కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 105
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 105 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -35 🌻
నాయనా! నీకు వివేకము ఉత్తమముగా పనిచేస్తుంది అనుకో, అప్పుడు తత్వ చింతన చేయి. తత్ త్వం అనేటటువంటి విచారణ చేయి. పొందదగిన లక్ష్యం ఏమిటి? నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను ఉన్నటువంటి స్థితిని ఆ స్థితికి చేర్చడం ఎలా? అనేటటువంటి తత్వ విచారణ, ఆత్మవిచారణ చేపట్టు. బ్రహ్మజ్ఞానాన్ని పొందు. బ్రహ్మనిష్ఠను పొందు.
బ్రహ్మానుసంధానము చేయి, ఇది ఉత్తమమైనటువంటి వివేకముతో చేయవలసినటువంటి పని. అంత స్థాయిలో వివేకము పనిచేయడం లేదు. కొద్దిగా క్రిందకి దిగింది. బుద్ధి స్థాయిలోకి వచ్చేసింది. మనసు స్థాయిలోకి వచ్చేసింది. ప్రత్యగాత్మ స్థితిలో నుంచి క్రిందికి దిగిపోయింది.
గుణమాలిన్యం లోకి దిగి వచ్చేసింది. అప్పుడేమయ్యింది? ఒక మెట్టు జ్ఞాత నుండి క్రిందికి దిగి అంతరేంద్రియాలలోకి దిగి వచ్చేసింది. దిగి వచ్చేసేటప్పటికి ఏమైపోయిందట? కనీసం దానిని ఉద్ధరించాలి అంటే, ‘మధ్యమం మంత్ర చింతాచ’ - మంత్ర జపం అలవాటు చేసుకో! ఇందాక ఏం చెప్పాము? ఆసన సిద్ధి కలిగి ఉండాలి. ప్రాణాయామం చేస్తుండాలి. నిరంతరాయంగా అనులోమ, విలోమ సమప్రాణాయామం 24 గంటలు నిరంతరాయంగా, సహజంగా నీకు జరిగేటట్లుగా నీవు ఆ ప్రాణయామ విధిని నీవు ఆశ్రయించాలి. ఇంకేమి చేయాలి? అదే సమయంలో శ్వాసతో సమంగా నీ ఇష్ట దేవత మంత్రాన్ని జపించు. ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం శివాయ గురవే నమః’, ‘ఓం నమోవేంకటేశాయ’, ‘ఓం శ్రీమాత్రేనమః’ నీ ఇష్టం ఏదైనా పెట్టుకో!
నీ ఇష్టదేవతా మంత్రాన్ని నిరంతరాయంగా జపించు. కాదూ... నీకు గురూపదేశం ఉంది, ఆ గురూపదేశ విధిలో నీకివ్వబడినటువంటి, ఏ మంత్రాలయితే ఉన్నాయో, హంసమంత్రమే కావచ్చు, మహావాక్యములే కావచ్చు, త్రయమే కావచ్చు, పూర్ణమే కావచ్చు, ద్వాదశే కావచ్చు, షోడశే కావచ్చు, పంచదశే కావచ్చు, పూర్ణ దీక్షా పరులు కావచ్చు, ఎవరెవరైతే వారి వారి గురు సంప్రదాయ విధిని అనుసరించి, ఏయే మంత్రములైతే వారికి ఉపదేశించబడ్డాయో, ఆ మంత్రములను నిరంతరాయంగా జపం చేయి. తద్వారా ‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ - మనసు యొక్క చలనములను ఉడిగింప చేసేటటువంటి పద్ధతి మనన శక్తికి, మంత్రశక్తికి ఉంది.
కాబట్టి, శ్రవణము నుంచి మననము, మననము నుంచి సదా మానసిక జపం ద్వారా నీవు పొందేటటుంవంటి, ఏ స్థిరమైనటువంటి స్థితి ఉందో, దానిపేరు ‘నిధి’. ఆ ‘నిధి’ అనేటటువంటి స్థితికి నువ్వు ఎదగాలి. తద్వారా మనసు నుంచి మరలా బుద్ధికి, బుద్ధి నుంచి మరలా ప్రత్యగాత్మకు తిరిగి వెనుకకు మరలగలిగేటటువంటి శక్తి నీకు వస్తుంది. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే శక్తి వస్తుంది.
ఇంకా పడిపోయింది, ఒకవేళ వివేకం ఇంకా బాహ్యానికి వచ్చేసింది, అంతర్ముఖంలో నిలబడడం లేదు. అప్పుడు ‘అధమం శాస్త్ర చింతాచ’ కొద్దిగా వివేకం బాహ్యానికి తిరిగి బయటకి వచ్చేసింది. అప్పుడేమి చెయ్యాలయ్యా? ఒక భగవద్గీతో, ఒక వివేకచూడామణో, ఒక అష్టావక్రగీతో, ఒక వేదాంతపంచదశో... ఇట్లా తత్త్వచింతనకు సంబంధించినటువంటి శాస్త్రములను విచారణ చేయి.
ఎందుకంటే, 24 గంటలు అంతర్ముఖంలోనే నీవు నిర్వికల్ప సమాధి నిష్ఠుడై కూర్చుంటే నీ వ్యవహారములు జరిగేటటువంటి జీవన శైలి, ప్రారబ్ద యుతమైన కర్మ నీకు అనువుగా ఉండాలి కదా! అలా లేకపోయినప్పటికీ ఏమీ భయపడనక్కర్లేదు. ఒక రోజు మొత్తం మీద అంతాకూడా ఈ నాలుగు స్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి, నీవు వివేకము యొక్క స్థాయిని బట్టి నీ సాధనలను ఏర్పాటు చేసుకో! ఆయా సాధనా విధులననుసరించి నీవు ఆ శాస్త్ర చింతన చేయి.
తద్వారా ఏమైంది? రోజుకి ఆరుగంటల సేపు నిద్ర, ఒక ఆరుగంటల సేపు స్వాధ్యయనము, ఒక ఆరుగంటల సేపు సాధన, ఒక ఆరుగంటల సేపు దైనందిన జీవితము. ఈ రకంగా నీ ఇరవై నాలుగు గంటలను కనుక నీవు సరిగ్గా ఏర్పాటు చేసుకున్నట్లయితే, వరుసగా ఏకబిగిన 6 గంటలు ఎవరూ ఏమీ చేయరు. అధవా ఉద్యోగానికి వెళ్తే తప్ప. సరే ఉద్యోగ విధిలో నీవు వరుసగా కూడా ఏక బిగిన ఆరుగంటలు చేసేదేమీ ఉండదు. అక్కడ కూడా నీకు మధ్య మధ్యలో అంతరాయములు ఏర్పడుతూ ఉంటాయి.
వింతైన విషయం ఏమిటంటే, అదే పనిగా వ్యవహారంలో నిమగ్నమైన వాడికంటే, ఈ ఆధ్యాత్మిక సాధన యందు ఆరితేరినటువంటి వాడి బుద్ధి మరింత సూక్ష్మ తరముగా, సూక్ష్మ తమముగా పనిచేయడం వల్ల ఇతరులకు ఎంతో తన్నుకుంటే కానీ అర్థం కానటువంటి విశేషాలు, రానటువంటి ధైర్యాలు వీడికి రెప్పపాటులోనే కలుగుతాయి.
సులభసూత్రంగా కలుగుతాయి. అందువలన వ్యవహారంలో లోటుపాట్లు వస్తాయని, భయపడాల్సిన అవసరం లేదు. అందరూ వ్యవహారంలో ఉత్తములుగానే ఉంటారు. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
17 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment