రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
65. అధ్యాయము - 20
🌻. సతి కైలాసమునకు పయనమగుట - 1 🌻
నారుదుడిట్లు పలికెను -
ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! శివభక్తశ్రేష్ఠా! ప్రభూ! అద్భుతము, మంగళములకు పెన్నిధియగు శంభుని చరితమును వినిపించితివి (1). తండ్రీ! తరువాత ఏమైనది? సర్వపాప సమూహములను నశింపజేయు సతీ చంద్రశేఖరుల దివ్యచరితమును చెప్పుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
భక్తులయందు దయను చూపే శంకరుడు నన్ను వధించే యత్నమునుండి నివృత్తుడు కాగా, సర్వులు భయమును వీడి సుఖమును, ప్రసన్నతను పొందిరి (3).వారందరు శిరసా ప్రణమిల్లి దోసిలి యొగ్గి శంకరుని భక్తితో స్తుతించి ఉత్సాహముతో జయధ్వానమును చేసిరి (4).
ఓ మహర్షీ! అదే సమయములో నేను భయమును వీడి ప్రసన్నమగు మనస్సుతో భక్తితో వివిధ మంగళ స్తోత్రములతో శంకరుని స్తుతించితిని (5). అపుడు అనేక లీలలను ప్రదర్శించే శంభు ప్రభుడు సంతసించెను. ఓ మహర్షీ! అపుడాయన అందరు వినుచుండగా నాతో ఇట్లనెను (6).
రుద్రుడిట్లు పలికెను -
ఓ వత్సా! బ్రహ్మా! నేను ప్రసన్నుడనైతిని. నీవు ఇపుడు భయమును విడవాడి, చేతితో నీతలను పట్టు కొనుము. నీవు సంశయమును వీడి నా ఆజ్ఞను పాలింపుము (7).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అనేక లీలలను ప్రదర్శించే శంభుప్రభుని ఈమాటను విని, నేను నా శిరస్సును సృశించుచూ, అటులనే ఉండి వృషభధ్వజుని నమస్కరించితిని (8). నేను ఎంతలో నా శిరస్సును నా చేతితో స్పృశించితినో, అంతలో అచట వృషవాహనుడగు శివుని రూపము ఉండెను (9).
నేను అపుడు సిగ్గుచే ముడుచుకున్న అవయవములు గలవాడనై తలవంచి నిలబడితిని. అచట అంతటా ఉన్న ఇంద్రాది దేవతలందరు స్పష్టముగా చూచినారు (10). తరువాత నేను సిగ్గుతో నిండిన వాడనై మహేశ్వరునకు ప్రణమిల్లి, చక్కనిస్తోత్రమును చేసి, 'క్షమించుము క్షమించుము' అని పలికితిని (11).
హే ప్రభో! ఈ పాపము క్షాళితమయ్యే ప్రాయశ్చిత్తమును చెప్పుము. ఈ నా పాపము తొలగి పోవుట కొరకై, ఇంద్రియనిగ్రహమును, వివేకబుద్ధిని ప్రసాదించుము (12). భక్తవత్సలుడగు సర్వేశ్వరునితో నేను ఇట్లు పలికి నమస్కరించగా, ఆ శంభుడు మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (13).
శంభుడు ఇట్లు పలికెను -
నేను శిరస్సును అధిష్ఠించియున్న ఈ రూపముతోనే, నీవు ప్రసన్నమగు మనస్సు గలవాడవై, నన్ను ఆరాధించుటలో నిమగ్నమై తపస్సును చేయుము (14). లోకములో సర్వత్రా నీకు రుద్ర శిరస్కుడు అను పేరు ప్రసిద్ధి గాంచ గలదు. తేజశ్శాలులగు బ్రాహ్మణులకు సర్వకార్యములను నీవు సిద్ధింపచేయ గలవు (15).
నీకు జరిగిన ఈ వీర్యపతనము మానవుల లక్షణమై యున్నది. కాన నీవు నముష్యుడవై భూలోకములో సంచరించుము (16). నీవు భూలోకములో సంచరించుచుండగా నిన్ను ఎవరు చూచెదరో, వారు 'ఇది యేమి? బ్రహ్మ శిరస్సుపై శివుడు ఉన్నాడు' అని పలికెదరు (17).
ఈ నీ వృత్తాంతమునంతనూ ఉత్సుకతో ఎవరు విందురో, వారు పరదారయందలి రాగము అనే దోషమునుండి విముక్తులై శీఘ్రముగా మోక్షమును పొందగలరు (18). జనులు ఎంత అధికముగా నీవు చేసిన పనిని చెప్పుకొనెదరో, అంత అధికముగా నీ పాపము తొలగి శుద్ధిని పొందగలవు (19).
ఓ బ్రహ్మా! నేను నీకు చెప్పే ప్రాయశ్చిత్తమిదియే. జనులు నీ గురించి పరిహాసమును చేయుట, లోకములో నీపై తీవ్రమగు జుగుప్స అనునవి నీకు ప్రాయశ్చిత్తము (20). ఈ వేది మధ్యలో కామార్తుడవగు నీ వీర్యము స్ఖలించుటను నేను గమనించితిని. ఈ వీర్యము ధరింపయోగ్యము కాజాలదు (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
17 Nov 2020
No comments:
Post a Comment