గీతోపనిషత్తు - 77


🌹. గీతోపనిషత్తు - 77 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 15. బుద్ధిమంతుడు - కర్మ యందు గాని, అకర్మ యందు గాని దైవము బోధించినది యుక్త స్థితి, అనగా యోగస్థితి. దైవముతో స్మరణ మార్గమున యోజించి చేయుట ద్వారా, చేయకుండుట ద్వారా మోక్షస్థితి యందు నిలువవచ్చునని దైవము తెలిపిన రహస్యము. అట్లు చేయువాడు మనుష్యులలో బుద్ధిమంతుడు.🍀


📚. 4. జ్ఞానయోగము - 16, 17, 18 📚


కిం కర్మ కి మకర్మేతి కవయ్కో వ్యత్ర మోహితాః |

తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే 2 శుభాత్ || 16


కర్మణో హ్యపి బోద్ధవ్యం బోధవ్యం చ వికర్మణః |

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణా గతిః || 17 


కర్మణ్యకర్మ యః పశ్యే దకర్మణి చ కర్మ యః |

స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్న కర్మకృత్ || 18


కర్మ మెట్టిది? అకర్మ మెట్టిది? అను విషయమున పండితులు కూడ మోహము చెందుచున్నారు. అట్టి కర్మ రహస్యమును నేను నీకిపుడు తెలుపుచున్నాను. దీనిని తెలిసి నీవు బంధము నుండి విముక్తుడవు కాగలవు అని కూడ తెలిపినాడు.

చేయుట, చేయకుండుట అను విషయము చాల లోతైనది. వాస్తవికముగ ఎవ్వరును కర్మ విషయమున స్పష్టముగ వివరించి తెలియజెప్పలేరు. కర్మ స్వరూపమును వివరించుచు శ్రీకృష్ణుడిట్లను చున్నాడు. “చేయుటలో, చేయకుండుట యున్నది.

అదెట్లనిన, సంభాషించుచు నడచుచున్నపుడు, నడచినట్లు తెలియదు. సంభాషించుచు వాహనము నడుపునపుడు, వాహనము నడుపుచున్నా నన్న భావముండదు. ప్రయాణమున సంభాషణ జరుగు చున్నపుడు, ప్రయాణము సాగినట్లే తెలియదు.

ఇట్లు చేయుటలో చేయకపోవుట యున్నది. పై ఉదాహరణమునందు ఒక రహస్యము గోచరించు చున్నది. రసవత్తరమగు సంభాషణమున, నడక - ప్రయాణము జరుగుచున్నవి గాని, చేయుచున్నట్లనిపించవు. ఇచ్చట నడక ప్రయాణము, పరధ్యానముగ జరుగుచున్నవి.

అదే విధముగా పరమును (దైవమును) స్మరించుచూ పనులు జరిపినచో తాను దైవము నందుండుట, పనులు జరుగుట యుండును. భక్తులు మహత్కార్యము లన్నియు ఇట్లే నిర్వర్తించిరి. వారు దైవమున రుచిగొని యుండగ, పనులు జరిగినవి. ఇట్లు జరిగినపుడు కర్తృత్వ భావన కూడ యుండదు.

అనగా తాను చేయుచున్నానను భావన యుండదు. అతడు దైవముతో యుక్తుడగుటచే, అతని నుండి కర్మలు జరిగినవి. "యుక్తః కర్మకృత్" అని పలుకుటలో, నా స్మరణమున నిలిచి కర్మ లాచరింపుము. అపుడు చేయుటలో చేయని స్థితి అనుభూతమగును.

అట్లే చేయకుండుటలో చేయుట యున్నది. ఏమీ చేయకుండ కూర్చున్న వానియందు కూడ మనసు ఆలోచన చేయుచునే యుండును. అట్లు చేయకపోవుటలో చేయుట యున్నది. ఆ చేయుట మానసికము. మునుల తపస్సు యిట్లే సాగుచుండును.

వారేమియు చేయుచున్నట్లు గోచరింపదు. కాని వారి తపశ్శక్తి లోకములను కూడ చలింపచేయ గలదు. ధ్యాన యోగులు చేయక చేయుదురు. కర్మయోగులు చేయుచు చేయరు.

చేయక చేసిన జ్ఞానయోగులు ఇటీవలి కాలమున శ్రీ అరవింద యోగీంద్రులు, మాస్టర్ సి.వి.వి., రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, షిరిడీ సాయిబాబా. చేయుచు చేయని వారు మదర్ (శ్రీమాత, పాండిచేరి), మాస్టర్ ఇ.కె., వివేకానంద స్వామి, శ్రీ సత్య సాయిబాబా, పై రహస్యము తెలిసి యుద్ధము చేయుచు చేయనివాడుగ నీవుండుమని అర్జునునికి తెలిపెను. యుద్ధము చేయక చేయు వానిగ శ్రీకృష్ణుడు నిలచెను.

కర్మ యందుగాని, అకర్మ యందుగాని దైవము బోధించినది యుక్త స్థితి, అనగా యోగస్థితి. దైవముతో స్మరణ మార్గమున యోజించి చేయుట ద్వారా, చేయకుండుట ద్వారా మోక్షస్థితి యందు నిలువవచ్చునని దైవము తెలిపిన రహస్యము. అట్లు చేయువాడు మనుష్యులలో బుద్ధిమంతుడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Nov 2020

No comments:

Post a Comment