శ్రీ శివ మహా పురాణము - 236



🌹 .   శ్రీ శివ మహా పురాణము - 236   🌹
 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
51. అధ్యాయము - 6


🌻. సంధ్య తపస్సును చేయుట - 6 🌻


తన్మధ్యే స దదౌ కన్యా విధవే సప్తవింశతిః | 
చంద్రోsన్యాస్సంపరిత్యజ్య రోహిణ్యాం ప్రీతిమానభూత్‌ || 55

తద్ధేతోర్హి యదా చంద్రశ్శప్తో దక్షేణ కోపినా |
తదా భవత్యా నికటే సర్వే దేవాస్సమాగతాః || 56

న దృష్టాశ్చ త్వయా సంధ్యే తే దేవా బ్రహ్మాణా సహ | 
మయి విన్యస్త మనసా ఖం చ దృష్ట్వా లభేత్పునః || 57

చంద్రస్య శాపమోక్షార్థం జాతా చంద్రనదీ తదా | 
సృష్టా ధాత్రా తదైవాత్ర మేధాతిథి రుపస్థితః || 58

ఆ కన్యలలో ఇరవై ఏడు మందిని ఆయన చంద్రునకిచ్చి వివాహము చేసెను. చంద్రుడు ఇతరభార్యలను పట్టించుకొనక, రోహిణి యందు మాత్రమే ప్రీతిని కలిగియుండెను (55). ఆ కారణముచే దక్షుడు కోపించి చంద్రుని శపించగా దేవతలందరు నీవు ఉన్న ఈ చోటకు వచ్చిరి (56)

ఓ సంధ్యా!బ్రహ్మతో కూడి వచ్చిన ఆ దేవతలను నాయందు లగ్నమైన మనస్సుగల నీవు చూడలేదు. బ్రహ్మ ఆకసమును చూచి, చంద్రుడు తన పూర్వ రూపమును ఎట్లు పొందునో యని చింతిల్లెను (57).

బ్రహ్మ చంద్రుని శాపవిముక్తి కొరకు చంద్రభాగానదిని సృష్టించెను. అదే సమయములో అచటకు మేధాతిథి విచ్చేసెను | (58).


తపసా తత్సమో నాస్తి న భూతో న భవిష్యతి | 
యేన యజ్ఞస్సమారబ్ధో జ్యోతిష్టోమో మహావిధిః || 59


తత్ర ప్రజ్వలితో వహ్నిస్తస్మింస్త్యజ వపుస్స్వకమ్‌ |
 సుపవిత్రా త్వమిదానీం సంపూర్ణోsసుతు పణస్తవ || 60

ఏతన్మయా స్థాపితం తే కార్యార్థం భో తపస్విని | 
తత్కురుష్వ మహాభాగే యాహి యజ్ఞే మహామునేః || 61

తస్యా హితం చ దేవేశస్తత్రై వాంతరధీయత || 62


ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సంధ్యా చరిత్ర వర్ణనం నామ షష్ఠోsధాయః (6).


తపస్సులో ఆయనతో సమానమైన వాడు మరియొకడు లేడు. ఉండబోడు. ఆయన అతివిస్తృతమైన జ్యోతిష్టోమమనే యజ్ఞమునారంభించినాడు (59).

అచట అగ్ని ప్రకాశించుచున్నది. నీవు నీ దేహమును దానియందు విడువుము. ఇప్పుడు నీవు మిక్కిలి పవిత్రురాలవు. నీ ప్రతిజ్ఞ నెరవేరుగాక! (60).

ఓ తపస్వినీ! ఈ తీరున నేను నీ కార్యములను సిద్దింపజేసితిని. ఓ మహాత్మురాలా!నేను చెప్పినట్లు చేయుము. ఆ మహాముని యజ్ఞము చేయుచున్న చోటకు వెళ్లుము (61).

ఇట్లు దేవదేవుడు ఆమెకు హితమునుపదేశించి అచటనే అంతర్ధానము నొందెను (62).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండమునందు సంధ్యా చరిత్ర వర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

No comments:

Post a Comment