భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 170


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 170 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భరద్వాజ మహర్షి - 1 🌻

జ్ఞానం:


01. భరద్వాజ మహర్షి సప్తర్షులలో ఒకరు. పరమ ప్రశాంతచిత్తుడు. ఆయన తపస్సు చేసిన ఆశ్రమానికి ‘భరద్వాజ తీర్థ’మని పేరువచ్చింది. బృహస్పతి, వదినగారు అయిన మమతను మోహించాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న మమత గర్భంలోని శిశువు బృహస్పతి యొక్క వీర్యాన్ని తన్నివేశాడు. “నా వీర్యం వల్ల పుట్టిన ఈ పిల్లవాడిని నీవే పెంచుకో” అన్నాడు బృహస్పతి. అంటే ఆమె, “పాపం వల్ల పుట్టిన వాడు వీడు. కాబట్టి నేను పెంచను” అన్నది. ఆ విధంగా ఇద్దరి చేత వదిలి పెట్టబడిన వాడు కాబట్టి అతడికి ‘ద్వాజుడు’ అని పేరు వచ్చింది.

02. పురాణాలలో ఉన్న ఒక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎంత పెద్దవాడయినా ఎంతటి తప్పుచేసినా దాపరికం లేకుండా చెపుతాయి. Honest reporting. వాళ్ళు పరమ పూజ్యులు అని చెప్పదలచుకుంటే వాళ్ళ తప్పులన్నీ దాచి ఉంచి రాయాల్సివస్తుంది. కాని అలాకాక, పురాణం వాళ్ళు చేసిన తప్పులతోపాటు వాళ్ళమహత్తుకూడా చెపుతుంది.

03. ఒక ఉద్బోధం ఏమిటంటే, ఎంతటి తపస్సంపన్నులయినా, దేవతలైనా జ్ఞానంలేని సమయంలో దోషకరమైన పనులుచేసే అవకాశం ఉంది. అందుకని మనుష్యులు జాగ్రదవస్థలో ఉండాలని మనకు ఉద్బోధం అది.

04. అజ్ఞానం అనేది ఎవరినయినా పట్టుకోవచ్చు. ఇంద్రుణ్ణి అయినా, బృహస్పతి అయినా, దేవతలయినా ఎవరినయినాకూడా అది ఆవరించవచ్చు. జాగ్రత్తగా ఉండమని బోధిస్తుంది పురాణం. దాంట్లో ఉన్న అంతరార్థం చాలా విశేషమయింది.

05. పురాణాలను సమర్ధించడం, అన్వయించటం అంత సులభంకాదు. అందుకు స్థూలదృష్టి రెండూ కూడా ఉండాలి. రామాయణం చరిత్రయే. పురుషోత్తముడి చరిత్ర. మానవ మాత్రుడై పుట్టిన భగవంతుడు ఎన్ని కల్యాణ గుణములు కలిగిన వాడో అది అలా తెలుసుకుంటేనే మనకు లాభం. అందులోనే మాధుర్యం ఉంటుంది.

06. అంతేకాని, రాముడంటే కేవలం ఆత్మ-సీత అంటే ప్రకృతి అనే తాత్వికార్థంమాత్రమే చెబితే, సామాన్యుడికి అందులో నిత్యజీవనానికి అవసరమయ్యే స్ఫూర్తి ఏమీ కలుగదు. అందువల్ల గాథను గాథగానే చెప్పాలి, తాత్వికార్థాన్ని ఆ భూమికలో అలాగే ఉంచాలి. అది వివరించేటప్పుడు అలాగే అన్వయించాలి. ఆ తాత్వికదృష్టితోకూడా మనం సమన్వయించి చెప్పటమే ఉచితం తప్ప, కేవలం తాత్వికదృష్టివలన ఉపయోగం లేదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 Nov 2020

No comments:

Post a Comment