🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 124 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నరనారాయణ మహర్షులు - 5 🌻
29. పవిత్రభావంతో ఋషుల చరిత్ర వింటే, ఋషి ఋణం తీరుతుంది. ఋషి ఋణం తీరితే, మిగిలిన ఋణాలు సులభంగా తీరుతాయి. ఋషులు అనుగ్రహిస్తే పితృఋణం తీరుతుంది. వారి అనుగ్రహముంటే ఉత్తమ సర్మ ఫలాలు వస్తాయి. ఋషులు మనమీద అనుగ్రహిస్తే సమస్త యజ్ఞఫలాలూ ఇవ్వగలరు. వాళ్ళ నామస్మరణ మాత్రం చేత, ఇన్ని యజ్ఞాలుచేసే పనిలేకుండానే ఫలంవస్తుంది.
30. ఒక్క ఋషి మాత్రమే – ఒక్కక్షణం మనను అనుగ్రహిస్తే చాలు; నూరు అశ్వమేధయాగాల ఫలం లభిస్తుంది. అంతటి సమర్థుల ఋషులు. అడిగి తెచ్చుకోవాలి. భక్తియుక్తులు, శ్రద్ధ ఉండాలి. మనం దేవతాధ్యానం సంప్రదాయపరంగా చేస్తూంటాంకాని; ఋషులచరిత్రవలన మనకు కలిగే ఫలాలు, దేవతానుగ్రహంవలనకూడా మనకు కలగనంతటి ఉత్కృష్టమైనవి.
31. ఋషులకు సహజంగా మనం సంతానంకాబట్టి, వాళ్ళకు మన యందున్న శ్రద్ధ, అనుగ్రహం దేవతలకు ఉండదు. దేవతలు కర్మాధీనులై ఉంటారు. కర్మవలన, యజ్ఞంవలన దానికి నిర్ణీతమైన సంప్రదాయంలో, శాస్త్రంలో స్మృతులలో ఎలా చెప్పబడి ఉన్నదో అలాంటి ఫలాన్నే వాళ్ళు ఇస్తారు. దానినే అనుగ్రహం అంటారు. కానీ కాస్త భక్తికి అపరిమితంగా సంతోషించి ఇచ్చే ఫలాలన్నీ దైవసంపత్తి – ఈశ్వరుడియొక్క లక్షణములు. ఈశ్వరుడియొక్క లక్షణములు ఋషులయందున్నాయి.
32. ఈశ్వరుడు కర్మాధీనుడు కాడు. దేవతలు కర్మాధీనులు. భవంతుడు అలా కాదు. ఒక్క తులసీదళాన్ని భక్తితో సమర్పిస్తే, తీసుకుని మోక్షాన్నే అనుగ్రహిస్తాడు. లేదా వందసంవత్సరాలు ఈ భూమిని పరిపాలించమని చక్రవర్తిని చేసి తరువాత మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన ఇవ్వటానికి పరిధులులేవు. ఆయన అనుగ్రహానికి అవధులులేవు. కాబట్టి ఋషులు ఈశ్వరస్వరూపులు అనబడతారు.
33. కాబట్టే ఋషుల ఆరాధన ఈశ్వరారాధనతో తుల్యమై అంతటి ఫలాన్ని ఇవ్వగలదు. వాళ్ళు ఈశ్వరుణ్ణి చూపించగలరు. జ్ఞానాన్ని ఇవ్వగలరు. వాళ్ళ అనుగ్రహానికి అవధిలేదు. అందుకని ఈశ్వరారాధన, నిష్కళంకమైన భక్తి అది అందరికీ సులభంగా లభ్యమయ్యే వస్తువు కాదు. కనుక, ఈశ్వరుడి యందు అట్టి భక్తిని ఇవ్వమని అడిగితే, ఋషి ఇవ్వగలడు. మహర్షులే గురువు అనేభావన, సంప్రదాయం ఈ ఋషులవల్లనే.
34. ఇట్టి మహాత్ములుండటంచేతనే ఇది మనకు సిద్ధించిన సంప్రదాయం. ఈ సంప్రదాయం ఇతర మతాలలో లేదు. దీనిని యథార్థంగా నమ్మి ఆ విశ్వాసంతో ఆరాధన చేసినట్లయితే, మన భవిష్యత్తంతా ఋషిప్రోక్తమయిన గురువులుగా, వాళ్ళను తండ్రులుగా, రక్షకులుగా భావించి ఈశ్వరుడిని చేరే మార్గం అర్థించటంలోనే – మన భవిష్యత్తుంది.
35. ఋషులు నిగ్రహానుగ్రహ సమర్థులు. త్రిమూర్తులను చూచినవారు, త్రిమూర్తులనుకూడా శాపగ్రస్తులను చేయగలిగినవాళ్ళు. అపరిమితమయిన శక్తిసామర్థ్యాలు కలిగినటువంటివాళ్ళు. మన భౌతికమైన జీవనవిధానంలో సుఖదుఃఖాలకు హేతువులు పాపపుణ్యాలు.
36. పుణ్యం చేసినా, పాపం చేసినా మనం అల్పమైన శక్తిసంపదలు కలిగిన వాళ్ళమేకాబట్టి; మనకు భౌతికమైన క్షేమాన్ని, సుఖాన్ని ఇవ్వాలంటే, ఈ లోకంలో మనక్షేమాన్ని కోరేవాళ్ళు, మన తండ్రులైన ఋషులే శరణ్యం. వారే ఇక్కడ మనకు సుఖాన్నిస్తారు. ఇవాళ పుణ్యంచేస్తే ఫలితం ఎప్పుడో వస్తుంది మనబోటి సామాన్యులకు.
37. కాని, మనగోత్ర ఋషినిగాని, మహాత్ములైన ఋషులనుకాని, ఋషులరూపంలో ఉన్న గురువులనుకాని ఆశ్రయిస్తే; పుణ్యం ఉన్నాలేకపోయినా ఆ ఫలాన్ని ఇప్పుడే ఇవ్వగల సమర్థులు వాళ్ళు. మన కర్మకాండ, స్మృతులు, మంత్రములు అన్నీ ఋషిప్రోక్తాలే. వాళ్ళ అనుగ్రహంతో మనకు లభించినటువంటి మార్గాలే ఇవన్నీ.
38. ప్రతి మంత్రానికీ దేవతవలె, ఋషికూడా ఒకరున్నారుకదా! అంతే, ఆ మంత్రోపాసనతో ఆ దేవతను ఏ విధంగా ఆరాధన చేయాలో, తద్వారా ఏ ఫలం పొందవచ్చో మనకు చెప్పింది ఋషులే. మరి వారిని స్మరిస్తే ఇక మనకు మిగిలేది ఏముంది?
39. ఒక ముఖ్య విషయం – బ్రాహ్మణులైన మహర్షులు నేడు కూడా బ్రహ్మలోకానికి దిగువన తపోలోకంలో ఉన్నారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
02 Oct 2020
No comments:
Post a Comment