రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
67. అధ్యాయము - 22
🌻. సతీ శివుల విహారము - 3 🌻
వివిధ మృగముల గుంపులతో కూడి యున్నది, వందలాది సరస్సులతో నిండియున్నది, గణములన్నింటిలో గొప్పది యగు మేరు పర్వతము కంటె గూడ గొప్పది, సుందరమైనది అగు నా కైలాసమునందు నివసించగోరు చుంటివా?(50), ఈ స్థానములలో నీకు దేనిపై మనసు గలదో నాకు వెంటనే చెప్పుము. నీకు నేను అచట నివాసమును ఏర్పరచెదను (51).
బ్రహ్మ ఇట్లు పలికెను -
శంకరుడిట్లు పలుకగా, అపుడు దాక్షాయణీ మహాదేవునితో తన మనస్సులోని మాటను ప్రకటించుచూ మెల్లగా ఇట్లనేను (52).
సతి ఇట్లు పలికెను -
నేను నీతో గూడి హిమవత్పర్వతమునందు మాత్రమే నివసించగోరెదను. ఆ మహాపర్వతమునందే శీఘ్రముగా గృహమును నిర్మించుము (53).
బ్రహ్మ ఇట్లు పలికెను -
శివుడా మాటను విని మిక్కిలి మోహమును పొందివాడై దాక్షాయణితో గూడి ఎత్తైన హిమవత్పర్వత శిఖరమునకు వెళ్లెను (54). సిద్ధాంగనలచట గుంపులుగా నుండిరి. పక్షులు కూడా అచటకు వెళ్లలేవు. సుందరమైనది, సరస్సులతో వనములతో ఒప్పారునది (55),
విచిత్ర రూపములు గల కమలములతో కూడియున్నది, రత్నముల విచిత్ర కాంతులతో ప్రకాశించునది, ఉదయించే సూర్యుని పోలియున్నది అగు ఆ శిఖరముపై శంభుడు సతీ దేవితో గూడి చేరెను (56). ఆ శిఖరముపై మేఘములు స్ఫటికము వలె తెల్లగ నుండెను. ఆ శిఖరము పచ్చిక బీళ్లతో, చెట్లతో, వివిధమైన రంగులు గల పుష్పములతో మరియు సరస్సులతో కూడి యుండెను (57).
చెట్లు కొమ్మల అగ్రములు పూలతో నిండి యుండెను. వాటి చుట్టూ భ్రమరములు తిరుగుతూ శబ్దము చేయు చుండెను. పద్మములు, వికసించిన నల్ల కలువలు సరస్సులలో నిండియుండెను (58). చక్రవాకములు, కలహంసలు, హంసలు, బాతులు, మదించిన సారస పక్షులు, క్రౌంచ పక్షులు, గరుడ పక్షులు ధ్వనులను చేయుచుండెను (59).
మత్త కోకిలలు మధురముగా కూయుచుండెను. ప్రమథ గణములు, కిన్నరులు, సిద్ధులు, అప్సరసలు, యక్షులు (60), విద్యాధర స్త్రీలు, దేవతాస్త్రీలు, కిన్నరస్త్రీలు అచట విహరించుచుండిరి. పర్వత వాసులైన ముత్తయిదువలు, కన్యలు అచట నివసించి యుండిరి (61).
విద్వాంసులచే వీణ, మృదంగ, పటహములు వాయించబడు చుండగా, అప్సరసలు ఉత్సాహముతో నాట్యమాడు ఆ శిఖరము శోభిల్లెను (62). అచట దేవతలు నిర్మించిన దిగుడు బావులలో నీరు పరిమళభరితమై నిండుగా నుండెను. అచటి లతా గృహములు నిత్యము వికసించిన పుష్పములతో శోభిల్లెను (63).
హిమవంతుని పురమునకు సమీపరములో ఈ విధముగా శోభిల్లే శిఖరమునందు వృషభధ్వజుడు సతీదేవితో గూడి చిరకాలము రమించెను (64). స్వర్గముతో సమానమైన ఆ స్థానము నందు శంకరుడు సతీదేవితో గూడి పదివేల దివ్య సంవత్సరముల కాలము ఆ నందముతో విహరించెను (65).
ఆ శివుడు ఒకప్పుడు ఆ స్థానము నుంéడి మరియొక స్థానమునకు వెళ్లెడివాడు. సర్వదా దేవతలతో, దేవతాస్త్రీలతో సేవింపబడే మేరు శిఖరమునకు ఆయన మరియొకప్పుడు వెళ్లెను (66). సతీదేవి అనేక ద్వీపములను, ఉద్యానములను, వనములను, భూమండలమును అనేక పర్యాయములు దర్శించి, మరల అదే స్థలమునకు మరలి వచ్చి సుఖముగా రమించెను (67). శంభునకు పగలు రాత్రి భేదము ఎరుక లేకుండెను. ఆయన పరబ్రహ్మ ధ్యానమును వీడి మనస్సును సర్వదా సతియందు నిలిపి, ఆమెను ప్రేమించెను (68).
అదే తీరున సతీ దేవి సర్వదా మహాదేవుని ముఖమునే చూచెడిది. మహాదేవుడు కూడా అన్ని వేళలా అన్నింటియందు సతీముఖమునే దర్శించెను (69). ఈ విధముగా ఆ ఉమా పరమేశ్వరులు ఒకరితో నొకరు కలిసి యుండి ప్రేమ భావన యను జలములతో అనురాగమనే వృక్షమును వర్ధిల్ల జేసిరి (70).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో ఉమాపరమేశ్వర విహార వర్ణనమనే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
28 Nov 2020
No comments:
Post a Comment