కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 115


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 115 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -45 🌻


ఎందుకని అంటే, మిగిలిన వాని యొక్క ప్రభావము చైతన్యము మీద లేకుండా, ముద్రితము కాకుండా, ప్రారబ్ద కర్మ విశేషము అనుభవించబడి, ఆగామి కర్మగా మారకుండా, కొత్త సంస్కారాలు తయారవ్వకుండా, కొత్తవాసనలు తయారవ్వకుండా, కొత్త స్మృతి బలం ఏర్పడకుండా, అనేక జన్మార్జిత విశేషములంతా కూడా కర్మ బంధ రూపములో ఉన్నదానిని అధిగమించి, సాక్షీ భూతుడై, ఆ కర్మబంధానికి అతీతుడై, త్రిపుటికి అతీతుడై, జీవించ వలసినటువంటి లక్ష్యాన్ని తాను స్వీకరించి, నిరంతరాయంగా ఆ పనిలో ఉండాలి.

ఏమండీ, పొద్దున నుంచీ రాత్రి వరకూ మీరు ఖాళీగానే ఉన్నారు కదండీ! అని అంటారే అనుకోండి, నేను చాలా బిజీగా వుంటానండీ! ఏమి చేస్తుంటారండీ? మీరేమీ కరచరణాద్యవయవములతో మీరేమీ కదిలించినట్లు కనబడలేదు, ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి పనులు చేసినట్లు కనబడలేదు, ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి ఫలితాలు కూడా వచ్చినట్లు కనపడలేదే? అని అంటే, అంతకంటే పెద్ద పనిలో ఉన్నానండీ! అని అంటారు.

ఏమిటది అంటే, సూక్ష్మశరీరాన్ని బాగు చేసే పనిలో ఉన్నాడు. కారణశరీరాన్ని గుర్తించే పనిలో ఉన్నాడు. మహా కారణ శరీరాన్ని గుర్తించే పనిలో ఉన్నాడు. మహాకారణ స్థితిలో నిలకడ చెంది, సూక్ష్మ కారణ శరీరాల్ని రద్దు పరుచుకునే పనిలో ఉన్నాడు. శరీరత్రయ సాక్షిత్వాన్ని సంపాదించే పనిలో ఉన్నా డు.శరీర త్రయం విలక్షణత్వాన్ని సంపాదించే పనిలో ఉన్నా డు. పంచకోశ నిరసన చేసే పనిలో ఉన్నాడు.

కాబట్టి, ఇంతకంటే పెద్ద పని ఏమున్నదయ్యా? అంటే, ఇంతకంటే పెద్దపని ఏమీ లేదు. అన్నిటికంటే పెద్ద పని ఈ పని. కానీ మనం ఏం చేస్తున్నామంటరోజువారీ జీవితంలో. ఆయా గోళకముల ద్వారా బయటకు వ్యాపించకుండా ఇంద్రియాలను వెనక్కు తీసుకోవడమే సాధన. మనస్సును విరమింపచేయటమే సాధన.

అంతరముగా నున్నటువంటి మనస్సు లోపలికి, గోళకాలని, ఇంద్రియాలని, తన్మాత్రలని వెనక్కి విరమించి, అందులోకి చేర్చాలి. అట్లా చేర్చిన తరువాత, మనస్సును దాని స్వస్థానమైనటువంటి, బుద్ధి యందు చేర్చాలి. ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖంగా వెళ్ళకుండా ఉంటుందో, దానికి సహజమైనటువంటి గతి, పరిణామశీలత ప్రయాణం తప్పక అంతర్ముఖంలోకి ప్రయాణిస్తుంది. ఇట్టి అంతర్ముఖ ప్రయాణం కలిగినటువంటి మానవుడే సరియైనటువంటి మానవుడు.

నిజ మానవుడు అనటానికి అర్హమైనవాడు ఎవడైనా ఉన్నాడా? అంటే, ఎవరైతే సాధన చతుష్టయ సంపత్తి కలిగి, ఎవరైతే యమనియమాది అష్టాంగ యోగ విధిని ఎఱిగి, ఎవరైతే విషయవ్యావృత్తి లేకుండా, ఎవరైతే బహిర్ముఖత్వం లేకుండా, ప్రవృత్తి మార్గంలో ప్రవేశించకుండా, నివృత్తి యందు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ సాంఖ్య విజ్ఞానాన్ని కరతలామలకంగా తెలుసుకొన్నటువంటి వారు. స్వాధ్యాయం చేయుదురు. ఏకాగ్రంగా చిత్తాన్ని నిలబెట్టుకోగలిగే వాళ్ళు.

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అత్యంత విలువైనది ఆత్మస్వరూపము. అత్యంత విలువైన ఆత్మస్వరూపాన్ని సూక్ష్మంగా పట్టుకోవాలే కానీ, దానిని స్థూలంగా వస్తురూపంగా చూపెట్టటం సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. అధవా నువ్వు వస్తురూపంగానే నేను గ్రహిస్తాను అంటే, సమస్త వస్తుజాలము ఆత్మయందు అంశీభూతములే! అనేటటువంటి ఒకే ఒక నిర్ణయ వాక్యం మాత్రమే పనికి వస్తుంది.

ఓ గిన్నెలాగా, ఓ బిందెలాగా, ఒక ఇల్లులాగా, ఒక శరీరంలాగా, ఒక ఇంద్రియంలాగా, ఒక గోళకం లాగా, ఒక తినే పదార్థంలాగా చూపెట్టాలి అంటే, ఆ రకమైనటువంటి పరిమితమైనటువంటి స్థితిగా ఉండేది కాదు. సర్వ వ్యాపకమైనటువంటిది, సర్వకాలములందు, సర్వత్రా సాక్షీభూతమైనటువంటి ఏదైతే స్థితి ఉన్నదో, ఆ స్థితికి ఆత్మ అని పేరు.

కాబట్టి, ఆత్మ వస్తువు లేకుండా, అసలు దేనికీ ఉనికే లేదు. ఈ సృష్టి, ఈ విశ్వం మొత్తం మీద, దేనికైనా ఒక దానికి ‘ఉండుట’ అనేటటువంటి స్థితి అంటూ ఉన్నదంటే, అది దేనివలన ఉన్నదయ్యా? అంటే ఆత్మ వలననే ఉన్నది. కాబట్టి, దేనికైనా ‘ఉండుట’ అనేటటువంటి స్థితిని అనుగ్రహింప గలిగేటటువంటి సమర్థవంతమైనటువంటిది ఆత్మ.

సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రములున్నవి. పంచభూతములు ఉన్నవి. జీవరాశి ఉన్నది, వృక్షరాశి ఉన్నది. ఇలా ఈ వ్యాపకమైనటువంటి జగత్తునిండా ఎన్నైతే ఉన్నవి, ఉన్నవి, ఉన్నవి... అంటున్నావో అవన్నీ ఉన్నవి అంటున్నటువంటి స్థితికి సర్వాధారమైనటువంటిది ‘ఆత్మ’.

ఆ సర్వాధారమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే, మార్గమేది? తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి మనోబుద్ధులను బహిర్ముఖముగా పోనివ్వక, అంతర్ముఖము వైపు త్రిప్పి, వాటిని తమ స్వస్థానమైనటువంటి, మహతత్త్వము, అవ్యక్తమును దాటించి, ప్రత్యగాత్మ స్థితి యందు నిలకడ కలిగేటట్లు చేయుట. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


28 Nov 2020

No comments:

Post a Comment