కడ ప్రయోగించారు. ఇది చాలా గొప్ప విశేషం. గురువు వాగ్ధానం చేశాడు అంటే వాగ్ధానభంగం జరిగేటటువంటి అవకాశమే లేదు. అది ఈశ్వర నియతితో కూడుకున్నటువంటి అంశం అనమాట.

కాబట్టి వారు సంకల్పించరు, వాగ్ధానం చెయ్యరు. అధవా వారు సంకల్పిస్తే, వారు వాగ్ధానం చేస్తే దానికి ప్రతి అనేది సృష్టిలో వుండదనమాట. కారణం ఏమిటంటే సాక్షాత్తు వారికి ఈశ్వరుడికి భేదములేదు కాబట్టి.

అటువంటి నియమము పాటించబడుతుంది కాబట్టి వైవశ్వతుడు అయినటువంటి యమధర్మరాజు అయినటువంటి సమదర్శి అయినటువంటి సమవర్తి అయినటువంటివాడు చక్కని ఆశీఃపూర్వకమైనటువంటి వాక్యాన్ని అక్కడ ప్రయోగించారు.

“ఆత్మసాక్షాత్కార జ్ఞానమును పొందెదరు గాక!” తప్పక మీరు పొందుతారు అనేటటువంటి ఆశీః పూర్వకమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ తెలియజేశారనమాట. చాలా ఉత్తమమైనటువంటి వాక్యం ఇది.

ధనం, గృహారామ క్షేత్రం మొదలగు సంపదలన్నియు అనిత్యములని నేనెరుగుదును. కామ్య కర్మలవలన కలుగు ఫలము ఐహికాముష్మిక సుఖములు కూడా అశాశ్వతమని ఎరుగుదును.

అనిత్యములగు సాధనలచేత నిత్యమగు ఆత్మతత్వమును పొందజాలమనియు నేనెరుగుదును. అందుచే కర్మఫలాపేక్షను వదలి కర్తవ్య కర్మలను నాచికేతాగ్నిని చయన మొనరించి సాపేక్షిక నిత్యత్వం గల యమాధికారమును పొందితిని.

(కామ్య కర్మలను ఫలాపేక్షతో చేయువారు మోక్షం పొందజాలరు. ఫలాపేక్ష లేకుండా కర్మల నాచరించువారు చిత్తశుద్ధిని పొంది జ్ఞానసముపార్జన ద్వారా మోక్షమును పొందుదురు).

మనం ఎట్లా వుండాలి అనేది స్పష్టమైనటువంటి నిర్ణయంగా తెలిపారనమాట.

ఎవరికైతే ధనం మీద గాని, గృహం మీద గాని, ఆరామములమీద గాని, క్షేత్రం మీదగానీ, సంపదల మీద గానీ, అనిత్యములు అంటే పరిణామము చెందేటటువంటి వాటిని ఏవైనాసరే కూడా సుఖం గాని, దుఃఖం గాని ద్వంద్వానుభూతులు ఏవైనా సరే అనిత్యం క్రిందకే వస్తాయి. వీటియందు ఆసక్తి ఎవరికైతే వుంటుందో, వాళ్ళు ఎప్పటికీ ఈ ఆత్మానుభూతిని పొందజాలరు.

కాబట్టి మానవులందరూ తప్పక వీటియందు విముఖత, వైరాగ్యం, నిరసించడం, ఆసక్తిని పోగొట్టుకోవడం, సంగత్వ దోషాన్ని పోగొట్టుకోవడం తప్పదు. చాలా అవసరం.

అది అధికారం అనేటటువంటి పద్ధతిని యమధర్మరాజు చెప్తున్నాడు. మనల్ని జనన మరణ చక్రంలో పడవేసేవి ఏవైతే వున్నాయో, వాటిని నిరసించమని చెప్తున్నాడు. మనం మరల యమధర్మరాజు దగ్గరికి రెండోసారి వెళ్ళకూడదు.

ఒకసారి వెళ్ళాం ఆల్రెడీ [already] పూర్వ జన్మలో. మళ్ళా వచ్చాం ఈ జన్మకి. మరల ఈ జన్మ తరువాత తిరిగి యమధర్మరాజు యొక్క దర్శనం కలగకుండా వుండాలి అంటే, ఏవేవి వాటియందు ఆసక్తిని పోగొట్టుకోవాలో స్వయముగా యమధర్మరాజే బోధిస్తున్నాడు. ఇంతకు మించి ఉత్తమ ఉపదేశం లేదు. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

03.Sep.2020

No comments:

Post a Comment