✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 30 🌻
చిత్తము ఏకాగ్రము అవడము అంటే అర్ధము ఏమిటంటే మానవ ఉపాధియందు అంతఃకరణముగా వున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి నాలుగు పనిముట్లు దానియొక్క ఆధారమైనటువంటి జ్ఞాత స్థానములో లయించిపోయినవి. అట్టి జ్ఞాత పరిణామ రహితమైనటువంటి కూటస్థునియందు చేరిపోయింది. ఈ చెరిపోయేటటువంటి విధానాన్నే చిత్తైకాగ్రత అంటారు.
ఏ కూటస్థ శబ్దమైతే నీకు బ్రహ్మముగా బోధించబడుతుందో, బ్రహ్మాండ పంచీకరణకు ఆద్యముగా ప్రధమస్థానమందున్న కూటస్థ పదము ఏదైతే వున్నదో, ఆ కూటస్థ పదము చాలా ముఖ్యమైనటువంటిది. అట్టి కూటస్థ స్థితికి చేరాలి అంటే జ్ఞాతకి కూటస్థుడికి బేధం లేదు అనేటటువంటి స్థితిని నువ్వు సాధించాలి. అంటే అర్ధమేమిటంటే ప్రత్యగాత్మ బ్రహ్మ ఈ రెండూ ఒక్కటే.
జ్ఞాత ప్రత్యగాత్మ. కూటస్థుడు బ్రహ్మము. ఈ ప్రత్యగాత్మ బ్రహ్మ అభిన్నులు అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని నువ్వు పొందాలి. అలాంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే ఈ ఓంకార వాచ్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం వైపుకు నీ స్ఫురణ పనిచేయడం మొదలుపెడుతుంది.
ఎవరైతే నేను కూటస్థుడను, నేను బ్రహ్మమును, నేను పరిణామము లేనివాడను, నేను ఏ మార్పూ లేనివాడను, నేను స్థాణువును, నేను నిరహంకారిని, నేను నిర్గుణుడను, నేను నిరవయవుడును, నేను నిరంజనుడను, నేను నిర్మలుడను అనేటటువంటి నకార పూర్వక లక్షణాలన్నీ ఆ కూటస్థ స్థితిలో ప్రాప్తించడం ప్రారంభిస్తాయి.
ఈ లక్షణముల ద్వారానే పరబ్రహ్మమును స్ఫురింపచేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆట్టి పరబ్రహ్మమును తెలుసుకోవాలి అంటే ఓంకారమును నాలుగు పద్ధతులుగా ఆశ్రయించవచ్చు. అకార ఉకార మకారములనే త్రిమాత్రుకాయుత ప్రణవ ధ్యానం ద్వారా ఆశ్రయించవచ్చు.
అలా కాకుండా (త్రిమాతృకలు కాకుండా) ఒక్కొక్క మాత్రనీ పట్టుకుని ఆశ్రయించేటటువంటి బీజాక్షరములను పట్టుకుని ఉపాసించే విధానమూ కలదు. ఇది కాకుండా అమతృకాయుత పద్ధతిగా కేవల లయయోగ విధాన పద్ధతిగా ఆశ్రయించేటటువంటి పద్ధతిగా కూడా ఓంకారోపాసన చేయవచ్చును.
కారణమేమిటంటే ఈ నాలుగు మాత్రలు కూడా నాలుగు అవస్థలను, నాలుగు శరీరాలను, నాలుగు మాత్రలను తెలియజేస్తూ వున్నవి. నాలుగు శరీరములు ఏమిటివీ - స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములు. వీటి యొక్క వివరణ అంతా కూడా సాంఖ్య విచారణలో స్పష్టముగా బోధించబడుచున్నది. ఉత్తరత్తరా రాబోయేటటువంటి బోధలో అవి కూడా వివరించబడతాయి.
స్థూల శరీరము అంటే తనకు తా కదలనది ఏదియో అది స్థూల శరీరము. సూక్ష్మ శరీరము - చలించుచున్నట్లు కనబడుతున్నప్పటికి స్వయముగా చలింపజాలనిది ఏదియో అదియే సూక్ష్మ శరీరము. స్థూల సూక్ష్మ వ్యవహారము - తాత్కాలికముగా ఉడిగినటువంటి స్థితి ఏదైతే కలదో అది కారణ శరీరము. ఇది కూడా స్వయముగా చలింపజాలదు.
మహా కారణ శరీరము - స్థూల సూక్ష్మ కారణ శరీరములను చలింపజేయుచు తనకు తా స్వయముగా కదులుచున్నట్లు కనపడుచున్నది ఏదో అది మహాకారణ శరీరము. కాబట్టి క్రిందున్న మూడింటికి లయస్థానమూ అయివున్నది, తనకు తా కదలగలిగే శక్తి కలిగి వున్నది, ఇతరులను కలిగించగలిగే శక్తి కూడా కలిగినటువంటి మహాకారణ శరీరము ఏదైతే వున్నదో అది నాలుగవ శరీరము.
ఇవే మరల మనం నాలుగవస్థలుగా దర్శించవచ్చు. అంటే అర్ధమేమిటి? జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయములు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు తమకు తా పనిచేస్తున్నట్లుగా కనబడుతున్నవి గానీ స్వయముగా పనిచేయడం లేదు.
ప్రతిఒక్కరూ జాగ్రదావస్థలో తనకు తా అన్ని పనులను చేస్తున్నట్లుగా చలనములు పొందుతున్నట్లుగా, చలనశీలత కలిగి వున్నట్లుగా, సర్వకర్మలను ఆచరిస్తున్నట్లుగా, ఆచరణ శీలత కలిగివున్నట్లుగా తోచుచున్నప్పటికీ కర్మ వశాత్తూ వారి వారి యొక్క పుణ్య పాప ఫలములను స్వయంకృతములను అనుభవించుట చేత వారు కదులుతున్నట్లు కనబడుతున్నది గానీ స్వయముగా వారికి కదలగలిగే శక్తి లేదు.
అట్లే స్వప్నావస్థయందు ఇంద్రియములు ఏమియూ లేకున్నను చలనశీలమైనట్టి మనసనే ఇంద్రియము ద్వారా మనో బుద్ధి చిత్త అహంకారముల మధ్య ఏర్పడుతున్న మనో వ్యాపార వ్యవహారము చేత కదులుతున్నట్లు కనపడుతున్ననూ అది కూడా స్వయముగా కదలగలిగే శక్తి లేనటువంటిది.
సుషుప్త్యావస్థ యందు జాగ్రత్ స్వప్నములందు ఏర్పడుతున్న కదలికలన్నియు లేమితనమును పొంది సుప్తచేతనావస్థ తాత్కాలికముగా నిరోధించబడి నిగ్రహించబడినట్లు కనబడుచున్నను స్వయముగా కదలిక లేనటువంటి శక్తి లేనందువల్ల జడముగా పడియుండుట అనేటటువంటి స్థితియందు తాను సాక్షిగా నిలబడివున్నటువంటి ప్రజ్ఞా స్వరూపముగా సుషుప్త్యావస్థ జరుగబడుచున్నది. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
02 Oct 2020
No comments:
Post a Comment