నారద భక్తి సూత్రాలు - 112



🌹.   నారద భక్తి సూత్రాలు - 112   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 81 - part 2

🌻 81. త్రి సత్యస్య భక్తిరేవ గరీయసీ, భక్తిరేవ గరీయసీ || - 2 🌻

ఈ ఐదు విభవాలు భక్తులకు ఆరాధ్యాలు. ఇవి గాక, అంతర్యా మిత్వం కూడా ఆయన యొక్క విభవమే. అంతర్యామి అంటే అగ్నియందు ఉష్ణత్వంగా, జలమందు ద్రవత్వంగా, జడములందు జడశక్తిగా, ప్రాణులందు ప్రాణ శక్తిగా, జీవులందు జీవచైతన్యంగా, మానవులందు “నేను” గా వ్యక్తమయ్యే మూలశక్తి. ఆ మూలశక్తే పరమాత్మ చైతన్యం, ప్రజ్ఞానం. అదే సత్యం. అది నిరాకారం. దీనినే భగవంతునిగా ఆరాధిస్తాం. విగ్రహాల్లో కూడా అంతర్యామిత్వం ఉంటుంది.

అంతర్యామి అంటే లక్ష్మీ సమేతుడై, దివ్య మంగళ స్వరూపుడై భక్తుల హృదయంలో, సర్వత్రా కొలువై ఉన్నవాడు. తెలుసుకోలేని వారిలో, తెలుసుకోగలిగిన వారిలో కూడా ఉన్నాడు. భక్తి సాధనచేత తెలుసుకొని భగవదైక్యం పొందడానికి భక్తులకే సులభం.

అవాజ్మానస గోచరమైన భగవానుడు జ్ఞాన, ధ్యాన యోగాలలో కంటే భక్తి యోగంలో భక్త సులభుడు. అయితే జ్ఞానుల అవగాహనకోసం కూడా భగవంతుడు వ్యూహాలుగా వ్యాపకమై ఉన్నాడు. అవి అయిదు వ్యూహాలు. మొదటిది పరతత్త్వం.

మిగిలిన నాలుగు (1) వాసుదేవ వ్యూహం (2) ప్రద్యుమ్న వ్యూహం (3) సంకర్షణ వ్యూహం (4) అనిరుద్ధ వ్యూహం.

1. పరతత్త్వం :

కోటి భాస్కర తేజుడై శ్రీ నీళా భూసమేతుడై, హేమ పీతాంబరుడై, శంఖు చక్ర గదా పద్మ ధరుడై, దివ్యాభరణ భూషితుడై, గరుడ, అనంత, విష్వక్సేనుల వంటి నిత్య సూరులచే సేవింపబడుతూ ఉండే తత్త్వం. ముక్తులకు తప్ప, సాధారణ భక్తులకు, ఇతరులకు దొరకనిదే పరతత్త్వం. ఆయన పరమపదమున అపరిమిత ఆనందభరితుడై ఉన్నాడు.

2. వాసుదేవ వ్యూహం :

శ్రీకృష్ణుడు అర్జునునితో కూడి నరనారాయణుడై తదీయ ప్రతిజ్ఞా నిర్వహణార్థం వైదిక పుత్ర సవకంబున తీసుకొని వచ్చిన స్థానాన్ని వాసుదేవ వ్యూహమంటారు. ఈ వ్యూహం కేవలం నిత్య సూరులకే తెలియబడుతుంది.

3. ప్రద్యుమ్న వ్యూహం :

బ్రహ్మలోకంలో వసించి, బ్రహ్మచేత పూజింప బడుతూ, తద్దేశవాసులను రక్షించే వ్యూహం.

4. సంకర్షణ వ్యూహం :

పాతాళంలో వసించి, బలి చక్రవర్తి, తద్దేశ వాసులను రక్షించే వ్యూహం.

5. అనిరుద్ధ వ్యూహం :

క్షీర సాగరంలో ఒక వైకుంఠాన్ని నిర్మించి, లక్ష్మీ సమేతుడై వసించే వ్యూహం. ఇది పూర్ణావతారాలకు మూల కందం. బ్రహ్మాది మునిపుంగవులు ఆయనను అవతరించమని ప్రార్థించేది ఇక్కడే. బ్రహ్మ, రుద్రులు, దేవతలు, సనకాది మునీంద్రులు, అక్కడికి వెళ్ళారు. ఇది వారి వారి కొరతలు తీర్చుకొనడానికి అనుకూలమైన వ్యూహం.

సాధారణ భక్తులకు ఈ వ్యూహాలు అందుబాటులో ఉండవు. సాధన ఫలితంగా వారు ఆయా వ్యూహాలలో చేరి, ఆనందిస్తారు. భక్తి సలపడానికి విభవ స్వరూపాలే అందుబాటులో ఉంటాయి. అవతారాల కాలం కాకపోయినా వారి విగ్రహాలను అర్చావతారాలుగా భావించి భక్తి సలపడం అందుబాటు లోనిది.

మానసిక భక్తిగా మారే వరకు విగ్రహారాధన చేసే క్రియలను అపరాభక్తి అంటారు. మానసిక భక్తిగా మారి, అది ముఖ్యభక్తి అయినప్పుడు మిగిలింది పరాభక్తి అంటారు. ఈ సూత్రంలో భగవంతుని విభవ రూపాలలో భావించి ప్రేమించడం, దానిని త్రికరణ శుద్ధిగా చేయడం, ఉత్తమ భజనగా చెప్ప బడింది. కాని ఆయన అంతర్యామిత్వాన్ని అర్థం చేసుకొని భజిస్తే పరాభక్తి సిద్ధిస్తుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


02 Oct 2020

No comments:

Post a Comment