గీతోపనిషత్తు - 85
🌹. గీతోపనిషత్తు - 85 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 23. ఇంద్రియ యజ్ఞము - దైవమునకు సమర్పణ చెంది ఇంద్రియముల నుండి పొందు అనుభూతిని దైవ సంకల్పముగ స్వీకరించుట యొక యజ్ఞము. ఇంద్రియముల ద్వారా, ఇంద్రియార్థముల నుండి పొందు అనుభూతిని దైవముగ చూచినప్పుడు సంయమము దక్కును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 26 📚
శ్రోత్రాదీ నింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీ న్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి || 26
చూచునది, వినునది, వాసన చూచునది, రుచి చూచునది, స్పృశించునది దైవమే అని భావన చేసి జీవించినచో అది ఇంద్రియ యజ్ఞము కాగలదు. దైవమునకు సమర్పణముగ ఇంద్రియార్థములు, యింద్రియములందు హోమ చేయబడుచున్నట్లుగా ఈ యజ్ఞము నిర్వర్తింపబడును. తత్కారణముగా, దైవము యింద్రియముల ద్వారా కూడ, రసోపేతముగ అనుభవింపబడును.
ఇంద్రియ నిగ్రహము :
పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచప్రాణములు. ఇట్లు నాలుగు పంచారములతో కూడినది శరీరము. పంచప్రాణము లాధారముగ మిగిలిన పంచారములు పనిచేయుచు నుండును. ప్రాణ మాధారముగనే దేహ మేర్పడు చున్నది. ఇందు జీవుడు త్రిగుణాత్మకుడై జీవించు చుండును.
త్రిగుణముల కావల దైవముండును. దైవమే ప్రాణముగను, ప్రజ్ఞగను వుండును. దైవము త్రిగుణముల నుండి ప్రతిబింబింపగ జీవుడేర్పడును. కావున జీవుడు త్రిగుణములకు బద్ధుడై దైవమందించు ప్రాణ, ప్రజ్ఞ లాధారముగ తనదైన జీవితము జీవించు చుండును.
తానొకడున్నాడను భావమున జీవించు చుండును. అతడు జీవిత మనుభవించుటకు దేహమాధారమై యుండును. దేహము లేనిదే జీవుడే అనుభూతియు పొందలేడు. అట్టి దేహమందు తన్మాత్రలు, ఇంద్రియములు త్రిగుణాత్మకుడగు జీవుని బాహ్యముతో సంబంధము కలిగించి అనుభూతుల నొసగును.
ఇంద్రియములు, తన్మాత్రలు లేనిదే జీవు డే అనుభూతియు చెందలేడు. తన్మాత్రలనగా వినుట, చూచుట, స్పర్శించుట, రుచి చూచుట, వాసన చూచుట అను ప్రజ్ఞలు. ఈ ప్రజ్ఞలు పని చేయుటకు వాహనములుగ లేక వాహికలుగ లేక యంత్రములుగ ఐదింద్రియము లున్నవి.
అవియే పై వరుసలో చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు ఐదు ప్రజ్ఞలున్నను, ఐదు వాహికలు లేనిచో అనుభూతి లేదు. అనగా వినుట యను ప్రజ్ఞ చెవి లేనిచో పనిచేయదు. చెవి యున్నను వినుట లేనిచో అది అలంకారప్రాయమే. ఇట్లు ఇంద్రియములు, తన్మాత్రలు ఒకదాని నొకటి నాధారము చేసుకొని జీవుని కనుభూతి నిచ్చుచున్నవి.
అనుభూతి సుఖానుభూతి కావచ్చును, దుఃఖానుభూతి కూడ కావచ్చును. సుఖ దుఃఖములు, బాధ ఆనందములు. ఇట్టి ద్వంద్వానుభూతులు జీవునకు కలుగుచుండును. కొన్ని శబ్దములు విన్నచో ఆనందముగ నుండును. అట్లే కొన్ని శబ్దముల వలన బాధ కలుగును. ద్వంద్వముల కతీతమైనటువంటిది భగవత్ తత్త్వము.
దానిని పొందవలెనన్నచో చెవి ద్వారా విను రెండు రకముల విషయము లందును, కన్ను ద్వారా చూచు రెండు రకముల విషయములు, అట్లే మిగిలిన యింద్రియముల ద్వారా పొందు ద్వంద్వముల యందు దైవమును చూచుట ఒక యజ్ఞము. ఇంద్రియముల ద్వారా, ఇంద్రియార్థముల నుండి పొందు అనుభూతిని దైవముగ చూచినప్పుడు సంయమము దక్కును.
అట్లు దక్కుటవలన విషయముల యందలి ద్వంద్వములు హోమము చేయబడి దైవము నిలచును. ఇంద్రియములను, శబ్దాది విషయములను హోమము చేయుట యనగా నిదియే. దైవమునకు సమర్పణ చెంది ఇంద్రియముల నుండి పొందు అనుభూతిని దైవ సంకల్పముగ స్వీకరించుట యొక యజ్ఞము. అంతియేగాని ముక్కు, చెవి, కనుగుడ్లు పెరకి హోమము చేయుట కాదు.
ఇంద్రియ నిగ్రహము కూడ దైవమును ఇంద్రియముల ద్వారా గ్రహించునప్పుడే కలుగును కాని, నిగ్రహించుటకు పాషాండ ప్రవర్తనములు పనికి రావు. పాషండ మార్గమున ప్రయత్నించు నిగ్రహములు రజోగుణ ప్రేరితములు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
28 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment